Share News

వికటించిన వీధి నాటకం!

ABN , Publish Date - Feb 23 , 2025 | 02:39 AM

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కూటమి ప్రభుత్వంపై దాడిని ఉధృతం చేస్తున్నారు. ఎనిమిది నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో ఎదురైన అనూహ్య పరాజయం నుంచి కోలుకున్న ఆయన తనదైన శైలిలో...

వికటించిన వీధి నాటకం!

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కూటమి ప్రభుత్వంపై దాడిని ఉధృతం చేస్తున్నారు. ఎనిమిది నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో ఎదురైన అనూహ్య పరాజయం నుంచి కోలుకున్న ఆయన తనదైన శైలిలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన మాటలు, చేష్టలు అదుపు తప్పుతున్నాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో తాను అధికారంలోకి వచ్చేసినట్టేనని అతి విశ్వాసంతో ఉండిన ఆయన ఓడిపోయారు. దీంతో జగన్‌రెడ్డి పనైపోయిందని భావించిన చంద్రబాబు నాయుడు ఆయనను పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ప్రశాంత్‌ కిశోర్‌ మార్గదర్శకత్వంలో జగన్‌రెడ్డి అప్పటి చంద్రబాబు ప్రభుత్వంపై విష ప్రచారం చేశారు. వంచనతో కూడిన రాజకీయాలతో ప్రభుత్వంపై వ్యతిరేకతను ప్రజల్లో పెంచగలిగారు. ఫలితంగా 2019 ఎన్నికల్లో 151 సీట్లు సాధించి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. దీంతో చంద్రబాబు కథ అయిపోయిందని భావించిన జగన్‌రెడ్డి తనదైన శైలిలో కక్ష రాజకీయాలకు తెర లేపారు. తన సన్నిహితులు వారించినా వినకుండా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబును అరెస్టు చేయించి జైల్లో పెట్టారు. అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీతో సత్సంబంధాలు ఉండటంతో జగన్‌రెడ్డి ఆడింది ఆట పాడింది పాటగా సాగింది. 2024 ఎన్నికల నాటికి పరిస్థితులు మారిపోయాయి. 2014 ఎన్నికల సందర్భంగా బీజేపీతో కలిసి పోటీ చేసినా, ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నప్పటికీ ప్రధాని మోదీకి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు మధ్య సత్సంబంధాలు ఉండేవి కావు. ఈ క్రమంలో చంద్రబాబు భారతీయ జనతా పార్టీకి దూరమయ్యారు. బీజేపీతో నేరుగా పొత్తు లేకపోయినా ఐదేళ్ల పాటు కేంద్రంలో ప్రభుత్వానికి జగన్‌రెడ్డి పూర్తి మద్దతు ప్రకటించారు. కేంద్రం కూడా జగన్‌రెడ్డికి అండగా నిలబడింది. 2014 ఎన్నికల్లో జాతీయ స్థాయిలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు కలిసి పోటీ చేసినా, ఆ తర్వాత వాటికి అంత ప్రాధాన్యం ఉండేది కాదు.


