అజ్ఞాతంలోనే రామ్‌గోపాల్‌వర్మ
ABN , Publish Date - Nov 27 , 2024 | 06:23 AM
సోషల్ మీడియాలో పెట్టిన అసభ్యకరమైన పోస్టులకు సంబంధించి ఒంగోలు రూరల్ పోలీసు స్టేషన్‌లో విచారణకు హాజరుకావాల్సిన వర్మ.. ఇల్లు వదలి పరారయ్యారు. అరెస్టుకు భయపడి రెండు రోజులుగా వర్మ అజ్ఞాతంలోనే ఉన్నారు.
గాలిస్తున్న ప్రకాశం పోలీసులు
హైదరాబాద్, కోయంబత్తూర్‌కు పోలీసు బృందాలు
అమరావతి, ఒంగోలు క్రైం, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): సోషల్ మీడియాలో పెట్టిన అసభ్యకరమైన పోస్టులకు సంబంధించి ఒంగోలు రూరల్ పోలీసు స్టేషన్‌లో విచారణకు హాజరుకావాల్సిన వర్మ.. ఇల్లు వదలి పరారయ్యారు. అరెస్టుకు భయపడి రెండు రోజులుగా వర్మ అజ్ఞాతంలోనే ఉన్నారు. అంతేకాకుండా పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. షూటింగ్ కోసం కోయంబత్తూరు వెళుతున్నానంటూ అక్కడి విమానాశ్రయంలో తీసిన ఫొటోలను ఎక్స్ ఖాతాలో పోస్టు చేసిన వర్మ.. 24వ తేదీ ఉదయం 9.30 వరకు హైదరాబాద్‌లోని తన ఇంట్లోనే ఉన్నట్లు సెల్‌ఫోన్ సిగ్నల్స్ చూపాయి. తీరా పోలీసులు ఇంటికి వెళ్లేసరికి వర్మ లేరు. దీంతో అతనిని అరెస్టు చేసేందుకు హైదరాబాద్ వెళ్లిన రెండు పోలీసు బృందాలు అక్కడే మకాం వేశాయి. హైదరాబాద్‌లో ఉన్న ఫామ్‌హౌ్‌సలలో పోలీసులు గాలిస్తున్నారు. ఒక బృందం కోయంబత్తూరు వెళ్లింది.
బెయిల్‌పై విచారణ నేటికి వాయిదా
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్‌పై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర, అనుచిత పోస్టులు పెట్టారనే ఆరోపణలతో మూడు వేర్వేరు కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలు మంగళవారం విచారణకు వచ్చాయి. రామ్‌గోపాల్ వర్మ తరఫు న్యాయవాది స్పందిస్తూ పిటిషనర్‌ను అరెస్ట్ చేస్తారనే ఆందోళన ఉందని, వ్యాజ్యాలపై అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించారు. దీంతో బుధవారం విచారణ చేపడతామని న్యాయమూర్తి జస్టిస్ వీఆర్‌కె కృపాసాగర్ ప్రకటించారు.