Share News

నేతలు... నేల విడిచి సాములు!

ABN , Publish Date - Feb 16 , 2025 | 05:57 AM

‘ప్రజలు అత్యాశకు పోయి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని తెచ్చుకొని ఇప్పుడు గోసపడుతున్నారు’... అని తెలంగాణ మాజీ మఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల వ్యాఖ్యానించారు.

నేతలు... నేల విడిచి సాములు!

ప్రజలు అత్యాశకు పోయి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని తెచ్చుకొని ఇప్పుడు గోసపడుతున్నారు’... అని తెలంగాణ మాజీ మఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలందరూ తన పాలనకోసం చూస్తున్నారని కూడా ఆయన చెప్పుకొన్నారు. ‘బటన్లు నొక్కడం ద్వారా ప్రజలకు డబ్బు పంచాను. అయినా నన్ను ఎందుకు ఓడించారో అర్థం కావడంలేదు. ఈవీఎంల ద్వారా ఏదో గోల్‌మాల్‌ చేసి ఉంటారు’ అని ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల ఫలితాల అనంతరం ఎనిమిది నెలల క్రితం వ్యాఖ్యానించారు. ‘‘ప్రజలకు ఏం తక్కువ చేశాను. అయినా మరీ 23 సీట్లు ఇవ్వడం ఏమిటి? ఈవీఎంలను మేనేజ్‌ చేసి ఉంటారు’’ అని ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2019లో ఓటమి అనంతరం వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను బట్టి అధికారంలో ఉన్నప్పుడు తాము ఏ తప్పూ చేయలేదని, ప్రజలే తమను ఓడించి తప్పు చేశారని ప్రాంతీయ పార్టీలకు నాయకత్వం వహిస్తున్న ఈ ముగ్గురు నాయకులూ అభిప్రాయపడ్డారని అర్థమవుతోంది. ఇది కచ్చితంగా ఆత్మవంచనే అవుతుంది. ప్రభుత్వాలు మారాయంటే అందుకు కారణం ఉండకుండా ఉండదు. అధికారంలోకి వచ్చినవారు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల అధినేతలు తమ చుట్టూ ఇనుప తెరలను ఏర్పాటు చేసుకొని ప్రజల మనోభావాలను తెలుసుకొనే ప్రయత్నం చేయరు. ఎవరెవరితోనో సర్వేలు చేయించుకొని అంతా బాగుందని తమను తాము మోసం చేసుకుంటుంటారు. ఎన్నికల ఫలితాల తర్వాత ప్రజలే తప్పు చేశారు అన్నట్టుగా వ్యాఖ్యానించడం పరిపాటిగా మారుతోంది. ఎన్నికల్లో ఓటమికి కారణాలేమిటో తెలుసుకొనే ప్రయత్నం ఎందుకు చేయరో తెలియదు. కారణాలు తెలిసినా వాటిని అంగీకరించడానికి సిద్ధపడకపోవడం వింతగానూ ఉంటుంది.


