Share News

సాయిరెడ్డి ‘సన్యాసం’ కథ!

ABN , Publish Date - Jan 26 , 2025 | 12:28 AM

‘ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ..’ అని ఒక కవిగారు ఎప్పుడో అన్నారు. రాజకీయాలలో ఇది మరీ ఎక్కువగా జరుగుతుంటుంది. వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి శనివారం...

సాయిరెడ్డి ‘సన్యాసం’ కథ!

‘ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ..’ అని ఒక కవిగారు ఎప్పుడో అన్నారు. రాజకీయాలలో ఇది మరీ ఎక్కువగా జరుగుతుంటుంది. వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి శనివారం నుంచి రాజకీయ సన్యాసం తీసుకుంటున్నానని ప్రకటించడం ఈ కోవలోకే వస్తుంది. గతంలో ఎక్స్‌ వేదికగా నికృష్టమైన పోస్టులు పెట్టిన ఆయనపై విమర్శలు వెల్లువెత్తడంతో ఇకపై హుందాగా ఉంటానని ప్రకటించి మాట తప్పారు. ఈ కారణంగా ఇప్పుడు కూడా ‘రాజకీయ సన్యాసం’ చేస్తున్నానన్న మాటకు కట్టుబడి ఉంటారో లేదో వేచి చూడాలి. పలు అవినీతి కేసులలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఏ–1గా ఉండగా, విజయసాయిరెడ్డి ఏ–2గా ఉన్నారు. వీరిద్దరినీ విడదీసి చూడలేము. అవినీతి విషయంలో అవిభక్త కవలలుగా చేయకూడని పనులన్నీ చేశారు. అలాంటి విజయసాయిరెడ్డి హఠాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారా? అన్న అనుమానం సహజంగానే కలుగుతుంది. నిజానికి ఇది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదు. ఏడు మాసాల క్రితం జరిగిన ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోయిన నాటి నుంచి ఆయన వైఖరిలో మార్పు వచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్‌రెడ్డి ఆయనను దూరం పెట్టారు. దీంతో ఆయన పార్టీలో పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తూ వచ్చినా ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఎన్నికల్లో ఓడిపోవడంతో పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలని ఒక దశలో భావించారు. అయితే జగన్‌రెడ్డి ఒత్తిడి తేవడంతో పార్టీ ఉత్తరాంధ్ర వ్యవహారాల ఇంచార్జిగా మళ్లీ బాధ్యతలు చేపట్టారు. భవిష్యత్తులో తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోవడం లేదని కూడా విజయసాయిరెడ్డి ప్రకటించారు.


అయితే ఇది కూడా విధిలేని స్థితిలోనే ఆయన ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ తనను దగ్గరకు రానివ్వదు కనుక భారతీయ జనతా పార్టీలో చేరిపోవాలని కొన్ని రోజుల క్రితం ఆయన భావించారు. తనతో పాటు ఏడెనిమిది మంది రాజ్యసభ సభ్యులను తీసుకువస్తానని, పార్టీలో చేర్చుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కలసి అర్జీ పెట్టుకున్నారు. అయితే ఈ విషయమై మరో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ను కలసి మాట్లాడుకోవలసిందిగా అమిత్‌ షా ఆయనకు సూచించారు. దీంతో పీయూష్‌ను కలసిన విజయసాయి.. తనను బీజేపీలో చేర్చుకోవాలని కోరారు. అయితే కేంద్రంలో ప్రధాని మోదీ ప్రభుత్వం ఏర్పడటానికి కారణం అయిన తెలుగుదేశం పార్టీ ఆమోదం లేకుండా పార్టీలో చేర్చుకోలేమని పీయూష్‌ గోయల్‌.. విజయసాయికి తెగేసి చెప్పారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి నిరభ్యంతర పత్రం పొందడం కోసం విజయసాయి చేయని ప్రయత్నం లేదు. పార్టీ ముఖ్యులను కలసి తన మనసులోని మాటను చెప్పుకొన్నారు. జగన్‌రెడ్డిపై పెండింగ్‌లో ఉన్న అవినీతి కేసులలో అప్రూవర్‌గా మారితే భారతీయ జనతా పార్టీలో చేరడానికి తాము క్లియరెన్స్‌ ఇస్తామని తెలుగుదేశం ముఖ్యులు ఆయనకు స్పష్టంచేశారు. దీంతో ఆయన డైలమాలో పడ్డారు. ఒక దశలో ఆయన అప్రూవర్‌గా మారడానికి కూడా సిద్ధపడ్డారు. అయితే గొడ్డలి గుర్తుకు వచ్చి పీడకల రావడంతో మరుసటి రోజుకే ఆయన తన మనసు మార్చుకున్నారట. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు ఏమి జరిగిందో అక్కడి సన్నివేశాల గురించి క్షుణ్నంగా తెలిసినప్పటికీ పార్టీ ఆదేశం మేరకు వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని తొలుత ప్రకటించింది విజయసాయిరెడ్డే కావడం గమనార్హం.


