Share News

RK Kothapaluku : జర జాగ్రత్త... రేవంత్‌

ABN , Publish Date - Sep 29 , 2024 | 12:58 AM

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి ఇటీవలి కాలంలో దూకుడు పెంచింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కూడా గడవక ముందే బీఆర్‌ఎస్‌ నాయకులు స్పీడు పెంచడానికి కారణం లేకపోలేదు...

RK Kothapaluku : జర జాగ్రత్త... రేవంత్‌
Vemuri Radha Krishna

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి ఇటీవలి కాలంలో దూకుడు పెంచింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కూడా గడవక ముందే బీఆర్‌ఎస్‌ నాయకులు స్పీడు పెంచడానికి కారణం లేకపోలేదు. పది మాసాల క్రితం జరిగిన ఎన్నికల్లో అనూహ్య ఓటమితోపాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తుంటి ఎముక విరిగి విశ్రాంతి తీసుకోవాల్సి రావడం, ఆయన కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్‌ కేసులో జైలుకు వెళ్లాల్సి రావడం వంటి వరుస పరిణామాలతోపాటు లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోవడంతో బీఆర్‌ఎస్‌ భవితవ్యంపై నీలి మేఘాలు కమ్ముకున్నాయి. దీనికి తోడు పార్టీ తరఫున గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడం కూడా ఆ పార్టీని కుంగదీసింది. అయితే, కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన కొన్ని వ్యూహాత్మక తప్పిదాల వల్ల భారత రాష్ట్ర సమితి ముఖ్య నాయకులు కేటీఆర్‌, హరీశ్‌రావు ఇటీవలి కాలంలో దూకుడు పెంచి రేవంత్‌రెడ్డి సర్కార్‌పై విరుచుకుపడుతున్నారు. భవిష్యత్తుపై ఆ పార్టీ నాయకుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధపడిన మరింత మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతానికి వెనక్కి తగ్గారు. ప్రజలకు కనపడకుండా, వినపడకుండా ఫాంహౌస్‌కే పరిమితమైన బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, రాజకీయ వ్యూహాలకు పదునుపెట్టడం మొదలెట్టారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై న్యాయ పోరాటం చేసి వారిని అనర్హులుగా ప్రకటింపజేసి ఉప ఎన్నికలు వచ్చేలా కేటీఆర్‌, హరీశ్‌రావు వ్యూహరచన చేయగా, కేసీఆర్‌ వారిని వారిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మారడానికి మరికొంత సమయం పడుతుంది. కనుక ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌ పార్టీయే మళ్లీ గెలుస్తుందని కేసీఆర్‌ అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది. ఈ కారణంగా ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటింపచేయడంలో తొందరపడవద్దని, న్యాయ స్థానంలో వెంటనే తీర్పు రాకుండా కొంత సమయం తీసుకోవాలని కేసీఆర్‌ సూచించినట్టు చెబుతున్నారు. ఉప ఎన్నికలు అంటూ వస్తే వచ్చే ఏడాది జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని కేటీఆర్‌, హరీశ్‌రావుకు ఆయన సూచించినట్టు తెలిసింది. ఉప ఎన్నికలు వచ్చే లోపు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతను పెంచే దిశగా దాడిని ఉధృతం చేయాలని కూడా కేసీఆర్‌ దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి తెరవెనుక కూడా కొంత రాజకీయం చోటుచేసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.


కళ తప్పిన ‘కమలం’

నిజానికి భారత రాష్ట్ర సమితి ఇంత త్వరగా కోలుకుంటుందని ఎవరూ ఊహించలేదు. లోక్‌సభ ఎన్నికల వరకు జోరుమీదున్న భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం ఎందుకో నెమ్మదించింది. రాష్ట్రం నుంచి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ కేంద్ర మంత్రులుగా ఉన్నప్పటికీ ఆ పార్టీ కార్యక్రమాలు మందగించాయి. పార్టీ అధ్యక్షుడి మార్పు విషయమై కూడా బీజేపీ అధినాయకత్వం నిర్ణయం తీసుకోలేకపోతోంది. దీంతో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలని భావించిన బీజేపీ ఇప్పుడు వెనుకబడింది. అదే సమయంలో భారత రాష్ట్ర సమితి స్పీడ్‌ పెంచింది. మరో నెలలో హర్యానా, రెండు నెలల్లో మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రాని పక్షంలో ఆ ప్రభావం తెలంగాణ రాష్ట్రంలో పార్టీపై పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది ప్రారంభం నుంచి వేగం పెంచాలని కేసీఆర్‌ నిర్ణయించుకున్నారు. ఈ కారణంగానే కేటీఆర్‌, హరీశ్‌రావు నోటికి పదును పెడుతున్నారు. అదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ చోటుచేసుకుంటున్న పరిణామాలు ప్రతిపక్షానికి ఊతమిస్తున్నాయి.


