Share News

Bibek Debroy: పీఎం ఆర్థిక సలహా మండలి ఛైర్మన్ బిబేక్ దేబ్రోయ్ కన్నుమూత

ABN , Publish Date - Nov 01 , 2024 | 12:15 PM

భారత ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఛైర్మన్‌ బిబేక్‌ దేబ్రోయ్‌ కన్నుమూశారు. 69 ఏళ్ల వయసున్న ఆయనను ఇటివల అనారోగ్య కారణాలతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చేర్చారు. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం బిబేక్‌ దేబ్రోయ్‌ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

Bibek Debroy: పీఎం ఆర్థిక సలహా మండలి ఛైర్మన్ బిబేక్ దేబ్రోయ్ కన్నుమూత
Economist Bibek Debroy

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక సలహా మండలి ఛైర్మన్, ఆర్థికవేత్త బిబేక్ దేబ్రోయ్ (69)(Bibek Debroy) ఈరోజు కన్నుమూశారు. పేగు సంబంధిత సమస్యతో బిబేక్ దేబ్రోయ్ మృతి చెందినట్లు ఢిల్లీ ఎయిమ్స్ తెలిపింది. దేబ్రోయ్ రామకృష్ణ మిషన్ స్కూల్ (నరేంద్రపూర్), ప్రెసిడెన్సీ కాలేజీ (కోల్‌కతా), ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ట్రినిటీ కాలేజీ (కేంబ్రిడ్జ్)లో చదువుకున్నారు. ఆయన ప్రెసిడెన్సీ కాలేజీ (కోల్‌కతా), గోఖలే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ (పూణే), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఢిల్లీ)లో పనిచేశారు. భారత ప్రభుత్వం ప్రముఖ ఆర్థికవేత్త బిబేక్ దేబ్రోయ్‌ను పద్మశ్రీతో సత్కరించింది.


ప్రధాని మోదీ సంతాపం

బిబేక్ దేబ్రోయ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. డాక్టర్ బిబేక్ తెలివైన పండితులని, ఆర్థిక శాస్త్రం, చరిత్ర, సంస్కృతి, రాజకీయాలు, ఆధ్యాత్మికం వంటి విభిన్న రంగాలలో ఆయనకు మంచి ప్రావీణ్యం ఉందని పేర్కొన్నారు. తన మేధో సంపత్తి, రచనల ద్వారా భారతదేశంలో చెరగని ముద్ర వేశారని గుర్తు చేశారు. ప్రజా విధానానికి ఆయన చేసిన కృషితో పాటు, ప్రాచీన గ్రంథాలపై పని చేయడం, వాటిని యువకులకు అందుబాటులో ఉంచడం గొప్ప విశేషమని పేర్కొన్నారు.


ఆయన మార్గదర్శకత్వంలో

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. డాక్టర్ బిబేక్ దేబ్రోయ్ మరణం తనను తీవ్రంగా కలచివేసిందని ప్రధాన్ అన్నారు. ఆయన గొప్ప ఆర్థికవేత్త, రచయిత, అద్భుతమైన విద్యావేత్త అని కొనియాడారు. ఆర్థిక సమస్యలపై ఆయన మార్గదర్శకత్వంలో భారతదేశ అభివృద్ధికి గణనీయమైన సహకారం అందించారని వెల్లడించారు. వార్తాపత్రికలలో ఆయన కాలమ్‌లు మిలియన్ల మంది ప్రజలను జ్ఞానోదయం చేశాయన్నారు. దేబ్రోయ్ ఆర్థికశాస్త్రం, విద్య, సాహిత్య ప్రపంచంలో శాశ్వత వారసత్వాన్ని నెలకొల్పారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తన సానుభూతి తెలియజేస్తున్నట్లు ధర్మేంద్ర ప్రధాన్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ప్రకటించారు.


విద్యా జీవితం

  • దేబ్రోయ్ 1979 నుంచి 1984 వరకు కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కాలేజీలో తన విద్యా వృత్తిని ప్రారంభించారు. ఆ తర్వాత పూణేలోని గోఖలే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్‌లో చేరారు. అక్కడ 1987 వరకు పనిచేశారు.

  • ఆ తరువాత 1987 నుంచి 1993 వరకు ఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ బాధ్యతలు చేపట్టారు. 1993లో దేబ్రోయ్ ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం ప్రాజెక్ట్‌కి డైరెక్టర్ అయ్యారు. ఈ ప్రాజెక్ట్ కారణంగా భారతదేశం చట్టపరమైన సంస్కరణలపై దృష్టి సారించింది. ఆయన దీనికి 1998 వరకు డైరెక్టర్‌గా ఉన్నారు.

  • 1994 నుంచి 1995 వరకు ఆయన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్‌లో, 1995 నుంచి 1996 వరకు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్‌లో, 1997 నుంచి 2005 వరకు రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఫర్ కాంటెంపరరీ స్టడీస్‌లో పనిచేశారు.

  • దీని తరువాత 2005 నుంచి 2006 వరకు PHD ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలో బాధ్యతలు స్వీకరించారు. ఆపై 2007 నుంచి 2015 వరకు సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్‌లో పనిచేశారు.

  • దేబ్రోయ్ జూన్ 5, 2019 వరకు NITI ఆయోగ్ సభ్యునిగా కూడా పనిచేశారు.

  • జూలై 2024లో గోఖలే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ (GIPE)కి ఛాన్సలర్‌గా నియమితులయ్యారు

  • బిబేక్ దేబ్రోయ్ ప్రస్తుతం భారత ప్రధాని ఆర్థిక సలహా మండలి ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు.


కథనంపై చర్చ

ఆగస్టు 14, 2023న వార్తా వెబ్‌సైట్ ది మింట్‌లో బిబేక్ దేబ్రోయ్ రాజ్యాంగాన్ని మార్చడంపై ఒక కథనాన్ని రాశారు. ఇది అప్పుడు చర్చలకు దారి తీసింది. మన ప్రస్తుత రాజ్యాంగం ఎక్కువగా 1935 నాటి భారత ప్రభుత్వ చట్టంపై ఆధారపడి ఉందని దేబ్రోయ్ తన కథనంలో రాశారు. 2002లో రాజ్యాంగ పనితీరును సమీక్షించేందుకు ఏర్పాటైన కమిషన్ నివేదిక సమర్పించినా అది అర్ధాంతరంగా సాగిందని పేర్కొన్నారు. 2047 సంవత్సరానికి భారతదేశానికి ఏ రాజ్యాంగం అవసరం? రాజ్యాంగంలో కొన్ని సవరణలు ఇప్పుడు సరిపోవన్నారు. ఇప్పుడు రాజ్యాంగ పీఠికలోని సోషలిస్టు, లౌకిక, ప్రజాస్వామ్య, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం వంటి పదాలకు అర్థమేమిటో చర్చించాలన్నారు. మనం ప్రజలం, మనమే కొత్త రాజ్యాంగాన్ని ఇవ్వాలని ప్రస్తావించారు.


ఇవి కూడా చదవండి:


Bank Holidays: నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు బంద్..

LPG Gas: సామాన్యులకు షాకింగ్.. పెరిగిన ఎల్‌పీజీ గ్యాస్ ధరలు

Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..

Penny Stock: లక్ష పెట్టుబడితో 4 నెలల్లోనే రూ. 670 కోట్లు.. దేశంలోనే ఖరీదైన స్టాక్‌గా రికార్డ్

Read More Business News and Latest Telugu News

Updated Date - Nov 01 , 2024 | 12:39 PM