అవినీతి కేసులలో అప్రూవర్‌గా మారితే తనకు ముప్పు తప్పదని భావించిన విజయసాయి రెడ్డి.. మనసు మార్చుకున్నారని ఆయన సన్నిహితులు చెబుతారు. ఈ దశలోనే ఆయనను ఉత్తరాంధ్ర ఇంచార్జిగా జగన్‌రెడ్డి నియమించారు. ఇష్టంగానో అయిష్టంగానో ఆయన ఆ బాధ్యతలు చేపట్టారు. తర్వాత కూడా చంద్రబాబుపై తనకున్న ద్వేషాన్ని దాచుకోకుండా ఎక్స్‌ వేదికగా నోరు పారేసుకున్నారు. 2029 నాటికి చంద్రబాబు బతికుంటే అప్పుడు తాము అధికారంలోకి వచ్చి ఆయనను జైలుకు పంపుతామని విజయసాయిరెడ్డి నోరు పారేసుకున్నారు. పనిలో పనిగా నాపై కూడా చెత్త ఆరోపణలు చేస్తూ తన మనో వికారాలను బయట పెట్టుకున్నారు. బహిరంగ చర్చకు రావాలంటూ సవాలు విసిరి తోక ముడిచారు. చంద్రబాబును తిడుతూనే జనసేనాని పవన్‌ కల్యాణ్‌ను కీర్తించారు. కూటమిలో విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేశారు. విజయసాయిరెడ్డి మాటలకూ చేతలకూ పొంతన ఉండదు. అందువల్లే ఆయన మాటలను రాజకీయాల్లో ఎవరూ విశ్వసించరు. భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధపడినా ఆ పార్టీ ముఖ్యులు ఆయనను సీరియస్‌గా తీసుకోలేదు. అయినా కనపడిన వారినందరినీ కలసి జగన్‌రెడ్డితో తాను ఇక ప్రయాణం చేయలేనని ఆయన వాపోతూ వచ్చారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్‌రెడ్డి తనను తరచుగా అవమానిస్తూ వచ్చినా విజయసాయి సహిస్తూ వచ్చారట. వాస్తవానికి వైఎస్‌ రాజశేఖరరెడ్డితో విజయసాయికి పరిచయం ఏర్పడిన నాటి నుంచి ఆ కుటుంబానికి విధేయుడిగా ఆయన ఉండిపోయారు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆడిటర్‌గా తన తెలివితేటలను ఉపయోగించి క్విడ్‌ ప్రో కోకు తెర లేపారు. జగన్‌రెడ్డితో అనతికాలంలోనే వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మింపజేశారు. ఈ క్రమంలో అన్ని కంపెనీలనూ జగన్‌ పేరిట ఏర్పాటు చేస్తే షర్మిల పరిస్థితి ఏమిటి? అని రాజశేఖరరెడ్డి ఆయనను నిలదీశారు. తోడబుట్టిన వాళ్లు గిఫ్ట్‌ డీడ్‌లు చేసుకోవచ్చునని విజయసాయిరెడ్డి సర్దిచెప్పారు. సండూర్‌ పవర్‌ ఏర్పాటు నుంచి ఆ తర్వాత డజన్లకొద్దీ సూట్‌కేస్‌ కంపెనీల ఏర్పాటు వెనుక విజయసాయి ఉన్నారు. ఈ క్రమంలోనే ఒక చార్టెడ్‌ ఎకౌంటెంట్‌గా విజయసాయి అనైతికంగా వ్యవహరించినందున ఆయన సర్టిఫికెట్‌ను ఎందుకు రద్దు చేయకూడదు అంటూ చార్టెడ్‌ ఎకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా చెన్నై విభాగం ఆయనకు షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. దీనిపై కూడా ఆయన హైకోర్టులో స్టే పొందారు.