2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి సొంతంగా మెజారిటీ లభించడంతో ప్రధాని నరేంద్ర మోదీ సర్వం తానై వెలుగొందారు. 2024 నాటికి పరిస్థితులు తలకిందులయ్యాయి. భారతీయ జనతా పార్టీకి సొంతంగా మెజారిటీ లభించలేదు. 2019 ఎన్నికల్లో తాను ఈసడించుకుని దూరం పెట్టిన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలని ప్రధాని మోదీ స్వయంగా నిర్ణయించుకున్నారు. మూడవసారి తన నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ మద్దతు కీలకమైంది. బిహార్‌లో నితీశ్‌కుమార్‌ నాయకత్వంలోని జేడీయూ మద్దతు కూడా అవసరం అయినప్పటికీ ఇటీవలికాలంలో నితీశ్‌ ఆరోగ్యం క్షీణించడంతో కేంద్రంలో, ముఖ్యంగా ఎన్డీయేలో చంద్రబాబుకు ప్రాధాన్యం ఏర్పడింది. చంద్రబాబు కూడా 2019 నాటి అనుభవంతో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షాలతో సత్సంబంధాలతో ముందుకు వెళుతున్నారు. గతానికి భిన్నంగా ప్రధాని మోదీ కూడా ముఖ్యమైన సందర్భాలలో ఎన్డీయేను ప్రొజెక్ట్‌ చేయడం మొదలుపెట్టారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన హరియాణా, మహారాష్ట్ర, ఢిల్లీ ముఖ్యమంత్రుల ప్రమాణస్వీకారోత్సవాలకు ఎన్డీయే నేతలను ప్రత్యేకంగా ఆహ్వానించారు. జాతీయ స్థాయిలో ఎన్డీయేకు పోటీగా రూపుదిద్దుకున్న ఇండియా కూటమి ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఇండియా కూటమిలో బలంగా కనిపించిన కేజ్రీవాల్‌ ఢిల్లీ ఎన్నికల్లో ఓటమిపాలవడంతో భారతీయ జనతా పార్టీని ఇప్పుడు ఢీకొనగల నాయకులు జాతీయ స్థాయిలో కొరవడ్డారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ తమ రాష్ర్టాలలో బలంగా ఉన్నప్పటికీ జాతీయ స్థాయిలో ప్రభావం చూపగల నాయకులు కాదు. ఈ క్రమంలో ప్రధాని తదుపరి టార్గెట్‌ మమతా బెనర్జీ కావొచ్చు. గతంలో భారతీయ జనతా పార్టీని మాత్రమే బలోపేతం చేయడానికి ప్రయత్నించిన ప్రధాని మోదీ ఇప్పుడు ఎన్డీయేను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో చంద్రబాబుకు మరింతగా ప్రాధాన్యం ఇస్తున్నారు. కేంద్రంలో తనకు పెరిగిన పరపతితో రాష్ర్టాన్ని గాడిన పెట్టడానికి చంద్రబాబు ప్రయత్నాలు మొదలెట్టారు. ఫలితంగా కేంద్రం నుంచి వివిధ పథకాలకు భారీగా ఆర్థిక సహకారం అందుతోంది. ప్రతిపాదిత పథకాలన్నీ కార్యరూపం దాల్చితే రాష్ట్రంలో అభివృద్ధి పుంజుకుంటుంది. లక్ష కోట్లకు పైగా నిధులు అందుబాటులోకి వస్తాయి.


మా సీఎం వేరే...!

