Amaravati: విజయవాడకు ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ సభ్యులు..
ABN , Publish Date - Mar 18 , 2025 | 08:40 PM
ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ సభ్యులు మంగళవారం విజయవాడకు తరలివచ్చారు. సీఆర్‌డీఏ అధికారులతో ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ సభ్యులు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు మంజూరు చేసేందుకు నిర్దేశించిన కార్యక్రమాల అమలుపై చర్చ జరిగింది.

ప్రపంచ బ్యాంక్ (World Bank), ఆసియా అభివృద్ధి బ్యాంక్ సభ్యులు మంగళవారం విజయవాడకు తరలివచ్చారు. సీఆర్‌డీఏ అధికారులతో ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ సభ్యులు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు మంజూరు చేసేందుకు నిర్దేశించిన కార్యక్రమాల అమలుపై చర్చ జరిగింది. ప్రాజెక్టులో భాగంగా తొలి ఏడాది యాక్షన్ ప్లాన్ గురించి చర్చ జరిగింది. సీఆర్‌డీఏ కార్యాలయం ఆడిటోరియంలో జరిగిన ఈ సమావేశంలో ఏపీ సీఆర్‌డీఏ (CRDA), అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏడీసీఎల్) అధికారులు కూడా పాల్గొన్నారు (Amaravati News).
ఈ నేపథ్యంలో గత ఏడాది కాలంలో రాజధాని అమరావతిలో చేపట్టిన పనుల పురోగతిపై సీఆర్డీఏ అధికారులు వివరణ ఇచ్చారు. అలాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) ఆదేశాలను అమలు చేస్తున్న విధానం గురించి కూడా సీఆర్‌డీఏ, ఏడీసీఎల్ అధికారులు వివరించారు. అమరావతి ప్రాంతంలో అమలు చేస్తున్న నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు, నిర్మాణ కార్యకలాపాలు జరిగే చోట కార్మికుల భద్రతకు అమలు చేస్తున్న కార్యకలాపాల గురించి కూడా తెలియజేశారు. అలాగే ఈ సమావేశంలో నిధుల మంజూరు కోసం ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ నిర్దేశించిన నిబంధనల అమలుపై కూడా చర్చ జరిగింది.
రాజధాని అమరావతి నిర్మాణంలోనూ, ప్రొక్యూర్మెంట్, టెండరింగ్, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సంక్షేమ కార్యక్రమాలను కచ్చితంగా అమలు చేస్తున్నట్టు బ్యాంకుల సభ్యులకు సీఆర్‌డీఏ కమిషనర్ కె.కన్నబాబు వివరించారు. అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేలా ప్రత్యేక వ్యవస్థ రూపొందించినట్టు తెలిపారు. అమరావతి వాసులు అధికారులకు తమ సమస్యలు చెప్పుకునేందుకు, పరిష్కారం పొందేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, సీఆర్‌డీఏ అధికారుల ప్రజెంటేషన్ పట్ల ప్రపంచ బ్యాంకు, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలు కోసం క్లిక్ చేయండి..