KA Paul : జగన్‌పై కేఏపాల్ సంచలన వ్యాఖ్యలు
ABN, Publish Date - Dec 01 , 2024 | 07:21 PM
మోదీ, అమిత్ షా దేశాన్ని అదానీ, అంబానికి కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ప్రజాశాంతి అధ్యక్షుడు కే ఏ పాల్ ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షించడానికి తాను పోరాడుతున్నానని తెలిపారు.
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌ను వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి సర్వనాశనం చేశారని ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్(Prajashanti Parti Chief KA Paul) సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రతో పాటు పలు ఎన్నికల్లో ఈవీఎమ్‌లు వద్దు, బ్యాలెట్ పేపర్ వాడమని అభ్యర్థించానని అన్నారు. ఇవాళ(ఆదివారం) విశాఖలో కేఏపాల్ పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. చాలా దేశాలు ఈవీఎంలు వదిలేసి, బ్యాలెట్ పేపర్స్ వాడుతున్నాయని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం అందరం కలిసి పోరాటం చేద్దాం రావాలని కేఏ పాల్ సూచించారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి..
ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి ఎందుకు తనతో కలసి పని చేయడం లేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోర్టులో పోరాటం చేస్తున్నానని తెలిపారు. ప్రత్యేక హోదాపై తాను వేసిన పిటిషన్‌ను డిసెంబర్11వ తేదీకి వాయిదా వేసినట్లు చెప్పారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు తీవ్ర అన్యాయం చేస్తున్నారని. ప్లాంటును పరిరక్షించాలని డిమాండ్ చేశారు. వీసా దగ్గర ట్రాంప్‌నకు తనకు గొడవ వచ్చిందని చెప్పారు. అనాధికారంగా ఉన్న వారిని అమెరికా నుంచి పంపించేస్తామని ట్రంప్ అంటున్నారన్నారు. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు మంచి వారిని కాదని..మాయ మాటలు చెప్పేవారిని నమ్ముతున్నారని కేఏపాల్ విమర్శలు చేశారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేశా..
కాగా.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తన వల్లే ఆగిపోయిందని కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో తన సత్తా ఏంటో మాజీ సీఎం జగన్, ప్రధాని మోదీకి తెలిసిందని వివరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో లాయర్ లేకుండా వాదించానని గుర్తుచేశారు. ఆర్డర్ తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేశానని కేఏ పాల్ స్పష్టం చేశారు. ‘నాకున్న ఆస్తులు అమ్మైనా సరే విశాఖ స్టీల్ ప్లాంట్ సంరక్షణ కోసం పోరాడుతాను’’ అని కేఏ పాల్ తెలిపారు.
దేశాన్ని అదానీ, అంబానికి కట్టబెట్టడానికి ప్రయత్నాలు..
మోదీ (PM Modi), అమిత్ షా (Amith Shah) దేశాన్ని అదానీ, అంబానికి కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఏపీకి ఇస్తామన్న హామీలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్‌పరం చేసేందుకు అన్ని పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్‌పరం కాకుండా ఆపాలని రెండేళ్ల క్రితమే లేఖ రాసినట్లు చెప్పారు. అమెరికన్ ఫండ్‌ను నేరుగా అనుమతిస్తే.. కేంద్ర ప్రభుత్వానికి తానే ఫండ్ ఇస్తానని... స్టీల్ ప్లాంట్ ప్రైవేట్‌పరం కాకుండా అడ్డుకుంటామని కేఏ పాల్ స్పష్టం చేశారు.
Updated Date - Dec 01 , 2024 | 07:28 PM