అవమానాలను దిగమింగుకొని..

వైఎస్‌ కుటుంబంపై తనకు ఉన్న విధేయత, అభిమానం వల్లనే ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా ఆ కుటుంబంతో తన అనుబంధాన్ని కొనసాగిస్తున్నానని విజయసాయిరెడ్డి తన సన్నిహితుల వద్ద చెబుతుంటారు. మన దేశంలో రాజకీయ అధికారాన్ని మించిన అధికారం లేదని విజయసాయిరెడ్డి అంటూ ఉంటారు. అలాంటిది ఉన్న ఎంపీ పదవిని కూడా ఆయన ఎందుకు వదులుకుంటున్నారు? అన్న ప్రశ్న తప్పకుండా వస్తుంది. ఈ నేపథ్యంలో జగన్‌రెడ్డితో ఆయనకు ఎదురైన చేదు అనుభవాల గురించి తెలుసుకోవాలి. రాజశేఖరరెడ్డి కుటుంబంతో ఉన్న ఆత్మీయ అనుబంధం కారణంగానే జగన్‌రెడ్డితో కలసి ప్రయాణించవలసి వస్తున్నదని ఆయన తరచుగా అంటూ ఉంటారట. తన మాయా సామ్రాజ్య నిర్మాణానికి కర్త కర్మ క్రియ వంటి విజయసాయి పట్ల జగన్‌రెడ్డి కనీసం ఉదారంగానైనా ఉండేవారు కాదట. మొదటిసారి రాజ్యసభ పదవి ఇవ్వజూపినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నందున ఎమ్మెల్యేలకు తలా కోటి రూపాయలు ఇవ్వాలని జగన్‌రెడ్డి సూచించగా చెన్నైలో ఒక భవనాన్ని విజయసాయి విక్రయించి ఆ సొమ్ము పంచిపెట్టి ఎంపీ అయ్యారు. ఒక దశలో విజయసాయిరెడ్డి ఫ్రెంచి కట్‌ గడ్డంతో ఉండేవారు.


అప్పుడు ఆయనను చూసిన జగన్‌రెడ్డి రోత మీడియా ఉద్యోగుల ముందే మీ ముఖానికి ఆ పిల్లిగడ్డం అవసరమా? అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇలాంటి అవమానాలు ఎదురైనా భరించి జగన్‌రెడ్డి అధికారంలోకి వస్తే చక్రం తిప్పవచ్చునని విజయసాయి భావించారు. అనుకున్నట్టుగానే 2019లో అధికారంలోకి రాగానే ఆయన రెచ్చిపోయారు. ఉత్తరాంధ్ర ఇంచార్జిగా తిరుగులేని అధికారం చలాయించారు. ఈ క్రమంలో ఆయనకూ, పార్టీలోని ఇతర ముఖ్యులకూ మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఆయనపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో పార్టీలో విజయసాయి ప్రాధాన్యాన్ని జగన్‌రెడ్డి తగ్గిస్తూ వచ్చారు. చివరకు ఉత్తరాంధ్ర ఇంచార్జిగా కూడా తప్పించారు. అయినా సీబీఐ, ఈడీ కేసులలో విచారణ ముందుకు సాగకుండా ఢిల్లీ స్థాయిలో విజయసాయి తన వంతు కృషి చేశారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షాలకు విధేయుడిగా మారిపోయారు. ఈ విధంగా స్వామి కార్యం, స్వకార్యం చక్కదిద్దుకుంటూ వచ్చారు. అయినా ఎన్నికల ముందు, ఆ తర్వాత కూడా జగన్‌రెడ్డి నుంచి ఈసడింపులు తప్పలేదు. జగన్‌రెడ్డి ఆయనను నమ్మడం పూర్తిగా మానేశారు. ఈ దశలో తమపై ఉన్న కేసుల గురించి జగన్‌రెడ్డి వద్ద చర్చకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం చంద్రబాబుపై ఆధారపడి ఉన్నందున ఆయన మాటకు విలువ ఉంటుందని, కేసుల విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది కనుక జాతీయ స్థాయి మద్దతు కోసం కాంగ్రెస్‌ పార్టీకి దగ్గరవుదామని జగన్‌రెడ్డి ప్రతిపాదించారట.


