Share News

Stock Market: రోజంతా ఒడిదుడుకులు.. చివరకు నష్టాలతో ముగిసిన దేశీ సూచీలు..

ABN , Publish Date - Oct 09 , 2024 | 04:07 PM

ఆరు రోజుల నష్టాల నుంచి తేరుకుని మంగళవారం లాభాలు పండించిన దేశీయ సూచీలు బుధవారం లాభనష్టాలతో దోబూచులాడాయి. రోజంతా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయి. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వడ్డీ రేట్లను యధాతథంగా ఉన్నట్టు ప్రకటించడంతో మదుపర్లు ఉత్సాహంగా కొనుగోళ్లకు దిగారు.

Stock Market: రోజంతా ఒడిదుడుకులు.. చివరకు నష్టాలతో ముగిసిన దేశీ సూచీలు..
Stock Market

ఆరు రోజుల నష్టాల నుంచి తేరుకుని మంగళవారం లాభాలు పండించిన దేశీయ సూచీలు బుధవారం లాభనష్టాలతో దోబూచులాడాయి. రోజంతా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయి. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వడ్డీ రేట్లను యధాతథంగా ఉన్నట్టు ప్రకటించడంతో మదుపర్లు ఉత్సాహంగా కొనుగోళ్లకు దిగారు. దీంతో ఉదయం దేశీయ సూచీలు భారీ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. అయితే చివరి గంటలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు నష్టాల బాట పట్టాయి. చివరకు నష్టాలతోనే రోజును ముగించాయి (Business News).


మంగళవారం ముగింపు (81, 634)తో పోల్చుకుంటే దాదాపు 300 పాయింట్ల లాభంతో 81, 954 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ మధ్యాహ్నం వరకు లాభాల్లోనే కొనసాగింది. ఒక దశలో 82, 319 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం వరకు లాభాల జోరు చూపించింది. అయితే చివర గంటల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఇంట్రాడే గరిష్టం నుంచి వెయ్యి పాయింట్లకు పైగా కోల్పోయి 81, 342 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. చివరకు 167 పాయింట్ల నష్టంతో 81, 467 వద్ద రోజును ముగించింది. ఇక, నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. ఉదయం లాభాలతో ప్రారంభమైంది. చివరకు 31.20 పాయింట్ల నష్టంతో 24, 981 వద్ద రోజును ముగించింది. మళ్లీ 25 వేల దిగువకు వచ్చింది.


సెన్సెక్స్‌లో టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, మారుతీ సుజికీ, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాల బాటలో పయనించాయి. ఐటీసీ, నెస్లే ఇండియా, రిలయన్స్, హిందుస్తాన్ యూనీలీవర్, ఎల్ అండ్ టీ కంపెనీల షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ వరుసగా రెండో రోజు కూడా లాభపడింది. ఈ రోజు 566 పాయింట్లు లాభపడింది. బ్యాంక్ నిఫ్టీ 14 పాయింట్లు కోల్పోయింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.96గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 09 , 2024 | 04:07 PM