‘వ్యూహాత్మక’ తప్పిదాలు

2019లో చంద్రబాబు ఓడిపోవడానికి కానీ... ఆ తర్వాత కేసీఆర్‌, జగన్మోహన్‌రెడ్డి ఓటమికిగానీ స్పష్టమైన కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ప్రజలకు తెలుసు. 2019కి ముందు అధికారంలో ఉండిన చంద్రబాబు నేల విడిచి సాము చేశారు. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని పట్టించుకోలేదు. రాజకీయాన్ని విస్మరించి ఎన్నికల మేనేజ్‌మెంట్‌లో ఘోరంగా విఫలమయ్యారు. ఈ విషయాలను తెలుగుదేశం నాయకులు అప్పట్లో బాహాటంగానే చెప్పేవారు. అయినా వాటిని అంగీకరించడానికి అప్పట్లో చంద్రబాబు సిద్ధపడలేదు. కేసీఆర్‌ విషయంలో కూడా ఓటమికి కారణాలు స్పష్టంగా ఉన్నాయి. అధికారం మత్తు తలకెక్కి ఆయన ప్రజలకు దూరమయ్యారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్న ఎమ్మెల్యేలను సైతం మార్చకుండా ఎన్నికల్లో వారికే మళ్లీ టికెట్లు ఇచ్చారు. కేసీఆర్‌ అండ్‌ కోకు అహం తలకెక్కిందనే అభిప్రాయానికి ప్రజలు వచ్చారు. ఫలితంగా తెలంగాణ ఉద్యమ సమయంలో నెత్తిన పెట్టుకున్న ప్రజలే ఆయనను నేలకేసి కొట్టారు. అంతేగానీ... కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలు నచ్చి, అత్యాశకు పోయి కేసీఆర్‌ను ఓడించలేదు. ఇక జగన్మోహన్‌రెడ్డి విషయం అందరికీ తెలిసిందే. బటన్లు నొక్కి డబ్బులు పంచితే చాలు– తాను ఏమి చేసినా ప్రజలు పట్టించుకోరని జగన్‌రెడ్డి భావించారు. ప్రభుత్వంలో అరాచకం ప్రబలి ప్రజలు ఉక్కపోతకు గురయ్యారు. ప్రజల బాగోగులను విస్మరించి కక్ష సాధింపులకు ప్రాధాన్యతను ఇవ్వడంతో ఎన్నికలలో ఆయనను 11 సీట్లకే ప్రజలు పరిమితం చేశారు. చంద్రబాబు మరికొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉండివుంటే జగన్‌రెడ్డికి ఐదారు సీట్లకు మించి వచ్చివుండేవి కావు. ప్రజల్లో తమ పట్ల వ్యతిరేకత ఏర్పడిన విషయాన్ని ప్రాంతీయ పార్టీల అధినేతలు ఎందుకు తెలుసుకోరో అర్థం కాదు. ఎన్నికల వ్యూహకర్తలను నియమించుకొని వందల కోట్లు తగలేసే బదులు పార్టీ కార్యకర్తల మనోభావాలు తెలుసుకొనే ప్రయత్నం చేస్తే తాము ఎక్కడ ఉన్నామో తెలిసి పోతుంది. సదరు వ్యూహకర్తలే తమను అధికారంలోకి తీసుకొస్తారని గుడ్డిగా నమ్ముతారు.


2019లో ఐ–ప్యాక్‌ను నమ్ముకున్న జగన్‌రెడ్డి 2024లో కూడా ఐ–ప్యాక్‌నే నమ్ముకొని మునిగిపోయారు. ఐ–ప్యాక్‌ వంటి సంస్థ తమకు దొరకనందున 2019లో ఓడిపోయామని భావించిన చంద్రబాబు 2024లో రాబిన్‌ శర్మ అనే ఆయనను నమ్ముకున్నారు.రాబిన్‌ శర్మ సేవలు అందించి ఉండకపోయినా కూటమి గెలిచేది. ఇక కేసీఆర్‌ ఎవరెవరితోనో సర్వేలు చేయించుకొని సంతృప్తిపడుతుండేవారు. ఆ సర్వే రిపోర్టులు చూపించి అంతా బాగుందని పార్టీ నాయకుల నోళ్లు మూయించేవారు. కర్ణాటకలో బీజేపీ అధికారం కోల్పోయి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆ రాష్ట్రంతో సంబంధం లేని వాళ్లు కూడా ముందే చెప్పారు. అయినా, సునీల్‌ కనుగోలు వ్యూహం వల్లే తాము గెలిచామని కాంగ్రెస్‌ పార్టీ నమ్మింది. అదే నమ్మకంతో తెలంగాణలో కూడా కాంగ్రెస్‌ను విజయతీరాలకు చేర్చే బాధ్యతను ఆ పార్టీ పెద్దలు ఆయనకు అప్పగించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి 50 సీట్ల వరకు రావచ్చునని ఆయన లెక్కలు వేసుకున్నారు కానీ, కాంగ్రెస్‌ పార్టీకి 70 స్థానాల వరకు లభించే అవకాశం ఉందని గుర్తించలేక పోయారు. అభ్యర్థుల ఎంపికలో తప్పులు చేసి ఉండకపోతే కాంగ్రెస్‌ పార్టీకి 70 స్థానాలు దాటి ఉండేవి. హరియాణా, మహారాష్ట్రలో ఈ సునీల్‌ కనుగోలు వ్యూహం ఎందుకు పనిచేయలేదో? ఎన్నికల వ్యూహాలు అవసరమేగానీ, అవి మాత్రమే ఎన్నికల్లో విజయాలను తెచ్చిపెట్టవు. ఎన్నికలు ఏవైనా ప్రజలు తప్పు చేయరు. నాయకులే తాము చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తారు. అయితే ఆ విషయం అంగీకరించే ధైర్యం కొరవడి ప్రజలే తప్పు చేశారని ఆత్మవంచన చేసుకుంటూ ఉంటారు.