కాంగ్రెస్‌లో తగ్గిన జోష్‌

రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన నాటి జోష్‌ ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీలో కనిపించడం లేదు. మంత్రులు కూడా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయం కారణంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పార్టీలో, ప్రభుత్వంలో పట్టుచిక్కడం లేదు. ఇదే సమయంలో మంత్రులపై అజమాయిషీ చేయలేని పరిస్థితిలోనూ ఆయన ఉన్నారు. అధిష్ఠానం జోక్యం ఎక్కువ కావడంతో ముఖ్యమంత్రి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ హైదరాబాద్‌లోనే మకాం చేస్తున్నారు. ఆమె ఇక్కడ ఎందుకు ఉంటున్నారో తెలియదుగానీ ఆమెపై కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి. మరోవైపు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన సునీల్‌ కనుగోలు కూడా ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. గత అనుభవాల నుంచి కాంగ్రెస్‌ అధిష్ఠానం గుణపాఠం నేర్చుకున్నట్టుగా లేదు. చీటికి మాటికీ ముఖ్యమంత్రిని ఢిల్లీకి పిలిపించుకొని తమ చుట్టూ తిప్పుకొంటున్నారు. ఇందిరాగాంధీ హయాంలో పరిస్థితులు ఇలా ఉండేవి కావు. కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకొనే ముందు అధిష్ఠానం తరఫున దూతలు ఆయా రాష్ర్టాలకు వెళ్లి అభిప్రాయ సేకరణ జరిపేవారు.

ముఖ్యమంత్రులను మార్చాలనుకున్నప్పుడు కూడా అధిష్ఠానం నుంచి దూతలు వచ్చేవారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కాంగ్రెస్‌ అధిష్ఠానం తరఫున దూతగా జీకే మూపనార్‌ వస్తున్నారంటే ముఖ్యమంత్రుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. ఇప్పుడు ఇందుకు విరుద్ధంగా పీసీసీ అధ్యక్షుడిని ఎంపిక చేయాలన్నా, మంత్రివర్గ విస్తరణకు అనుమతులు కావాలన్నా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమకుమార్‌రెడ్డిని ఢిల్లీకి పిలిపించుకొని రోజుల తరబడి కూర్చోబెట్టుకుంటున్నారు. దీంతో 1983కి ముందు పరిస్థితులు పునరావృతం అవుతున్నాయన్న భావన ప్రజల్లో ఏర్పడుతోంది. కాంగ్రెస్‌ అధిష్ఠానం జోక్యం పెరిగిపోవడం వల్లనే 1982లో ఎన్టీఆర్‌ ‘తెలుగు వాడి ఆత్మగౌరవం’ అన్న నినాదం అందుకొని తెలుగుదేశం పార్టీని ప్రారంభించారు. నిజానికి ఇప్పుడు కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రముఖులు అని చెప్పుకొంటున్న వారికి ఢిల్లీలో పెద్దగా పని లేదు. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్‌ మినహా మరే రాష్ట్రంలోనూ పార్టీ అధికారంలో లేదు. అలాంటప్పుడు ఢిల్లీలో కూర్చొని ముఖ్యమంత్రులను పిలిపించుకొనే బదులు ఆయా రాష్ర్టాలకు వారే వెళ్లవచ్చు కదా అన్న అభిప్రాయం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆయనకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. ఫలితంగా అప్పట్లో అసంతృప్త స్వరాలు వినిపించేవి కావు. పార్టీపైనా, ప్రభుత్వం పైనా రాజశేఖర రెడ్డికి పూర్తి పట్టు ఉండేది. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా కాంగ్రెస్‌ అధిష్ఠానం రాజశేఖర రెడ్డికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. ఇప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ బలహీనంగా ఉంది. అయినా, ఏ రాష్ట్రంలోనైనా రాష్ట్ర నాయకుల రెక్కల కష్టంతో అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వంపై ఢిల్లీ పెద్దలు పెత్తనం చేయాలనుకుంటున్నారు. ఈ కారణంగా భవిష్యత్తులో తెలంగాణలో కాంగ్రెస్‌ బలహీనపడితే అందుకు పార్టీ అధిష్ఠానం కూడా బాధ్యత తీసుకోవలసి ఉంటుంది.


