Share News

Vizag : జగన్‌ జల్సా మహల్‌ ఇదిగో..

ABN , Publish Date - Jun 17 , 2024 | 04:08 AM

రుషికొండపై జనం సొమ్ముతో జగన్‌ కట్టుకున్న జల్సా మహల్‌ గుట్టును ‘ఆంధ్రజ్యోతి’ ఇప్పటికే బయటపెట్టింది. పర్యావరణానికి గండి కొట్టి, నిబంధనలకు మస్కా కొట్టి, కోర్టును ఏమార్చి, నిర్మాణం సాగిస్తున్న సమయంలోనే ఈ ప్యాలెస్‌లోని హంగులను ‘జనం సొమ్ముతో జల్సా ప్యాలెస్‌’ పేరిట 13-10-2023 సంచికలో ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించింది.

Vizag : జగన్‌ జల్సా మహల్‌ ఇదిగో..

  • రుషికొండపై ఏడు బ్లాకులతో అట్టహాసంగా ప్యాలెస్‌..

  • అందులో మూడు జగన్‌ ఫ్యామిలీకే.. భార్యాభర్తలకు ప్రెసిడెన్షియల్‌ సూట్‌..

    కుమార్తెలకు చెరో విల్లా సూట్‌

  • పర్యాటక రిసార్ట్స్‌ పేరిట అనుమతి 4 ఎకరాలకు... నిర్మాణం చేసింది దాదాపు పది ఎకరాల్లో.. ముందే చెప్పిన ‘ఆంధ్రజ్యోతి’

(విశాఖపట్నం, అమరావతి - ఆంధ్రజ్యోతి): రుషికొండపై జనం సొమ్ముతో జగన్‌ కట్టుకున్న జల్సా మహల్‌ గుట్టును ‘ఆంధ్రజ్యోతి’ ఇప్పటికే బయటపెట్టింది. పర్యావరణానికి గండి కొట్టి, నిబంధనలకు మస్కా కొట్టి, కోర్టును ఏమార్చి, నిర్మాణం సాగిస్తున్న సమయంలోనే ఈ ప్యాలెస్‌లోని హంగులను ‘జనం సొమ్ముతో జల్సా ప్యాలెస్‌’ పేరిట 13-10-2023 సంచికలో ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించింది. నిర్మాణం పూర్తయిన ఈ ప్యాలెస్‌లోకి ఆదివారం అడుగుపెట్టినవారు విస్తుపోయేలా అత్యంత ఖరీదైన గృహ అలంకరణ వస్తువులు, తళుక్కుమనే ఫ్లోరింగ్‌, నిర్మాణాలు సర్వత్రా పరుచుకుని కనిపించాయి.

అంతా లక్షల్లోనే..

జగన్‌ వాడుకోవడానికి బిగించిన టాయ్‌లెట్‌ కమోడ్‌ ధర కేవలం రూ.13.5 లక్షలే. జగన్‌ ఆయన కుటుంబసభ్యులు మాత్రమే వాడుకునేందుకు వీలుగా ఇలాంటివి మూడు బిగించారు. ఒక్కో దాని ధర రూ.13.5 లక్షలు. కాగా, మిగతా బాత్‌రూముల్లో బిగించిన కమోడ్‌ల ధర ఒక్కోటి జస్ట్‌ రూ.6 లక్షలు అంతే.

ఇంటీరియర్స్‌కి రూ.19.5 కోట్లు

రాజసౌధంలో ఏ గోడకు ఏ చిత్రం అతికించాలి, ఏ మూలన ఏ కళాఖండం పెట్టాలనే ఇంటీరియర్స్‌ను ప్రత్యేకంగా డిజైన్‌ చేశారు. వీటికోసం రూ.19.5 కోట్లు ఖర్చు చేశారు. ఇదంతా జనాల సొమ్మే. రాష్ట్రంలో ఎక్కడ ఏ పరిశ్రమ పెట్టాలని ఐదేళ్లలో ఒక్కసారి కూడా ఆలోచించని జగన్‌, తన రాజసౌధానికి మాత్రం ఏ హంగూ తగ్గకుండా చూసుకున్నారు.

ఒక్కో షాండ్లియర్‌ రూ.15 లక్షలు

రుషికొండ ప్యాలె్‌సలో ఎటుచూసినా ధగధగలే. వీటన్నింటిని తలదన్నేలా సీలింగ్‌ మిలామిలా మెరిసిపోతోంది. సీలింగ్‌ మొత్తం ఖరీదైన షాండ్లియర్లతో నిండిపోయింది. జగన్‌ నివాసం ఉండాలనుకున్న బ్లాక్‌లో మొత్తం 7 షాండ్లియర్లు ఉన్నాయి. ఒక్కో దాని ధర రూ.15 లక్షలు. ఇంకా భవనం మొత్తం వాడిన లైట్ల ఖర్చు వేరే ఉంది.

కరెంటు, నీరు, డ్రైనేజీలకు రూ.28 కోట్లు

నీటిసరఫరా, కరెంటు, సీవరేజ్‌ సౌకర్యాల కోసం ఇప్పటివరకు చేసిన ఖర్చు రూ.28 కోట్లు. ఇదం తా ప్రభుత్వ ఖాతానే. పనిచేసింది కూడా ప్రభుత్వ ఉద్యోగులే. కూలీలకు కూడా ప్రభుత్వ ఖజానా నుంచే కూలి చెల్లింపులు జరిగాయి.


