Share News

Maruti Suzuki: నెలరోజుల్లో 2 లక్షల కార్లు.. సేల్స్‌లో మారుతి సుజుకీ హవా.. ఈవీల లాంచ్ ఎప్పుడంటే..

ABN , Publish Date - Dec 02 , 2024 | 04:34 PM

మారుతి సుజుకీ మరోసారి రికార్డ్ బ్రేక్ అమ్మకాలను చవిచూసింది. భారత్ లో ఈ సంస్థకు ఉన్న డిమాండ్ ను తెలిపేలా నెల రోజుల్లో దాదాపు 2 లక్షల కార్లను విక్రయించింది..

Maruti Suzuki: నెలరోజుల్లో 2 లక్షల కార్లు.. సేల్స్‌లో మారుతి సుజుకీ హవా.. ఈవీల లాంచ్ ఎప్పుడంటే..
Maruti suzuki

ఢిల్లీ: కార్ల అమ్మకాల్లో దిగ్గజ కంపెనీ మారుతీ సుజుకీ రికార్డు సృష్టించింది. 2024 నవంబర్ నెలకుగాను కార్ల అమ్మకాల్లో 10.39 శాతం ఆరోగ్యకరమైన వృద్ధిని చవిచూసింది. గతేడాది నవంబర్ నెలతో పోటిస్తే రిటైల్ చేయబడిన 1,64,439 యూనిట్లతో పోలిస్తే దేశీయ మార్కెట్, ఎగుమతులతో కలిపి కంపెనీ గత నెలలో మొత్తం 1,81,531 యూనిట్లను విక్రయించింది. ఇక దేవీయ ప్యాసింజర్ అమ్మకాల విషయానికొస్తే... దాదాపు 1.41 లక్షల యూనిట్లు విడుదలయ్యాయి. గతేడాది ఇదే నెలలో 1.34 లక్షల యూనిట్లను విక్రయించింది. మారుతి సుజుకీ ఇతర ఓఈఎం అమ్మకాలను గతేడాది(4,882)తో పోలిస్తే ఈ ఏడాది(8,660) రెట్టింపు పెరుగుదలను నమోదు చేసింది.


ఆల్టో, ఎస్-ప్రెస్సో వంటి చిన్న కార్ల సెగ్మెంట్ల సేల్స్ స్వల్పంగా క్షీణించాయి. గతేడాది నవంబర్ లో 9,959 కార్లను విక్రయించగా ఈ ఏడాది నవంబర్లో ఈ సంస్థ 9,750 కార్ల అమ్మకాలను నమోదు చేసింది. బాలెనో, సెలెరియో, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్, వ్యాగన్ ఆర్ వంటి కాంపాక్ట్ కార్ సెగ్మెంట్లోనూ కంపెనీ గతేడాదికన్నా తక్కువ సేల్స్ ను చేసింది. గతేడాది ఇదే నెలలో 74,638 కార్లను అమ్మగా.. ఈ ఏడాది నవంబర్లో ఈ సంఖ్య 61,373కి పడిపోయింది. సియాజ్ నవంబర్ 2023లో 278 యూనిట్లు విక్రయించగా, నవంబర్ 2024లో 597 యూనిట్లు విక్రయించారు. ఇందులో రెండంకెల వృద్ధిని నమోదు చేసింది.


ఎస్‌యూవీ, ఎంపీవీ సెగ్మెంట్ విషయానికి వస్తే, మారుతి సుజుకి నవంబర్ 2024లో 59,003 సేల్స్‌తో హైజంప్‌ని చూసింది. ఈ విభాగంలో నవంబర్ 2023లో 49,016 యూనిట్లను మాత్రమే రీటైల్ చేయగలిగింది. ఈ స్వదేశీ ఆటోమేకర్ ఎస్‌యూవీ, ఎంపీవీ విభాగంలో బ్రెజ్జా, ఎర్టిగా, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా, ఇన్విక్టో, జిమ్నీ, ఎక్స్ ఎల్6 రూపంలో ఏడు ఉత్పత్తులను తీసుకొచ్చింది.

మొట్టమొదటి ఎలక్ట్రికల్ వెహికిల్..

మారుతి సుజుకి భారతదేశంలో తన మొట్టమొదటి ఎలక్ట్రికల్ వెహికిల్ ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. జనవరిలో ఢిల్లీలో జరిగే 2025 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఇ-విటారా ప్రారంభం కానుంది. మారుతి సుజుకి ఇ విటారా నేరుగా హ్యుండాయ్ క్రెటా ఈవీకి పోటీగా రానుంది. ఈ రెండూ ఒకే సారి మార్కెట్లోకి రానుండటం విశేషం. రెండు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు ఒకే ఛార్జ్‌పై 500ప్లస్ కిమీల పరిధితో వస్తాయని అంచనా వేస్తున్నారు. అయితే ధరలు సుమారు రూ. 15-20 లక్షల మధ్యలో ఉండే అవకాశం ఉంది.

Adani Group: అదానీ గ్రూప్ స్టాక్స్ 65 శాతం పెరగనున్నాయా.. నిజమేనా..


Updated Date - Dec 02 , 2024 | 04:34 PM