మంత్రులే ముఖ్యమంత్రుల్లా...

మంత్రులకు తమ శాఖల వ్యవహారాల్లో స్వేచ్ఛ ఉండాలి కానీ అది అపరిమితం కాకూడదు. మంత్రులకు కేటాయించిన శాఖలకు సంబంధించిన అంశాలలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకోలేని పరిస్థితి కల్పిస్తే ఎలా? కేసీఆర్‌ హయాంలో మంత్రులకు స్వేచ్ఛ ఉండేది కాదన్న విమర్శ ఉన్నప్పటికీ... ఇతర మంత్రిత్వ శాఖలపై అజమాయిషీ చేసే అధికారం ముఖ్యమంత్రికి లేకుండా చేయడం ఏమిటి? ఈ కారణంగా ఇప్పుడు తెలంగాణలో పలువురు మంత్రులు తామూ ముఖ్యమంత్రులమే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఉదాహరణకు వైద్య ఆరోగ్య శాఖ పనితీరు అధ్వానంగా ఉంది. ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరు గతంతో పోల్చితే ఇప్పుడు బాగోలేదన్న అభిప్రాయం ఉంది. అలాగే, విద్యుత్‌ శాఖ పనితీరుపై కూడా ప్రజల్లో అసంతృప్తి నెలకొంటోంది. అయినా ఆయా శాఖల పనితీరును సమీక్షించి మెరుగుపరిచే స్వేచ్ఛ ముఖ్యమంత్రికి లేని పరిస్థితి. దీనికి తోడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా కొన్ని సందర్భాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజలను దృష్టిలో ఉంచుకొని మాత్రమే ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి. వ్యక్తులను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటే రాజకీయంగా నష్టమే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగిందో చూశాం. ప్రతిపక్ష నేత చంద్రబాబు టార్గెట్‌గానే ఆయన నిర్ణయాలు ఉండేవి. తాను జైలు జీవితం గడపడానికి కారణమని భావించి చంద్రబాబును కూడా జైలుకు పంపాలని జగన్‌రెడ్డి తపించారు.

చివరికి తన కోరిక నెరవేర్చుకున్నారు. దానివల్ల ఆయన సాధించింది ఏమీ లేకపోగా ఎన్నికల్లో దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్నారు. 11 సీట్లకే పరిమితం అయ్యారు. తెలంగాణలో కూడా కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డిని టార్గెట్‌ చేసుకున్నారు. అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కోపంతో వేధించారు. ఫలితంగా తెలంగాణలో ఒక వర్గం ఓటర్లను దూరం చేసుకున్నారు. ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డిని జైలుకు పంపి తన అహాన్ని సంతృప్తిపరచుకొని ఉండవచ్చునుగానీ ఏకును మేకుగా తయారు చేస్తున్నానని మరచిపోయారు. ఆనాటి వేధింపులతో రాటుదేలిన రేవంత్‌రెడ్డి ఏకంగా ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. అప్పట్లో కేసీఆర్‌ అతిగా వ్యవహరించి ఉండకపోతే రేవంత్‌రెడ్డి ఈ స్థాయికి ఎదగడానికి మరికొంత సమయం పట్టేదేమో? ఇది గతం! ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్‌రెడ్డి కూడా గత చేదు అనుభవాలను మరచిపోలేక పోతున్నారు. ఫలితంగా కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావులను దృష్టిలో పెట్టుకొనే వ్యవహరిస్తున్నారు. తెలంగాణ సమాజంలో కేసీఆర్‌ కుటుంబ ప్రభావం లేకుండా చేయాలని చూసిన సందర్భాలను చూశాం. తెలంగాణ చిహ్నం, తెలంగాణ గీతం, తెలంగాణ తల్లి విగ్రహం వంటి అంశాలు ఈ కోవలోకే వస్తాయి. తెలంగాణ అనేది ఏ ఒక్కరి జాగీరూ కాదు. తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్‌ పాత్రను ఎవరూ తుడిచివేయలేరు. తాము స్వప్నించిన తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడంలో తనవంతు పాత్ర పోషించిన కేసీఆర్‌ను నెత్తిన పెట్టుకున్న ప్రజలే ఆయన నియంతృత్వ పోకడలను సహించలేక విసిరికొట్టారు.