కుర్చీలు, బల్లల కోసం రూ.14 కోట్లు

జగన్‌ ప్రజల సొమ్ముతో నిర్మించుకున్న జల్సా ప్యాలెస్‌లో సోఫాలు, బల్లలు, కుర్చీలు, టేబుళ్లు..అంటే ఫర్నిచర్‌ కోసం చేసిన ఖర్చు అక్షరాలా రూ.14 కోట్లు. ఎన్నికల్లో ఓడిపోయాక అక్కచెల్లెమ్మలకు, అవ్వాతాతలకు డబ్బులు పంచినా వారంతా ఓట్లేయలేదంటూ వాపోయిన జగన్‌....జనాల జేబుల్లో నుంచి లాక్కుని చేసిన ఈ జల్సా ఖర్చుల గురించి జనాలకు తెలియదనుకుంటున్నారేమో!

ఒక్కో ఫ్యాను రూ.3 లక్షలు

భవనమంతా సెంట్రలైజ్డ్‌ ఏసీ. కానీ, సీలింగ్‌ మొత్తం ఎక్కడ చూసినా ఫ్యాన్లే. ఏసీల పక్కన కూడా అద్భుతమైన ఫ్యాన్లు దర్శనమిస్తున్నాయి. ఒక్కో ఫ్యాన్‌ ధర తెలిస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. ఒక్కో ఫ్యాన్‌ ధరతో పేద కుటుంబం ఏడాదంతా బతుకుతుంది. తన జల్సా ప్యాలెస్‌ కోసం జగన్‌ రూ.3 లక్షలు పెట్టి ఒక్కో ఫ్యాను కొన్నారు. ఇలాంటి ఫ్యాన్లు మొత్తం పదుల సంఖ్యలో ఉన్నాయి.

నాడు పర్యాటకశాఖ మంత్రి అవాస్తవాలు

ఈ ఏడాది ఫిబ్రవరిలో నాటి పర్యాటక శాఖ మంత్రి రోజా రుషికొండపై భవనాన్ని ప్రారంభించి, అనేక అవాస్తవాలు మాట్లాడారు. ఇది పర్యాటకుల కోసమే నిర్మించామని అబద్ధ్దం ఆడేశారు. విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించినందున, దానికి అవసరమైన భవనాల ఎంపిక కోసం ఏర్పాటైన త్రిసభ్య కమిటీ రుషికొండ భవనాన్ని సందర్శించిందని, ఇది జగన్‌కు బాగుంటుందని సూచించిందని చెప్పుకొచ్చారు. జగన్‌ అంగీకరిస్తే క్యాంపు కార్యాలయంగా ఇచ్చేస్తామని సెలవిచ్చారు. అయితే ఆ భవనాన్ని ఆయన నివసించడానికి వీలుగా విలాసవంతంగా నిర్మించుకున్నారని ప్రపంచమంతటికీ తెలుసు. కానీ అలాచేస్తే విమర్శలు వస్తాయని జగన్‌ అండ్‌ కోకూ తెలుసు. అందువల్లే కమిటీ చెప్పిందని వంకలు చూపి, అందులో ప్రవేశించాలని ప్రయత్నించారు. అయితే దేవుడు స్ర్కిప్ట్‌ వేరేలా రాశారని విశాఖ ప్రజలు ఛలోక్తులు విసురుతున్నారు.

ఏ బ్లాక్‌లో ఏమున్నాయంటే..

వేంగి 1(ఏ), 2(బి) : ఇవి రెండు బ్లాక్‌లు. ఒకదానిలో సెక్యూరిటీ, బ్యాక్‌ ఆఫీస్‌. రెండోదానిలో అతిథి గదులు, సమావేశ మందిరాలు.

కళింగ : రిసెప్షన్‌, వెయిటింగ్‌ ఏరియా, సమావేశ మందిరాలు

గజపతి : హౌస్‌ కీపింగ్‌, కేఫ్‌ టేరియా, బిజినెస్‌ సెంటర్‌

విజయనగర 1,2,3: ఇవి మూడు బ్లాక్‌లు. ఒకటి జగన్‌,

భారతిల కోసం. మిగిలిన రెండు కుమార్తెలకు చెరొకటి

ట్రీట్‌మెంట్‌ ప్లాంటు..

నీటి సరఫరా కోసం వంద కిలోలీటర్ల డొమెస్టిక్‌ సంప్‌, మరో 150 కిలోలీటర్లతో ఫైర్‌ సంప్‌, వ్యర్థ జలాల శుద్ధికి 100 కేఎల్‌డీ సూయిజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంటు నిర్మించారు. విద్యుత్‌ సరఫరా కోసం కంటెయినర్‌ సబ్‌స్టేషన్‌, ప్రత్యేకంగా అండర్‌ గ్రౌండ్‌ కేబుల్‌ వ్యవస్థ, వెయ్యి కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్లు, 1010 కేవీఏ సామర్థ్యం కలిగిన మూడు జనరేటర్లు ఏర్పాటు చేశారు.

గార్డెన్‌ కోసం రూ.22 కోట్లు

ఇంటికి ఏ వైపున ఏ చెట్లు ఉండాలి, ఎక్కడెక్కడ ఎంత ఖరీదైన లైట్లు పెట్టాలి, ఖరీదైన మొక్కలు నాటి గార్డెన్‌ను ఎలా విలాసవంతంగా తీర్చిదిద్దాలని ఆలోచించి చేసిన ఖర్చు ఏకంగా రూ.22 కోట్లు.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Jun 17 , 2024 | 07:32 AM