దీంతో విజయసాయిరెడ్డి కల్పించుకొని ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ప్రధాని మోదీని ధిక్కరించడం సరైనది కాదని సూచించినా జగన్‌ లెక్క చేయలేదు. మరోవైపు తాను వియ్యం అందుకున్న అరబిందో ఫార్మా అధినేత రాంప్రసాద్‌రెడ్డి కూడా విజయసాయిరెడ్డి రాజకీయాల వల్ల తమకు ఇబ్బందులు వస్తున్నాయని అసహనం వ్యక్తంచేశారట. ఒక్కగానొక్క కుమార్తె సంసార జీవితంలో ఇబ్బందులు ఏర్పడకూడదని విజయసాయి అంతర్మథనం చెందుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అనుమతి పొంది భారతీయ జనతా పార్టీలో చేరిపోయి ఆ తర్వాత రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్లీ బీజేపీ తరఫున ఎంపీ కావాలని భావించారు. తన కుమార్తెను తెలంగాణలో బీజేపీ తరఫున వచ్చే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయించాలని కూడా ఆయన తలపోశారు. తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్టుగా ఆయనకు భారతీయ జనతా పార్టీలో చేరడం సాధ్యం కాలేదు. కుటుంబపరంగా, రాజకీయంగా సమస్యలు చుట్టుముట్టడంతో ఆయన కొన్ని రోజులుగా మానసికంగా నలిగిపోయారని చెబుతున్నారు. మా వాడు మెంటల్‌ బ్యాలెన్స్‌ తప్పినట్టుగా ప్రవర్తిస్తున్నాడు అని వైసీపీకి చెందిన ఒక ముఖ్యుడు ఈ మధ్య నా వద్ద వ్యాఖ్యానించారు. తాను ఇప్పటికీ బాడుగ ఇంట్లోనే ఉంటానని విజయసాయిరెడ్డి చెప్పుకొంటారు కానీ అది నిజం కాదు. వైఎస్‌ కుటుంబం వల్ల తాను బాగానే లాభపడ్డానని, చార్టెడ్‌ ఎకౌంటెంట్‌గా ప్రాక్టీస్‌ చేసి ఉంటే అంత సంపాదించేవాడిని కానని ఆయన తన కొలీగ్స్‌ వద్ద చెబుతుంటారు. విజయసాయికి 22 ఎకరాల్లో ఫాం హౌజ్‌ కూడా ఉంది. అందులో దేశ విదేశాల నుంచి వన్య ప్రాణులను తెప్పించి పోషిస్తున్నారు. ఇప్పుడు తన నివాసం కోసం సొంత భవనాన్ని నిర్మించుకుంటున్నారు. స్వామి కార్యం, అంటే జగన్‌రెడ్డికి అక్రమ సంపాదనలో సహాయపడుతూనే.. స్వకార్యం, అంటే తన కోసం కూడా ఆయన బాగానే సంపాదించి పెట్టుకున్నారు. అయితే అన్ని రోజులూ ఒకేలా ఉండవు కదా. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో వారి పాపాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. మద్యం, ఇసుక, భూముల విషయాల్లో విజయసాయిరెడ్డి చేతివాటంపై చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ కారణంగానే పవన్‌ కల్యాణ్‌ ద్వారా రక్షణ పొందవచ్చునని డిప్యూటీ సీఎంను పొగుడుతున్నారు. కాకినాడ పోర్టులో తన సొంత అల్లుడి పేరిట బలవంతంగా తీసుకున్న షేర్లను తిరిగి కేవీ రావుకు బదలాయింపజేశారు. ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో ప్రతికూల పరిస్థితులు ఉండటంతో ఇక లాభం లేదనుకున్న విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్టు ప్రకటించి ఉంటారు. తాను నమ్ముకున్న జగన్‌రెడ్డి తనను నమ్మకపోవడం, అవసరార్థం తానుగా విధేయత ప్రకటించుకున్నప్పటికీ కేంద్ర పెద్దల నుంచి కోరుకుంటున్న ఉపశమనం లభించే పరిస్థితి కనిపించకపోవడం, ఇతరత్రా సమస్యలు చుట్టుముట్టడంతో విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం అనే నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.


