Share News

Ramoji rao Memorial Meet: కూటమి విజయ వార్త విన్న తర్వాతే రామోజీ రావు ప్రాణాలు విడిచారు: డిప్యూటీ సీఎం పవన్

ABN , Publish Date - Jun 27 , 2024 | 06:25 PM

ఈనాడు, రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు, మీడియా దిగ్గజం రామోజీరావు సంస్మరణ సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తాను చూసిన రామోజీరావులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయని పేర్కొన్నారు. సినిమాలు చేసే సమయంలో రామోజీరావుతో ప్రత్యక్ష అనుబంధం లేదని, అయితే 2008లో నేరుగా ఒకసారి రామోజీరావును కలిసి మాట్లాడానని గుర్తుచేసుకున్నారు.

Ramoji rao Memorial Meet: కూటమి విజయ వార్త విన్న తర్వాతే రామోజీ రావు ప్రాణాలు విడిచారు: డిప్యూటీ సీఎం పవన్
Pawan Kalyan

విజయవాడ: ఈనాడు, రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు, మీడియా దిగ్గజం రామోజీరావు సంస్మరణ సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తాను చూసిన రామోజీరావులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయని పేర్కొన్నారు. సినిమాలు చేసే సమయంలో రామోజీరావుతో ప్రత్యక్ష అనుబంధం లేదని, అయితే 2008లో నేరుగా ఒకసారి రామోజీరావును కలిసి మాట్లాడానని గుర్తుచేసుకున్నారు. ‘‘రామోజీరావు ప్రజల పక్షపాతి... జర్నలిస్టు విలువను కాపాడటంలో ముందున్నారు. ప్రజల కోసం ఏం చేయాలనే అంశాలపైనే ఆలోచించారు. 2019లో నన్ను లంచ్ మీటింగ్‌కు రామోజీరావు ఆహ్వానించారు. దేశంలో, రాష్ట్రంలో పరిస్థితులు, పత్రికా రంగం గురించి మా మధ్య చర్చ సాగింది’’ అని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు.


జనం తాలూకా అభిప్రాయాలే ఈనాడు పేపర్లో ప్రతిబింబిస్తాయని, లంచ్ మీటింగ్ సమయంలో రామోజీరావు వేదనను తాను నేరుగా చూశానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి పత్రిక స్వేచ్చ ఎంతో అవసరమో ఈ దేశానికి చాటి చెప్పారని పవన్ కల్యాణ్ కొనియాడారు. అటువంటి వ్యక్తిని ఎన్ని ఇబ్బందులు పెట్టారో అందరికీ తెలుసునని, పేపర్ ఒక్కటే నడపటం చాలా కష్ట సాధ్యం.. కానీ విలువలతో ముందుకు సాగారని ప్రశంసించారు. ఇతర వ్యాపారాలపై దాడులు చేసినా తట్టుకుని జర్నలిస్టుగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ముందుకు సాగారని గుర్తుచేశారు. అవన్నీ తెలుసుకుని తనకు చాలా సంతోషం అనిపించిందన్నారు. ‘‘నువ్వు ఏం చేస్తావో.. ఏం నమ్ముతావో త్రికరణ శుద్దిగా చేయి అని నాకు రామోజీరావు సూచించారు’’ అని పవన్ వెల్లడించారు.


కూటమి విజయ వార్త విన్నాకే కన్నుమూశారు

జర్నలిస్టు విలువలను కాపాడిన రామోజీరావు పత్రికాధిపతిగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని, ఆయన కుటుంబ సభ్యులను బెదిరించినా.. ఎక్కడా వెనక్కి తగ్గలేదని పేర్కొన్నారు. ఇలా దైర్యంగా నిలబడటానికి చాలా దైర్యం కావాలన్నారు. ‘‘ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్న సమయంలో కూటమి విజయ వార్త విన్నారా లేదా అని నేను కూడా అడిగి తెలుసుకున్నాను. విజయ వార్త విన్న తర్వాతే ఆయన తన ప్రాణాలు విడిచారు. అటువంటి మహోన్నత వ్యక్తి విగ్రహం అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేయాలి. ఎవరు ఏ స్థాయిలో ఉన్నా పత్రికా స్వేచ్ఛను కాపాడాలి. ఎవరినైనా వారు చేసే పనిని బట్టే పాజిటివ్, నెగిటీవ్ వార్తలు వేస్తారు’’ అని అన్నారు.


గతంలో అన్ని పార్టీలను పైకి ఎత్తిన సందర్భాలు ఉన్నాయి.. విమర్శలు చేసిన సందర్భాలు కూడా చూశాం. ఆయన జర్నలిస్టిక్ వారసత్వ విలువలను ప్రతి జర్నలిస్టు తీసుకోవాలి. అది ఎంతవరకు తీసుకుంటారో ప్రతి జర్నలిస్టు తెలుసుకోవాలి. రామోజీ జీవితం నిరంతర ప్రవాహం.. అందరూ తెలుసుకోవాలి’’ అని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. రైట్ టూ ఇన్ ఫర్మేషన్ యాక్ట్ గురించి ఉద్యమకర్తగా వ్యవహరించారంటూ రామోజీరావుని పవన్ ప్రశంసించారు. ఆర్‌టీఐ ద్వారా ప్రభుత్వం ఏం చేసినా ప్రజలు తెలుసుకోవచ్చని చాటి చెప్పారని, స్టూడియోలు కట్టినా, సినిమాలు చేసినా.. ఆదర్శ జర్నలిస్టు భావాలు చాలా ఉన్నాయన్నారు.

Updated Date - Jun 27 , 2024 | 06:45 PM