జాతీయ స్థాయి పరిణామాలను, కేంద్రంలో పెరిగిన చంద్రబాబు ప్రాధాన్యాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కూటమి ప్రభుత్వంపై జగన్‌రెడ్డి దాడిని ఉధృతం చేశారు. ఈ క్రమంలో ఆయన ఎంచుకున్న రెండు కార్యక్రమాలూ బెడిసికొట్టాయి. ఒక కేసులో అరెస్టయిన వల్లభనేని వంశీని జైల్లో పరామర్శించిన జగన్‌రెడ్డి పోలీసులపై విరుచుకుపడ్డారు. వంశీని అరెస్టు చేసి జైల్లో పెట్టిన అధికారులు పదవీ విరమణ చేసినా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత దుస్తులు ఊడదీసి నిలబెడతానని హెచ్చరించారు. దీనిపై పోలీసు అధికారుల సంఘం ఘాటుగా స్పందించింది. అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగిన నందిగం సురేశ్‌, వల్లభనేని వంశీ వంటి వారిని పరామర్శించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకోవడమే జగన్‌రెడ్డి చేసిన తప్పు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని దారుణంగా అవమానించిన వల్లభనేని వంశీపై ఇంకెప్పుడు చర్యలు తీసుకుంటారు? అని కూటమి ప్రభుత్వంపై మరోవైపు ఒత్తిడి పెరిగింది. చంద్రబాబు మెతక వైఖరి ప్రదర్శిస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోషల్‌ మీడియాలో ఏకంగా పోస్టులే పెట్టారు. అయితే కార్యకర్తల వలె ఆవేశపడ కుండా చంద్రబాబు సమయం, సందర్భం కోసం వేచి చూశారు. కిడ్నాప్‌ కేసులో వంశీ చిక్కుకోగానే అరెస్టు చేయించారు. అధికారంలో ఉన్నప్పుడు గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై వైసీపీ దాడి సందర్భంగా ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్‌ అనే వ్యక్తిని బెదిరించి ఫిర్యాదును ఉపసంహరింపజేయించిన వల్లభనేని వంశీ మొత్తంమీద చంద్రబాబు విసిరిన వలలో చిక్కుకున్నారు. ఈ క్రమంలో జైలులో ఉన్న వంశీని జగన్‌రెడ్డి పరామర్శించారు. వంశీపై తప్పుడు కేసు పెట్టి అన్యాయంగా అరెస్టు చేశారని జగన్‌రెడ్డి విమర్శించిన కొద్దిసేపటికే హైదరాబాద్‌లోని మై హోం బూజా అపార్ట్‌మెంట్‌లోని లిఫ్టులో సత్యవర్ధన్‌ను వెంటబెట్టుకొని వంశీ తీసుకువెళ్లిన వీడియో ఫుటేజ్‌ను మంత్రి కొల్లు రవీంద్ర మీడియాకు విడుదల చేశారు. దీంతో వంశీని అన్యాయంగా అరెస్టు చేశారన్న జగన్‌ ఆరోపణలకు విలువ లేకుండా పోయింది. 