‘అయోధ్య’ ఆగిందెందుకు?

రాజ్యసభ చైర్మన్‌ను కలసి విజయసాయిరెడ్డితో పాటు అయోధ్య రామిరెడ్డి కూడా ఎంపీ పదవులకు శనివారం రాజీనామా చేస్తారని మూడు రోజుల క్రితమే నాకు తెలుసు. అయితే ఈ విషయం నాకు చెప్పిన వ్యక్తికి ఇచ్చిన మాట ప్రకారం మీడియాలో ఉండి కూడా నేను ఆ విషయాన్ని బయటపెట్టలేదు. జర్నలిజంలో ఇలాంటి ప్రమాణాలు ఉంటాయని విజయసాయిరెడ్డి వంటి వారికి తెలియదు. రోత మీడియా గురించి మాత్రమే వారికి తెలుసు. అయోధ్య రామిరెడ్డి విషయానికి వస్తే ఆయనకు రాజ్యసభ సభ్యత్వం వదులుకోవడం ఇష్టం లేదు. వైసీపీ నుంచి ఎంపిక అయినందున ఇప్పటికి రాజీనామా చేసినా తెలుగుదేశం పార్టీలో చేరి మళ్లీ తన పదవి దక్కించుకోవాలని తలపోశారు. బీజేపీలో చేరడానికి ఆయన ఇష్టపడలేదట. రాజ్యసభలో తమ బలం పెరగాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. అయితే అయోధ్యరెడ్డి ఆ పార్టీలో చేరడానికి ఇష్టపడకపోవడంతో తెలుగుదేశం పార్టీ కూడా ఆయనను చేర్చుకోవడానికి సుముఖత వ్యక్తం చేయలేదట. ఈ కారణంగా అయోధ్య రామిరెడ్డి రాజీనామా వ్యవహారం ప్రస్తుతానికి పెండింగ్‌లో పడింది. విజయసాయిరెడ్డి ఉదంతంతో రాజకీయాలు ఎంత జుగుప్సాకరంగా తయారవుతున్నాయో అర్థమవుతుంది. ఆయన రాజకీయ సన్యాసం వల్ల వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగులుతుంది.


అవినీతి చేయడంలో కవలలుగా సాగిన జగన్‌రెడ్డి–విజయసాయిరెడ్డిని విడదీసి చూడలేం కనుక ఇప్పుడు విజయసాయి ఏకంగా వైసీపీకి రాజీనామా చేయడంతో ఆ పార్టీ శ్రేణుల ఆత్మస్థైర్యం కచ్చితంగా దెబ్బతింటుంది. జగన్‌రెడ్డి లండన్‌ పర్యటనలో ఉన్నప్పుడు విజయసాయి ఈ ప్రకటన చేయడం రాజకీయాల్లో అనైతికతకు నిదర్శనం. విషయం తెలుసుకున్న జగన్‌రెడ్డి రాజీనామా చేయవద్దని విజయసాయిపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆ ఒత్తిడి తట్టుకోలేకపోయిన ఆయన ఎక్స్‌ వేదికగా శుక్రవారంనాడే తన రాజకీయ సన్యాసం గురించి ప్రకటించారు. నిజానికి శనివారంనాడు రాజ్యసభ చైర్మన్‌ను వ్యక్తిగతంగా కలసి రాజీనామా లేఖ అందజేసే వరకు ఆ విషయాన్ని రహస్యంగా ఉంచాలనుకున్నారు. ఈ పరిణామాన్ని జగన్‌ అనుకూల శక్తులు కనీసం ఊహించలేదు. ఈ కారణంగానే జగన్‌కు అనుకూలంగా సోషల్‌ మీడియాలో వీడియోలు పెట్టే పేటీఎం బ్యాచ్‌ విజయసాయిరెడ్డి ప్రకటన తర్వాత వెంటనే స్పందించలేదు. జగన్‌రెడ్డి నుంచి ఆదేశాల కోసం ఎదురుచూశారేమో తెలియదు. విజయసాయిరెడ్డి వంటి వాళ్లు ఇలా చేస్తే జగన్‌రెడ్డితో ఇంకా ఎవరు మిగులుతారు అన్న ప్రశ్న ఈ సందర్భంగా తలెత్తుతోంది. ఆర్థిక నేరగాడిగా జగన్‌కు ఎంత పేరుందో విజయసాయికి కూడా అంతే పేరుంది. జగన్‌పై ఉన్న కేసులు విచారణకు వచ్చి రుజువైతే విజయసాయికి కూడా శిక్ష పడుతుంది. ఆ పరిస్థితి నుంచి ఉపశమనం పొందాలంటే తాను అప్రూవర్‌గా మారడం ఒక్కటే విజయసాయిరెడ్డి ముందున్న ప్రత్యామ్నాయం. అప్రూవర్‌గా మారితే తన ప్రాణాలకే ముప్పని ఆయనకు తెలుసు.


