Share News

Duvvada Srinivas: దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో ట్విస్టులు మీద ట్విస్టులు..

ABN , Publish Date - Aug 12 , 2024 | 09:31 AM

టెక్కలిలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ డ్రామా కొనసాగుతోంది. నాలుగవ రోజుకు చేరిన దువ్వాడ సతీమణి వాణి, కుమార్తెలు నిరసనకు దిగారు.

Duvvada Srinivas: దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో ట్విస్టులు మీద ట్విస్టులు..

శ్రీకాకుళం: టెక్కలిలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ డ్రామా కొనసాగుతోంది. నాలుగవ రోజుకు చేరిన దువ్వాడ సతీమణి వాణి, కుమార్తెలు నిరసనకు దిగారు. దువ్వాడ క్యాంపు కార్యాలయం బయటే ఆయన సతీమణి వాణి నిద్రించారు. న్యాయం జరిగే వరకూ కదిలేది లేదని వాణి భీష్మించారు. నిన్నంతా దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో ట్విస్టులు మీద ట్విస్టులు కొనసాగాయి. మాధురి కారు ప్రమాదంలో గాయపడిన తర్వాత విశాఖ ప్రైవేట్ ఆసుపత్రికి పయనమయ్యారు. ఆత్మహత్య చేసుకుందామని సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకోవాలనుకున్నానని మాధురి చెప్పారు. వాణి తనపై చేస్తున్న ఆరోపణలు బాధించాయని మాధురి పేర్కొంది. మరోవైపు భార్య వాణికి విడాకులు ఇచ్చేందుకు దువ్వాడ సిద్ధమవుతున్నారు.


వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ వ్యవహారంలో ఆయన భార్య, కుమార్తెల నుంచి దివ్వెల మాధురి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీంతో ఆమె ఆదివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కారులో ప్రయాణిస్తూ శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మిపురం టోల్‌గేటు దాటిన తరువాత ఆగి ఉన్న కారును బలంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో ఆమె స్వల్పంగా గాయాలపాలయ్యారు. తొలుత మాధురిని పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చించారు. ఆ తరువాత మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. ఈ సందర్భంగా మాధురి విలేకరులతో మాట్లాడుతూ.. తన పిల్లలపై దువ్వాడ వాణి చేసిన ఆరోపణలకు తాను బలికావాల్సి వస్తోందని, ఆత్మహత్య చేసుకోవడం తప్ప తనకు గత్యంతరం లేదని తెలిపారు. వాణిని తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. తెలుగుదేశం పార్టీ సహకారంతోనే వాణి తనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు.


ఇదే క్రమంలో మాధురి పోలీసులపై కూడా ఆరోపణలు చేశారు. ఆమెను మరింత మెరుగైన చికిత్స కోసం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆరిలోవలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఇక పలాస ఆసుపత్రిలోనూ మాధురి కాసేపు హైడ్రామా నడిపించారు. వైద్యులకు సహకరించలేదు. పైగా తనకు ఆత్మహత్య చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని.. డిమాండ్ చేశారు. తన పిల్లలకు డీఎన్‌ఏ టెస్టులు చేయాలని దువ్వాడ వాణి కోరారని, వారికి ఏం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. అడ్డూఅదుపు లేకుండా వాణి అధికార పార్టీ అండతో ఆరోపణలు చేస్తే తనకు దిక్కెవరని ప్రశ్నించారు. తన పిల్లలు వేసే ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదన్నారు. తనపై ఆరోపణలు చేస్తున్నవారిని తక్షణమే అరెస్టు చేయాలని.. లేదంటే తన చావుకు ఇబ్బంది పెట్టవద్దని పోలీసులను కోరారు. ఆసుపత్రిలో పోలీసులు ఇబ్బందులు పెట్టారని మాధురి ఆరోపించారు. బ్రీత్‌ అనలైజేషన్‌, బ్లడ్‌ శాంపిల్‌ తీయడంపై మాధురి అభ్యంతరం వ్యక్తం చేశారు. విలేకరుల సమక్షంలో చేయాలని కోరినా పోలీసులు అనుమతించలేదని ఆరోపించారు.

Updated Date - Aug 12 , 2024 | 09:32 AM