2014–2019 మధ్య కాలంలో జగన్‌రెడ్డి ఇలాంటి విన్యాసాలు చేసినప్పుడు అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు అండ్‌ కో కౌంటర్‌ ఎటాక్‌ చేయలేదు. దీంతో ఇప్పుడు జగన్‌రెడ్డి తనకు మాత్రమే సొంతమైన వంచన రాజకీయాలకు మళ్లీ శ్రీకారం చుట్టారు. అయితే జగన్‌రెడ్డికి గ్రహబలం ఈసారి అనుకూలంగా ఉన్నట్టు లేదు. విజయవాడ నడి వీధుల్లో జగన్‌రెడ్డి రక్తి కట్టించాలనుకున్న సన్నివేశాలు వికటించాయి. ఎన్నికలకు ముందు ‘మా ఓటర్లు వేరే ఉన్నారు’ అని సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారు అనేవారు. ఇప్పుడు జగన్‌రెడ్డి మద్దతుదారులు కూడా ‘మా ముఖ్యమంత్రి వేరే ఉంటారు’ అని భావిస్తున్నట్టుగా ఉన్నారు. సాధారణ ఎన్నికలకు కొంచెం ముందు ప్రతిపక్షంలో ఉన్న నాయకుడిని ఉద్దేశించి ‘సీఎం సీఎం’ అని నినాదాలు చేస్తే అర్థం చేసుకోవచ్చు కానీ ఎన్నికలు జరిగిన ఎనిమిది నెలలకే, అది కూడా 11 సీట్లు మాత్రమే గెలుచుకున్న ఒక వ్యక్తిని ఉద్దేశించి ‘సీఎం సీఎం’ అని నినదించడం, అలా నినాదాలు చేసిన, చేయించుకున్న వారి మనోవికారాలకు అద్దంపడుతుంది. ఇలాంటి నినాదాలు జగన్‌రెడ్డికి ఆనందాన్ని ఇస్తూండవచ్చు గానీ, వినేవారికి ఎబ్బెట్టుగా ఉంటాయి. ఇలాంటి లేకి పోకడలు పోయిన వారిని వారించి ఉంటే గత ఎన్నికల్లో జగన్‌రెడ్డికి ఇంతటి పరాభవం జరిగి ఉండేది కాదు. చంద్రబాబు, లోకేశ్‌ కంటే అందంగా ఉంటారు కనుక కొడాలి నాని, దేవినేని అవినాశ్‌ను కూడా త్వరలో అరెస్టు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని జగన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా రోతగా ఉన్నాయి. నీకంటే చంద్రబాబు అందంగా ఉంటారని అప్పట్లో ఆయనను అరెస్టు చేయించావా? అని ఎవరైనా ప్రశ్నిస్తే జగన్‌రెడ్డి ఏం సమాధానం చెబుతారు? తాను సెటైర్లు వేశానని జగన్‌రెడ్డి అనుకొని ఉండవచ్చు గానీ ఆయన వ్యాఖ్యలు విన్నవారికి కంపరం కలిగించాయి. ఈ సందర్భంగానే జగన్‌ అండ్‌ కో ప్రదర్శించిన మరో సన్నివేశం కూడా వికటించింది. 8వ తరగతి చదువుతున్న ఒక చిన్న పిల్లను తీసుకొచ్చి ‘జగన్‌ మామయ్యా నాకు అమ్మ ఒడి రావడం లేదు’ అని విలపింపజేశారు. 