అందుకే అప్రూవర్‌గా మారి, బీజేపీలో చేరిపోయి ఎంపీగా కొనసాగలేని పరిస్థితి ఆయనకు ఏర్పడింది. బహుశా ఈ కారణంగానే రాజకీయ సన్యాసం చేయాలని భావించి ఉంటారు. సీబీఐ, ఈడీ కేసుల విషయం అటుంచితే మద్యం, ఇసుక వగైరా వ్యవహారాల్లో రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేసిన కేసులు కూడా తరుముకొస్తున్నాయి. ఈ కేసుల నుంచి రక్షణ పొందడానికి ఆయన అప్రూవర్‌గా మారతారేమో తెలియదు. జగన్‌కు సంబంధించిన కేసులలో విజయసాయిరెడ్డి వంటి వాళ్లు కూడా అప్రూవర్‌గా మారే ఆలోచన చేశారంటే రాజకీయాలలో ఎవరినీ పూర్తిగా నమ్మకూడదని మరోసారి రుజువైంది. బహుశా ఈ కారణంగానే కాబోలు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎవరినీ పూర్తిగా నమ్మరు. ఈ మొత్తం ఉదంతంలో ప్రాంతీయ పార్టీలు, ముఖ్యంగా వైసీపీ, తెలుగుదేశం పార్టీలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. పార్టీ టికెట్ల కేటాయింపు, రాజ్యసభకు అభ్యర్థుల ఎంపికలో డబ్బుకు ప్రాధాన్యం ఇవ్వకుండా విధేయతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తిస్తే మంచిది. తమిళనాడులో డీఎంకే పార్టీ టికెట్లు అమ్ముకోదు. అందుకే ఆ పార్టీ ఎంపీలు, నాయకులు తాము అధికారంలో ఉన్నా లేకపోయినా ఫిరాయింపులకు పాల్పడరు. తెలుగునాట ఈ పరిస్థితి లేదు. జగన్‌రెడ్డి రాజకీయాలలోకి రాకముందు కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోగానే పార్టీ ఫిరాయించడాన్ని చూశాం. ఇప్పుడు జగన్‌రెడ్డి పార్టీ కూడా ఈ సరసన చేరింది. రాజకీయ సన్యాసం ప్రకటించిన తర్వాత కూడా ఇటు విజయసాయికి కానీ, అటు జగన్‌రెడ్డికి కానీ సానుభూతి లభించే పరిస్థితి లేదు. అధికారాన్ని గరిష్ఠ స్థాయిలో దుర్వినియోగం చేయడమే ఇందుకు కారణం. జగన్‌రెడ్డి ముందు కుర్చీలో కూర్చోవడానికి కూడా సాహసించని విజయసాయి వంటి వాళ్లు ఇప్పుడు అదే జగన్‌రెడ్డి ప్రాధేయపడినా రాజీనామా నిర్ణయం వెనక్కు తీసుకోవడానికి నిరాకరించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? జగన్‌రెడ్డికి కూడా ఇదో గుణపాఠం. అధికారాన్ని ఉపయోగించి ఎంత డబ్బు పోగేసుకున్నా మనశ్శాంతి లేనప్పుడు ఏమి ప్రయోజనం? తన ఆర్థిక నేరాల్లో భాగస్వామి అయిన విజయసాయిరెడ్డి ఇప్పుడు దూరం అవుతున్నారు. రక్తం పంచుకు పుట్టిన చెల్లి షర్మిల ఎప్పుడో దూరమైంది. రాజకీయ అధికారం ఎంత ప్రమాదకరమైనదో కదా! డబ్బు–అధికారాన్ని పంచుకోవడానికి సిద్ధపడకపోతే రక్తం పంచుకు పుట్టిన వాళ్లు కూడా శత్రువులుగా మారతారని జగన్‌రెడ్డి ఇప్పటికీ గ్రహించకపోతే అంతకంటే విషాదం ఉండదు. అధికారం ఉన్నప్పుడు అందరూ ఆప్తులుగానే కనిపిస్తారు. అధికారం–డబ్బు లేకపోతే ఒంటరివారుగా మిగిలిపోతారు.