కేసీఆర్‌ వంటి శక్తిమంతమైన నాయకుడు కూడా ప్రజాగ్రహం ముందు తలవొంచక తప్పలేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని నడపడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాడిన భాషను ముఖ్యమంత్రిగా కూడా వాడితే ప్రజలు హర్షించరు. నాయకుడిగా వాడిన భాషనే ముఖ్యమంత్రిగా కూడా కేసీఆర్‌ వాడారు. చివరకు బావుకున్నది ఏమీ లేదు. పుష్కర కాలం పాటు తెలంగాణ ఉద్యమం సాగింది కనుక కేసీఆర్‌ భాషకు ప్రజలు అలవాటుపడ్డారు. రేవంత్‌రెడ్డి ఆయనకంటే ఎంతో చిన్నవారు. ఈ కారణంగా కేసీఆర్‌ భాషను ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి వాడకూడదు. ముఖ్యమంత్రి అంటే హుందాతనం ఉండాలి. రాజశేఖర రెడ్డి మర్రిచెట్టులా విస్తరించడంతో తెలంగాణలో కాంగ్రెస్‌కు బలమైన నాయకులు లేకుండా పోయారు. ఫలితంగానే ఎవరికి వారు తామెందుకు ముఖ్యమంత్రి కాకూడదని 2014 నుంచి పోటీపడుతూ వచ్చారు. చివరికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డి ప్రదర్శించిన దూకుడు ఆయనకు కలిసొచ్చింది. ప్రజలు ఆయనలో కేసీఆర్‌కు ప్రత్యామ్నాయ నాయకుడిని చూసుకున్నారు. అప్పుడున్న పరిస్థితులలో రేవంత్‌రెడ్డికి మాత్రమే ప్రజల్లో ఆదరణ ఉంది. ఎన్నికల సమయంలో పార్టీని ముందుకు నడిపించడంలో కూడా ఆయన తన సమర్థతను రుజువు చేసుకున్నారు. రేవంత్‌రెడ్డిలోని టాలెంట్‌ను గుర్తించిన రాహుల్‌గాంధీ ఆయనకు కొండంత అండగా ఉంటున్నారు. అయితే ప్రతిపక్షంలో ప్రదర్శించిన దూకుడు ప్రభుత్వాధినేతకు తగదని ముఖ్యమంత్రి తెలుసుకోవాలి. కేసీఆర్‌, కేటీఆర్‌ను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోకూడదు. తమ ప్రభుత్వ నిర్ణయాలకు ప్రజామోదం ఉందా? లేదా? అని మాత్రమే చూసుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఇరికించే అవకాశం రేవంత్‌రెడ్డికి ఉంది. అయితే ఇందులో అనేక ప్రతిబంధకాలు ఉన్నాయి. ఎన్నో ఒత్తిళ్లు ఉంటాయి. చర్యలంటూ తీసుకుంటే నీటి పారుదల శాఖలో పనిచేయడానికి ఇంజనీర్లు మిగలరన్నది అక్షర సత్యం. కాళేశ్వరంపై విచారణ జరుపుతున్న పీసీ ఘోష్‌ కమిషన్‌ చేస్తున్న వ్యాఖ్యలను కూడా చూస్తున్నాం. అందుకే చివరకు గజం మిథ్య పలాయనం మిథ్య అవుతుంది. ఇప్పుడు అవినీతి ప్రాతిపదికన ఎన్నికల్లో ప్రజల తీర్పు ఉండటం లేదు.

