Share News

నాలుగేళ్లలో భారత్‌ @: నం.3

ABN , Publish Date - Jan 11 , 2024 | 03:40 AM

వచ్చే నాలుగేళ్లలో (2027-28 ఆర్థిక సంవత్సరం నాటికి) భారత్‌ 5 లక్షల కోట్ల డాలర్ల కు పైగా జీడీపీతో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ధీమా వ్యక్తం చేశారు...

నాలుగేళ్లలో భారత్‌ @: నం.3

2027-28 నాటికి జీడీపీ 5 లక్షల కోట్ల డాలర్లు.. 2047 నాటికి 30 లక్షల కోట్ల డాలర్లు

వైబ్రెంట్‌ గుజరాత్‌ సదస్సులో సీతారామన్‌

గాంధీనగర్‌: వచ్చే నాలుగేళ్లలో (2027-28 ఆర్థిక సంవత్సరం నాటికి) భారత్‌ 5 లక్షల కోట్ల డాలర్ల కు పైగా జీడీపీతో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ధీమా వ్యక్తం చేశారు. 2047 నాటికి జీడీపీ 30 లక్షల కోట్ల డాలర్లకు చేరుకోనుందని, తద్వారా భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా మారనుందన్నారు. బుధవారం ప్రారంభమైన ‘వైబ్రెంట్‌ గుజరాత్‌ సదస్సు 2024’లో ప్రసంగిస్తూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం భారత్‌ 3.4 లక్షల కోట్ల డాలర్ల జీడీపీతో ప్రపంచలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది. అమెరికా, చైనా, జపాన్‌, జర్మనీ మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తి కానున్న ఈ అమృత కాలం లో ఎలకా్ట్రనిక్స్‌, టెక్నాలజీ వంటి నవతరం పరిశ్రమల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టిసారించనుందన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) సంబంధించి మోదీ ప్రభుత్వం చేపట్టిన విధానపరమైన మార్పులతో గడిచిన 9 ఏళ్లలో దేశంలోకి 59,500 కోట్ల డాలర్ల విలువైన విదేశీ పెట్టుబడులు వచ్చాయన్నారు.

నెలాఖరుకు వికసిత్‌ భారత్‌ విజన్‌ పత్రం

అభివృద్ధి చెందిన (వికసిత్‌) భారత్‌ కేవలం కల కాదని, సుసాధ్యమేనని నీతి ఆయోగ్‌ సీఈఓ బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం అన్నారు. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందితే, దేశం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. దేశంలో భౌతిక, డిజిటల్‌ మౌలిక సదుపాయాల విస్తరణ శరవేగంగా జరుగుతున్నదని, మిగతా వర్ధమాన దేశాల కంటే భారత్‌ మెరుగైన పనితీరు కనబరుస్తున్నదని అన్నారు. 2047 నాటికి 30 లక్షల కోట్ల డాలర్ల జీడీపీతో అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగేందుకు విజన్‌ డాక్యుమెంట్‌ను రూపొందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈనెలాఖరు కల్లా ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆ డాక్యుమెంట్‌ను విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు.

ప్రపంచంలో అతిపెద్ద స్టీల్‌ ప్లాంట్‌: లక్ష్మీ మిట్టల్‌

హజీరాలో ఆర్సెలార్‌మిట్టల్‌ నిప్పాన్‌ స్టీల్‌ ఇండియా భారీ స్టీల్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నదని కంపెనీ అధిపతి లక్ష్మీ మిట్టల్‌ సదస్సులో తెలిపారు. ప్రపంచంలో ఇదే అతిపెద్ద సింగిల్‌ లొకేషన్‌ ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ కానుందన్నారు. 2029 నాటికి సిద్ధం కానున్న ఈ స్టీల్‌ ప్లాంట్‌ 2.4 కోట్ల టన్నుల ముడి ఉక్కు తయారీ సామర్థ్యం కలిగి ఉండనుంది. అయితే దీనిపై ఎంత పెట్టుబడి పెడుతున్నది వెల్లడించలేదు.

అదానీ రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు

వచ్చే ఐదేళ్లలో గుజరాత్‌లో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ సదస్సులో ప్రకటించారు. తద్వారా లక్ష మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ పెట్టుబడుల్లో భాగంగా అంతరిక్షం నుంచి సైతం కన్పించేలా 725 చదరపు కి.మీ విస్తీర్ణంలో ప్రపంచంలోనే అతిపెద్ద శుద్ధ ఇంధన ప్రాజెక్టును రాష్ట్రంలోని కచ్‌ ఎడారిలో నిర్మించనున్నట్లు వెల్లడించారు.

ధోలేరాలో చిప్‌ యూనిట్‌: టాటా

ధోలేరాలో భారీ సెమీకండక్టర్‌ (చిప్‌) తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు టాటా గ్రూప్‌ వెల్లడించింది. ఇందుకు సంబంధించి బేరసారాలు తుది దశలో ఉన్నాయని, ఈ ఏడాదిలో యూనిట్‌ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని టాటా గ్రూప్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ సదస్సులో చెప్పారు. అలాగే, టాటా గ్రూప్‌ రాష్ట్రంలోని సనంద్‌లో 20 గిగావాట్ల లిథియం అయాన్‌ స్టోరేజ్‌ బ్యాటరీ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని సైతం రెండు నెలల్లో ప్రారంభించనుందన్నారు.

హజీరాలో కార్బన్‌ ఫైబర్‌ ప్లాంట్‌: అంబానీ

న్యూ మెటీరియల్స్‌, సర్క్యులర్‌ ఎకానమీలో గుజరాత్‌ను అగ్రగామిగా మార్చేందుకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ హజీరాలో దేశంలో తొలి కార్బన్‌ ఫైబర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుందని కంపెనీ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ సదస్సులో ప్రకటించారు. అయితే, ఎప్పటిలోగా ఏర్పాటు చేయనున్నది, పెట్టుబడులు వంటి వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు.

రూ.35,000 కోట్లతో రెండో ప్లాంట్‌: మారుతి సుజుకీ

గుజరాత్‌లో రెండో కార్ల తయారీ ప్లాంట్‌ కోసం రూ.35,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు మారుతి సుజుకీ ప్రకటించింది. 2030-31 నాటికి కంపెనీ కార్ల ఉత్పత్తి వార్షిక సామర్థ్యాన్ని 40 లక్షల యూనిట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Updated Date - Jan 11 , 2024 | 03:40 AM