సవాలుకు కట్టుబడకుండానే..

ఈ విషయం అలా ఉంచితే నా విషయంలో తన సవాలుకు కట్టుబడకుండానే విజయసాయిరెడ్డి అస్త్రసన్యాసం చేయడం నాకు అస్సలు నచ్చలేదు. కొంత కాలం క్రితం నాపై అవాకులూ చెవాకులూ పేలి వాంతులు చేసుకున్న విజయసాయిరెడ్డి బహిరంగ చర్చకు రావాలని నన్ను సవాలు చేశారు. నువ్వు అంతగా ముచ్చటపడితే ఎందుకు కాదంటానులే అని అందుకు సరే అన్నాను. దీనికి బదులుగా వేదిక ఢిల్లీలో ఉండాలని, అది కూడా ఫలానా ఫలానా వారి సమక్షంలో అని ఆయన షరతులు పెట్టగా అందుకు కూడా సరే అన్నాను. అయినా అటువైపు నుంచి సౌండు లేదు. ఇప్పుడేమో రాజకీయ సన్యాసం అని అంటున్నారు. ఇప్పటికైనా తాను నోరు పారేసుకున్నందుకు ఆయన క్షమాపణలు చెబుతారేమో చూద్దాం. అయినా విజయసాయిరెడ్డి వంటి వారి నుంచి విలువలను ఆశించడం అత్యాశే అవుతుంది. కాకతాళీయమే అయినా ఒకప్పటి సినిమా హీరోయిన్‌, డ్రగ్స్‌ కేసులలో అభియోగాలు ఎదుర్కొన్న మమతా కులకర్ణి శుక్రవారంనాడే సన్యాసినిగా మారిపోయారు. విజయసాయిరెడ్డి కూడా అదే రోజు తన రాజకీయ సన్యాసం నిర్ణయాన్ని ప్రకటించారు. మమతా కులకర్ణి విషయం పక్కన పెడితే విజయసాయిరెడ్డి ఇప్పటికైనా ఒక మనిషిగా పరివర్తన చెంది చేసిన పాపాలు కడుక్కొనే ప్రయత్నం చేస్తే ఆయన అస్త్రసన్యాసానికి అర్థం పరమార్థం ఉంటుంది. లేనిపక్షంలో ఆయనలో గుంట నక్క లక్షణాలు ఉన్నట్టుగానే భావించాల్సి ఉంటుంది!

ఆర్కే


ఇవి కూడా చదవండి..

Manish Sisodia: సీఎం చేస్తామంటూ బీజేపీ ఆఫర్: సిసోడియా

Explosion.. మహారాష్ట్రలో భారీ పేలుడు: ఐదుగురి మృతి..

Governor: అత్యాచారాలకు పాల్పడితే ఉరిశిక్షే..

Read More National News and Latest Telugu News

Updated Date - Jan 26 , 2025 | 12:28 AM