2014–19 మధ్య కాలంలో ఇలాంటి నాటకాలకే తెర లేపిన జగన్‌ అండ్‌ కో ఇప్పుడు అవే నాటకాలను ప్రదర్శించడం మొదలుపెట్టారు. అప్పట్లో ఇలాంటి నాటకాలను పట్టించుకోని తెలుగుదేశం పార్టీ గానీ, వారి సోషల్‌ మీడియా గానీ ఇప్పుడు దీటుగా స్పందించి ఆ పాప పూర్వాపరాలను బయటపెట్టింది. జగన్‌రెడ్డిని హత్తుకుని విలపించిన ఆ పాప తండ్రి, మేనమామ కరుడుగట్టిన వైసీపీ అభిమానులు. అమ్మ ఒడి రావడం లేదని ఆ పిల్ల ఏడుస్తూ చెబుతున్నప్పుడు తండ్రి, మేనమామ నవ్వడం కనిపించింది. అమ్మ ఒడి రానందున ఆ పిల్ల చదువు నిజంగా ఆగిపోయే పరిస్థితే ఉంటే వారలా నవ్వుకోరు కదా? నిజానికి జగన్‌రెడ్డి కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే అమ్మ ఒడి అమలు చేయలేదు. 2020 నుంచే అమలు చేశారు. ఇప్పుడు చంద్రబాబు కూడా ‘తల్లికి వందనం’ పథకాన్ని ఈ ఏడాది జూన్‌ నుంచి అమలు చేస్తామని ప్రకటించారు. మొత్తంమీద విజయవాడ నడివీధుల్లో జగన్‌ అండ్‌ కో ప్రదర్శించిన వీధి నాటకం వికటించింది. జగన్‌రెడ్డి వద్ద విలపించిన ఆ పాప చదువు నిజంగానే ఆగిపోయే పరిస్థితి ఉంటే ఆ పిల్ల చదువు ఖర్చులకు జగన్‌రెడ్డి ఎందుకు సహాయం చేయలేదు? ఆ మాత్రం స్తోమత జగన్‌రెడ్డికి లేదా? లేక ఆయనలో మానవత్వం అనేది మచ్చుకైనా లేదా? స్ర్కీన్‌ప్లే, డైరెక్షన్‌లో ఎక్కడో లోపం జరిగింది. స్ర్కీన్‌ప్లే పకడ్బందీగా రూపొందించి ఉంటే పక్కన ఉన్న వారి జేబులోంచి డబ్బు తీసి జగన్‌రెడ్డి సదరు పిల్లకు ఇచ్చి ఉండేవారు. చంద్రబాబు మోసం చేశారనే అనుకుందాం. కరుణామయుడు, పేదల పెన్నిధిగా చెప్పుకొనే జగన్‌రెడ్డి ఆ పిల్ల చదువు కోసం 15 వేలు ఇవ్వలేరా? అయినా పుచ్చుకోవడం తప్ప ఇవ్వడం తెలియని జగన్‌కు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి? 2014–19 మధ్య కాలంలో ప్రదర్శించిన వంచనతో కూడిన వీధి నాటకాలనే మళ్లీ ప్రదర్శించాలని జగన్‌ అండ్‌ కో అనుకోవడమే ఇప్పుడు చేస్తున్న తప్పు. వల్లభనేని వంశీపై మెజారిటీ ప్రజల్లో సదభిప్రాయం లేదు. అలాంటి వంశీ కోసం జగన్‌ అండ్‌ కో వీధి నాటకాలకు తెర తీయడం రెండో పొరపాటు. నిజానికి జగన్‌ వెంట ఇప్పుడు కనిపిస్తున్న వారి పట్ల ప్రజలకు సదభిప్రాయం లేదు. అధికారంలో ఉన్నప్పుడు వారు ప్రవర్తించిన తీరును ప్రజలు ఇంకా మరచిపోలేదు. అధికార మదంతో విర్రవీగిన వారిని వెంటబెట్టుకొని తిరగడం వల్ల జగన్‌రెడ్డికి నష్టమే గానీ లాభం ఉండదు.