అలా అయితే జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయివుండేవారే కారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్‌ అవినీతికి పాల్పడిన తీరును రుజువు చేసినా కాంగ్రెస్‌ పార్టీకి అదనపు ప్రయోజనం ఉండకపోవచ్చు. ఎన్నికల్లో తాము ఓడించిన వారిని ప్రజలు ఇట్టే మరచిపోతారు. అధికారంలో ఉన్నప్పుడు వారు చేసిన చర్యలను కూడా గుర్తుపెట్టుకోరు. ప్రభుత్వంలో ఉన్నవారి నిర్ణయాలు ఎలా ఉంటున్నాయని మాత్రమే చూస్తారు. వ్యక్తులు టార్గెట్‌గా ప్రభుత్వాన్ని నడిపితే ఫలితం ప్రతికూలంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లక ముందే ఇటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, అటు కాంగ్రెస్‌ అధిష్ఠానం మేలుకోవాలి. రైతులకు రుణ మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్‌ అధికారంలో ఉన్నప్పుడు దాన్ని చాలా కాలం మరచిపోయారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ముందూ వెనుకా చూసుకోకుండా, ఆర్థిక వనరులను సమకూర్చుకోకుండా పౌరుషానికి పోయి రుణమాఫీకి పూనుకుంది. ప్రతిపక్షానికి అదే ఆయుధం అయింది. అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు ఎన్నో హామీలు ఇవ్వడం పరిపాటి అయింది. ప్రజలు కూడా అవన్నీ అమలు అవుతాయని ఆశించడం లేదు. మొత్తంగా ప్రభుత్వ పనితీరు సంతృప్తికరంగా ఉందా? లేదా? అని మాత్రమే చూస్తారు.


ఆచితూచి వెళితేనే...

ప్రభుత్వాధినేతగా రేవంత్‌రెడ్డి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం అలవరుచుకోవాలి. చెరువులు, జలాశయాల పరిరక్షణ అవసరమే. అంతమాత్రాన ఈ విషయంలో దూకుడు తగదు. ఆక్రమణల పేరిట వేలాది ఇళ్లు కూల్చడం ప్రజల్లో వ్యతిరేకతకు దారితీస్తుంది. హైడ్రా చర్యల వల్ల ఏ పాపం తెలియనివాళ్లు నిరాశ్రయులు అవుతున్నారు. ఫాం హౌజ్‌లను, అతిథి గృహాలను నిబంధనలను అతిక్రమించి నిర్మిస్తే కూల్చినా ఫర్వాలేదుగానీ... అన్ని అనుమతులతో పేదలు, మధ్యతరగతివారు నిర్మించుకున్న వాటిని, దశాబ్దాల క్రితం నిర్మించుకున్న వాటిని తొలగించాలనుకోవడం మంచిది కాదు. ప్రభుత్వ స్థలాలు, చెరువు శిఖంను అక్రమించడం పరిపాటిగా మారింది. రాజకీయ పార్టీలు ఈ చర్యలను ఇప్పటివరకూ ప్రోత్సహించాయి. మూసీ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలనుకోవడం తప్పు కాదు. అయితే... దశాబ్దాలుగా మూసీలో ఆక్రమణలు జరిగాయి. వేలాది మంది ఇళ్లను నిర్మించుకున్నారు. నిజానికి ఈ ప్రాజెక్టును ప్రజలు కోరుకోలేదు. ఫాం హౌస్‌ల కూల్చివేతలు జరిగినప్పుడు ప్రజల్లో సానుకూల స్పందన ఏర్పడింది. అయితే, హైడ్రా దూకుడు పెంచి సామాన్య ప్రజలు నిర్మించుకున్న ఇళ్లను కూడా కూల్చివేయడం ప్రారంభించగానే ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. చెరువులు, జలాశయాల ఎఫ్‌టీఎల్‌ బఫర్‌ జోన్లను ముందుగా నిర్ణయించకుండా, ఇతర శాఖల అనుమతులతో నిర్మించుకున్న ఇళ్లను కూల్చడం సమర్థనీయం కాదు. ఇది అంతిమంగా ప్రజల్లో వ్యతిరేకతకు దారితీస్తుంది. తాజాగా బుచ్చెమ్మ అనే మహిళ కూల్చివేతలకు భయపడి ఆత్మహత్య చేసుకుంది. మరోవైపు మూసీనది ప్రక్షాళన పేరుతో జనావాసాలను ఖాళీ చేయించడంపై కూడా ప్రజల్లో ఆగ్రహావేశాలు నెలకొన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తక్షణం ఈ అంశంపై దృష్టి కేంద్రీకరించాలి. కూల్చివేతలకు తాత్కాలికంగా విరామం ప్రకటించాలి. మొత్తం పరిస్థితిని సమీక్షించాలి. రెండు రోజుల క్రితం సంగారెడ్డి వద్ద ఎవరో చెరువులో నాలుగు అంతస్తుల భవనం నిర్మించుకున్నారు. అలాంటి వాటిని కూల్చినా ఎవరూ పట్టించుకోరు. మూసీ నది విషయమే తీసుకుందాం. అక్కడ ఆక్రమణలు జరగడానికి గత ప్రభుత్వాలే కారణం. సంబంధిత అధికారులు పట్టించుకోలేదు. రాజకీయ పార్టీలు ఒత్తిళ్లు తెచ్చి ఆక్రమణలకు పాల్పడి నిర్మించుకున్న కాలనీలకు ఆయా శాఖల అధికారులతో నీరు, విద్యుత్‌ వంటి సౌకర్యాలను సమకూర్చాయి. ఓట్లకోసం ఖాళీ స్థలాలను ఆక్రమింపజేయడం మన రాజకీయ పార్టీలకు అలవాటుగా మారింది. ఇలా ఆక్రమిత ప్రాంతాల్లో నిర్మితమైన ఇళ్లు చేతులు మారాయి. ఇప్పుడు డబ్బు పెట్టి వాటిని కొనుగోలు చేసినవాళ్లు లబోదిబోమనడం సహజం. కూల్చివేతలపై ప్రజల్లో వ్యతిరేకత బలపడకముందే ప్రభుత్వం మేలుకోవాలి. తమది నిర్మాణాత్మక ప్రభుత్వమైతే రేవంత్‌రెడ్డిది కూల్చివేతల ప్రభుత్వమని బీఆర్‌ఎస్‌ నాయకుడు కేటీఆర్‌ చేసిన విమర్శ ప్రజల్లోకి వ్యాపించక ముందే ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలి. కూల్చివేతలే ప్రభుత్వ అజెండా అయితే ప్రతిపక్షానికి బలమైన ఆయుధం ఇచ్చినట్టు అవుతుంది. తెలంగాణలో కూల్చివేతలు మాత్రమే జరుగుతున్నాయని ప్రజల్లో అభిప్రాయం ఏర్పడితే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది.


