Minister Sandhya Rani: ఆ విషయంలో జగన్‌కు సన్మానం చేయాలి.. మంత్రి సంధ్యారాణి వ్యంగ్యాస్త్రాలు
ABN, Publish Date - Dec 02 , 2024 | 09:56 PM
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి సెటైర్లు కురిపించారు. జగన్‌కు లండన్ మందులు పనిచేయడం లేదని ఎద్దేవా చేశారు. ఆయన గొప్పలకు రూ.1300 కోట్లు ఖర్చు చేసిన దానికి సన్మానం చేయాలని విమర్శించారు.
పార్వతీపురం మన్యం జిల్లా: ప్రజలు 11 సీట్లుకే పరిమితం చేసినందుకు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికు సన్మానం చేయాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణి విమర్శించారు. జగన్‌కు లండన్ మందులు పనిచేయడం లేదని ఎద్దేవా చేశారు. ఆయన గొప్పలకు రూ.1300 కోట్లు ఖర్చు చేసిన దానికి సన్మానం చేయాలని విమర్శించారు. ఎగ్‌పఫ్‌లకు, ఇంటి ప్రహరీ, సర్వే రాళ్లపై తన పేరు రాయించుకోవడానికి ప్రభుత్వ ధనం వృథా చేసినందుకు సన్మానం చేయాలా అని ప్రశ్నించారు. జగన్ డబ్బులు తీసుకున్నారని తమ పార్టీ నాయకులు, సొంత చెల్లి వైఎస్ షర్మిల ఆరోపించినందుకు సన్మానం చేయాలి అని మంత్రి గుమ్మడి సంధ్యారాణి సెటైర్లు వేశారు.
జగన్ మైండ్‌కు పరిపక్వత కావాలని.. పాపం జగన్ తన తండ్రితో కూడా ఒంటరిగా మాట్లాడుతున్నారని సెటైర్లు గుప్పించారు. పార్వతీపురం గిరిజన సామాజిక భవనంలో ఇవాళ(సోమవారం) గిరిప్రతిభ కార్యక్రమాన్ని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించారు. రాష్ట్రంలో తొలిసారిగా కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆధ్వర్యంలో నలుగురు ఎమ్మెల్యేలతో కలిసి గిరి ప్రతిభ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. 16,500 డీఎస్సీ పోస్టులకు గానూ 2000 పోస్టులను గిరిజనులకే కేటాయించడం జరిగిందని తెలిపారు. పోటీ పరీక్షలకు వెళ్లే గిరిజన అభ్యర్థుల కోసం సంబంధిత పుస్తకాలతో కూడిన లైబ్రరీ ప్రతిరోజు రాత్రి 9 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు మంత్రి సంధ్యారాణి తెలిపారు.
ప్రతి ఇంటికో ఉద్యోగం: ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు
పల్నాడు జిల్లా: పేదరికం లేని సమాజం, తలసరి ఆదాయం పెంపు, ప్రతి ఇంటికో ఉద్యోగం కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు వ్యాఖ్యానించారు. వినుకొండలో అభివృద్ధి పనులకు ఇవాళ(సోమవారం) ఆంజనేయులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ... రాష్ట్రంలో తిరిగి పచ్చదనం, పరిశుభ్రతను సాధించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. క్లీన్ అండ్ గ్రీన్ కోసమే సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, వ్యర్థాల నుంచి సంపద సృష్టి కేంద్రాలని అన్నారు. పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ ఉపాధి హామీ ద్వారా పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేస్తున్నట్లు వివరించారు. 17500 కి.మీ. మేర సీసీ రోడ్లు, 10వేల కి.మీ. సీసీ డ్రెయిన్ల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 2030 నాటికి 50శాతం జనాభా పట్టణాలు, నగరాల్లోనే ఉండబోతోందని చెప్పారు. అందుకు తగినరీతిలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిని సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు.
వైసీపీ ప్రభుత్వంలో అధ్వానంగా రోడ్లు : ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
నెల్లూరు: వైసీపీ ప్రభుత్వంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని.. వాటిని కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేసేలా చర్యలు చేపట్టిందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి రోడ్లలో నడిచే వీలు లేదని.. వాహనాల రాకపోకల పరిస్థితి మరీ ఘోరంగా ఉందని తెలిపారు. కోడూరుపాడులో రూ.3.90కోట్లతో నిర్మించిన కొత్తకాలువ - కోడూరుపాడు రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ... ఆరు నెలల్లోపే రూ.3.90కోట్లతో కొత్తకాలువ - కోడూరుపాడు రోడ్డు పనులు పూర్తయ్యాయని చెప్పారు. ఎస్సీ కాలనీలో రూ.20లక్షలతో సిమెంటు రోడ్లు నిర్మిస్తున్నామన్నారు. రూ.9కోట్లతో 3వ మైలు - నారాయణరెడ్డిపేట రోడ్డు పనులు ప్రారంభమయ్యాయని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు.
Updated Date - Dec 02 , 2024 | 10:15 PM