‘ఘాటు’ కౌంటర్‌!

ఇక గుంటూరు మిర్చియార్డు సందర్శనకు జగన్‌రెడ్డి మందీ మార్బలంతో వెళ్లి హడావిడి చేశారు. తన హయాంలో మిర్చి రైతులకు గిట్టుబాటు ధర లభించి ఆనందంగా ఉండేవారని, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో మిర్చి రైతులను పట్టించుకోవడం లేదని జగన్‌రెడ్డి తనదైన శైలిలో విమర్శలు చేశారు. ఈ విమర్శలు చేసి ఆయన తాడేపల్లి ప్యాలెస్‌కు చేరుకునే లోగానే జగన్‌రెడ్డి హయాంలో మిర్చి పంటకు క్వింటాల్‌కు 7,000 రూపాయలను మాత్రమే ధరగా నిర్ణయిస్తూ అప్పటి ప్రభుత్వం జారీ చేసిన జీవోను అధికార పక్షం బయటపెట్టింది. దీంతో జగన్‌ అండ్‌ కోకు మాట పడిపోయింది. అదే సమయంలో చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి మిర్చి రైతులను ఆదుకోవలసిందిగా కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిని కోరారు. చంద్రబాబు నుంచి విజ్ఞప్తి అందిన వెంటనే కేంద్రమంత్రి మరుసటి రోజే అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యపై చర్చించారు. నిజానికి ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు.. తెలంగాణలో కూడా, ఆ మాటకొస్తే దేశవ్యాప్తంగా ఈ ఏడాది మిర్చి పంటకు ధర పడిపోయింది. పత్తి, మిర్చి వంటి పంటలకు కొన్ని సందర్భాలలో అధిక ధర పలకడం, మరికొన్ని సందర్భాలలో ధరలు పడిపోవడం పరిపాటే. ఎన్నికల నియమావళి కారణంగా మిర్చి యార్డు సందర్శనకు అధికారులు అనుమతులు నిరాకరించినా జగన్‌ అండ్‌ కో లెక్కలేనితనంతో వ్యవహరించారు. దీంతో ఎన్నికల కమిషన్‌ అధికారులు జగన్‌ అండ్‌ కోపై కేసు పెట్టారు. ఇదే పని జగన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు చేసి ఉంటే అరెస్టు చేసి ఉండేవారు. లేదా చంద్రబాబు ఇల్లు దాటకుండా గేటుకు తాళం వేయించి ఉండేవారు. ఇప్పుడు చంద్రబాబు తన చేతికి మట్టి అంటకుండా కాగల కార్యం ఎన్నికల కమిషన్‌ అధికారులతో చేయించారు. అనుభవానికి, అనుభవ లేమికి ఉన్న తేడా ఇది. మొత్తంమీద కూటమి ప్రభుత్వంపై దండయాత్రకు జగన్‌రెడ్డి అండ్‌ కో చేసిన రెండు కార్యక్రమాలూ వికటించాయి. కేంద్రం వద్ద తనకు ఉన్న పలుకుబడిని స్వప్రయోజనాల కోసం కాకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల కోసం ఉపయోగించడంలో చంద్రబాబుకు ట్రాక్‌ రికార్డు ఉంది. 1999–2004 మధ్య ఉమ్మడి రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొనడంతో అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న వాజపేయి ప్రభుత్వంలో తనకు ఉన్న పలుకుబడిని ఉపయోగించి పనికి ఆహారం పథకం కింద భారీగా బియ్యం కేటాయించేలా కృషి చేశారు. ఇప్పుడు కూడా ఆ దిశగానే కృషి చేస్తున్నారు. విశాఖ ఉక్కుకు ప్రైవేటు ముప్పు తప్పించగలిగారు. పోలవరం, రాజధానికి నిధులు సాధించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఇప్పుడు జగన్‌రెడ్డి అవసరం లేదు. ఎన్డీయే బలపడటం ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యం. ఈ మార్పును అర్థం చేసుకోకుండా జగన్‌రెడ్డి గతంలో వలె కాలం చెల్లిన ట్రిక్కులు ప్రదర్శిస్తే వాటిని తనకు అనుకూలంగా మలచుకోకుండా చంద్రబాబు ఉంటారా? చుట్టూ ఉన్మాద మూకను పోగేసుకొని ప్రభుత్వంపై దండయాత్రకు జగన్‌రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండదు. నిజానికి విజయవాడ, గుంటూరులో చేపట్టిన కార్యక్రమాల వల్ల జగన్‌ అండ్‌ కో పరోక్షంగా తెలుగుదేశం పార్టీకి మేలే చేశారు. జగన్‌రెడ్డి కార్యక్రమాల ముందు వరకు తెలుగు తమ్ముళ్లు సోషల్‌ మీడియాలో చంద్రబాబు ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తంచేస్తూ వచ్చారు. తమ అంచనాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయడం లేదని విమర్శలు మొదలుపెట్టారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడంలో బిజీగా ఉండేవారు. ఈ పరిణామం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇబ్బందిగా మారింది. కార్యకర్తలు కోరుకుంటున్నట్టుగా రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడలేక, అదే సమయంలో అదుపు తప్పుతున్న తెలుగు తమ్ముళ్లను శాంతింపజేయలేక సతమతమయ్యారు. ఈ నేపథ్యంలో జగన్‌ అండ్‌ కో ప్రదర్శించిన వీధి నాటకాలు తెలుగు తమ్ముళ్లను మళ్లీ సంఘటితం చేశాయి. సోషల్‌ మీడియాలో ప్రభుత్వంపై విమర్శలకు స్వస్తి చెప్పి జగన్‌ అండ్‌ కో ప్రదర్శించిన వీధి నాటకాల్లోని డొల్లతనాన్ని బయటపెట్టారు. దీంతో తెలుగుదేశం పార్టీకి మంచే జరిగింది.