ఈ నేపథ్యంలో ప్రభుత్వం తలపెట్టిన మూసీ ప్రాజెక్టును తాత్కాలికంగా పక్కనపెట్టడం వాంఛనీయం. లేడికి లేచిందే పరుగు అన్నట్టుగా ఏదీ ఉండకూడదు. ఆక్రమణలకు పాల్పడిన వారిని ముందుగా గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలి. ఆక్రమణలకు పాల్పడి ఇళ్లు నిర్మించి విక్రయించిన వారి నుంచి జరిమానా వసూలు చేసి బాధితులకు నష్టపరిహారం చెల్లించడం వంటి చర్యలపై దృష్టిపెట్టాలి. ఎవరో చేసిన నేరాలకు మరెవరినో శిక్షించడం సమంజసం, సమర్థనీయం కాదు కదా! ఆక్రమణ అయినా, మరేదైనా ప్రజలతో ముడిపడి ఉన్న సందర్భాలలో ప్రభుత్వం సంయమనంతో వ్యవహరించాలి. వ్యక్తులు వేరు– ప్రజా సమస్యలు వేరు. ఏళ్ల తరబడి ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల ఆక్రమణ అనేది హక్కుగా ప్రజలు భావించే పరిస్థితి ఏర్పడింది. ఏది ఏమైనా కూల్చివేతలపై ప్రజాభిప్రాయం ఎలా ఉందో తెలుసుకొనే ప్రయత్నం ఇప్పుడు జరగాలి. హైడ్రా చర్యలను తొలుత ఆక్షేపించని ప్రతిపక్షాలు ఇప్పుడు ఎందుకు స్వరం పెంచుతున్నాయో తెలుసుకొనే ప్రయత్నం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేయాలి. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అంటే కూల్చివేతల ప్రభుత్వం అనే పేరు తెచ్చుకోవద్దు. హెచ్చరికలతో కూడిన ఈ సూచనలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పట్టించుకుంటారో లేదో వేచి చూద్దాం!

ఆర్కే


3-Ed.jpg

యూట్యూబ్‌లో ‘కొత్త పలుకు’ కోసం

QR Code scan చేయండి

Updated Date - Sep 29 , 2024 | 08:23 PM