Share News

వైసీపీ ఐపీఎ్‌సలు సెలవులో..!

ABN , Publish Date - Aug 17 , 2024 | 02:26 AM

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీకి కొమ్ముకాసి..

వైసీపీ ఐపీఎ్‌సలు సెలవులో..!

16 మంది మూకుమ్మడిగా పెట్టారని ప్రచారం

ఆరుగురే అడిగారంటున్న అధికారులు

దీర్ఘకాలిక సెలవుపై వెళ్లాలని అత్యధికుల యోచన!

అమరావతి, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీకి కొమ్ముకాసి.. కొత్త ప్రభుత్వంలో పోస్టింగ్‌ దక్కని 16 మంది ఐపీఎస్‌ అధికారులు ఇప్పుడు సెలవులో వెళ్లారు. పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్న వీరంతా మూకుమ్మడిగా సెలవు పెట్టినట్లు ప్రచారం జరిగింది. అయితే అందరూ సెలవు పెట్టలేదని, వారాంతం కావడంతో ఆరుగురు మాత్రమే తాత్కాలిక సెలవు కోరారని పోలీసు శాఖలోని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఎన్నికల ముందు ఏకపక్షంగా వ్యవహరించి, జగన్‌ పార్టీ అరాచకాలకు కొమ్ముకాసిన పలువురు ఐపీఎస్‌ అధికారులను ఎన్నికల కమిషన్‌ (ఈసీ) పక్కన బెట్టిన సంగతి తెలిసిందే. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక.. నిరీక్షణలో ఉన్న పోలీసు అధికారులపై గతంలో పలు ఆరోపణలు ఉండడంతో వాటిపై విచారించి నివేదిక ఇవ్వాలని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాన్ని ఆదేశించింది. విషయం తెలుసుకున్న వైసీపీ ఐపీఎ్‌సలు కొందరు.. ఏకంగా విజిలెన్స్‌ అధికారులకే ఫోన్‌ చేసి తమ పాత్రను చూపించొద్దని కోరినట్లు ఫిర్యాదులందాయి. దీంతో వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎ్‌సలందరూ ప్రతి రోజూ పోలీసు ప్రధాన కార్యాలయానికి వచ్చి రిజిస్టర్‌లో సంతకాలు చేయాలని డీజీపీ ద్వారకా తిరుమలరావు ఈ నెల 12న సర్క్యులర్‌ జారీ చేశారు. అయితే 15న స్వాతంత్య్ర దినోత్సవం, ఆ తర్వాత శని, ఆది వారాలు సెలవు కావడంతో వీరిలో కొందరు ఈ నెల 13, 14న.. మరికొందరు 16న సెలవు పెట్టినట్లు తెలిసింది. లాంగ్‌ వీకెండ్‌ రావడంతో మధ్యలో సెలవులు పెట్టుకున్నారని, సోమవారం రాఖీ పండుగ తర్వాత వారు వచ్చే అవకాశం ఉందని సదరు వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా.. ప్రతి రోజూ పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌కు వచ్చి నిరీక్షించడం అవమానకరంగా ఉంటుందని ఆ 16 మందిలో అత్యధికులు మధనపడుతున్నట్లు తెలిసింది. రోజూ ఉదయం పదింటికి వెళ్లి సాయంత్రం ఐదింటి వరకూ ఊరకే పనిలేకుండా కూర్చోవడం కంటే దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడం మంచిదని వారు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. కాగా.. ఐపీఎ్‌సల సెలవుపై ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. సెలవు అడిగినంత మాత్రాన ఇవ్వాలని లేదని.. సహేతుక కారణం చూపితేనే మంజూరు చేస్తారని.. నచ్చినట్లు సెలవు పెడతామంటే కుదరదని స్పష్టం చేశాయి. నిఘా మాజీ అధిపతి పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు, సీఐడీ మాజీ చీఫ్‌లు సునీల్‌ కుమార్‌, సంజయ్‌కి ప్రభుత్వమే (జీఏడీ) సెలవు మంజూరు చేయాల్సి ఉంటుంది. మిగిలిన 13 మందిలో ఎవరికి సెలవు ఇవ్వాలన్నది డీజీపీ ఇష్టం.

Updated Date - Aug 17 , 2024 | 07:44 AM