వైఎస్‌ అలా.. జగన్‌ ఇలా!

2004కు ముందు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఒక హత్య కేసులో జైల్లో ఉన్న గౌరు వెంకటరెడ్డిని పరామర్శించి రాజకీయాల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. అప్పట్లో ఆయన చర్యకు మద్దతు లభించింది. తనను నమ్ముకున్న వారి కోసం రాజశేఖరరెడ్డి ఎంత దూరమైనా వెళతారన్న పేరు వచ్చింది. ఇప్పుడు జగన్‌రెడ్డి తండ్రి బాటలోనే పయనించే ప్రయత్నం చేయాలనుకుంటున్నట్టుగా ఉంది. అయితే పరామర్శకు ఆయన ఎంచుకున్న మనుషుల గతాన్ని ప్రజలు మరిచిపోకపోవడం వల్ల సదరు ప్రయత్నాలు వికటిస్తున్నాయి. ఎంపీగా ఉన్నప్పుడు నందిగం సురేశ్‌ రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు వ్యతిరేకంగా అరాచకంగా ప్రవర్తించారు. అధికార మదంతో విర్రవీగారు. వల్లభనేని వంశీ విషయం కూడా అందరికీ తెలిసిందే. నోటికి హద్దూ పద్దూ లేకుండా చంద్రబాబు కుటుంబంపై అవాకులు చవాకులు పేలారు. మహిళలను అవమానించారు. తమకు జరిగిన అవమానాలను చంద్రబాబు గానీ, లోకేశ్‌ గానీ ఎలా మరిచిపోతారు? అందుకే సమయం, సందర్భం కోసం వేచి చూశారు. వంశీ వంటి వారు ఇంకా కొంత మంది ఉన్నారు. వారి వంతు రావడానికి ఇంకొంత సమయం పట్టవచ్చు. ఇప్పుడు జగన్‌ చుట్టూ కనిపిస్తున్న కొడాలి నాని, పేర్ని నాని, దేవినేని అవినాశ్‌, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి వంటి వారు ఈ జాబితాలో ఉంటారని అంటున్నారు. ఇలాంటి వారిని అరెస్టు చేసినప్పుడు వారి పరామర్శకు జగన్‌రెడ్డి పొలోమని వెళ్లినా ప్రయోజనం ఉండకపోవచ్చు. అధికారంలో ఉన్నప్పుడు వివాదరహితులుగా ఉన్న వారిని ప్రభుత్వం వేధిస్తే, వారి కోసం జగన్‌రెడ్డి తపన పడితే అర్థం ఉంటుంది గానీ ప్రజల్లో సదభిప్రాయం లేనివారి కోసం గొంతు చించుకున్నా ప్రయోజనం ఉండదు. కూటమిలో చీలిక ఏర్పడకపోదా?, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ మధ్య విభేదాలు ఏర్పడి విడిపోకుండా ఉంటారా? అని జగన్‌ అండ్‌ కో ఆశగా ఎదురుచూస్తున్నారు గానీ వారి ఆశలు నెరవేరే అవకాశాలు కూడా కనిపించడం లేదు. కేంద్రంలో ఎన్డీయే బలంగా ఉండాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నందున కూటమిలో విభేదాలు ఏర్పడకుండా ఆయన పెద్దన్న పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నారు. కూటమిలో చీలిక కోసం ఆశతో ఎదురుచూసే బదులు తనకు నమ్మిన బంటుగా బతికిన విజయసాయిరెడ్డి వంటి వారు ఇప్పుడు తనను వదిలి ఎందుకు వెళ్లిపోతున్నారో తెలుసుకొనే ప్రయత్నం చేయడం జగన్‌రెడ్డికి మంచిది. వంచనతో కూడిన రాజకీయాలు అన్ని వేళలా పనిచేయవు. జగన్‌రెడ్డి ఎటువంటివారో, ఆయన పాలన ఎలా ఉంటుందో ప్రజలు తెలుసుకున్నారు. ప్రస్తుతానికి చంద్రబాబుకు గ్రహాలు అనుకూలంగా ఉన్నట్టున్నాయి. అందుకే కేంద్రంలో ఆయనకు పరపతి పెరుగుతోంది. బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ ఆరోగ్యం క్షీణించడం, మహారాష్ట్రలో కూటమిలో విభేదాలు ఏర్పడటంతో ఎన్డీయేలో చంద్రబాబు ప్రాధాన్యం మరింత పెరుగుతోంది. ఈ పరిస్థితిని ఆయన రాష్ర్టాభివృద్ధి కోసం ఉపయోగించాలని కోరుకుందాం. పరిస్థితులు అనుకూలించే వరకు వేచి ఉండకుండా తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్టుగా జగన్‌రెడ్డి వ్యవహరించడం, ఆందోళనలకు పిలుపునివ్వడం ఆయనకు మంచిది కాదని ఎవరు చెప్పాలి?

ఆర్కే


2-Untitled-1.jpg

యూట్యూబ్‌లో

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి


ఈ వార్తలు కూడా చదవండి...

AP Capital: అమరావతి పనుల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్

తెలంగాణలో ఉద్యోగాలే ఉద్యోగాలు.. నోటిఫికేషన్ ఎప్పుడంటే

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 23 , 2025 | 02:51 AM