ప్రస్తుత పాలకుల పరిస్థితి..

కేసీఆర్‌, జగన్మోహన్‌రెడ్డి ఓటమికి కారణాలు తెలిసినవే కనుక చర్విత చరణం అవసరం లేదు. ఇప్పుడు వారి స్థానంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, రేవంత్‌రెడ్డి వ్యవహార శైలి విషయానికి వద్దాం! 2019కి ముందు చంద్రబాబు పాలనలోని వాసనలు ఇప్పుడు కూడా వస్తున్నాయన్నది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభిప్రాయంగా ఉంది. అప్పట్లో రియల్‌ టైం గవర్నెన్స్‌, ఐవీఆర్‌ఎస్‌ సర్వే అంటూ ఆయన జపం చేసేవారు. తన పాలన పట్ల 70 శాతానికి పైగా ప్రజలు సంతృప్తితో ఉన్నారని చంద్రబాబు చెప్పుకొనేవారు. ఎన్నికల్లో మాత్రం 60 శాతం ప్రజలు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. హ్యాపీ ఆంధ్రప్రదేశ్‌, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ అంటూ కబుర్లు చెప్పేవారు. కోటి మంది జనాభా కూడా లేని దేశాలలోని పరిస్థితులను వివరించి ఆంధ్రప్రదేశ్‌ కూడా అలా ఉండాలని కోరుకునేవారు. దోమల నిర్మూలన అంటూ ఒక పెద్ద కార్యక్రమం నిర్వహించారు. ఇవన్నీ ప్రజలను మెప్పించలేకపోయాయి. తిన్నామా, పడుకున్నామా, లేచామా అని భావించే సమాజంలో ఉండి కూడా ‘హ్యాపీ ఇండెక్స్‌’ వంటి వాటి గురించి మాట్లాడితే ప్రజల చెవికెక్కుతుందా? గత అనుభవాలను విస్మరించి ఇప్పుడు మళ్లీ ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ అని కలవరిస్తున్నారు. ఏఐ అంటే ఏమిటో 90 శాతం ప్రజలకు తెలియదు. వాటివల్ల కలిగే ప్రయోజనాలేమిటో అంతకంటే తెలియదు. 90 శాతానికి పైగా ప్రజలకు తెలియని అంశాన్ని పదేపదే వల్లెవేయడం వల్ల ప్రయోజనం ఏమిటో ఆయనకే తెలియాలి. ప్రభుత్వ ఉద్యోగులు పని ఒత్తిడిని అధిగమించి సంతోషంగా ఉండేందుకు ప్రతి ఆదివారం అమలు జరిగేలా ఒక కార్యక్రమం రూపొందిస్తామని చంద్రబాబు తాజాగా ప్రకటించారు. ప్రభుత్వ వ్యవహారాలన్నీ ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. కొంతమంది మినహా మెజారిటీ ప్రభుత్వ ఉద్యోగులపై పని భారం కూడా అధికంగా ఉండటం లేదు.


ఆదివారం సెలవురోజున కుటుంబ సభ్యులతో సంతోషంగా ఎలా గడపాలో ప్రభుత్వ ఉద్యోగులకు తెలియదా? అందుకోసం ఒక కార్యక్రమాన్ని రూపొందించవలసిన అవసరం ముఖ్యమంత్రికి ఏమిటి? చంద్రబాబు పాలనలో సమీక్షల వల్లనే ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు అధిక ఒత్తిడికి గురవుతారన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన ఈ సమీక్షలు తగ్గించుకుంటే ఎవరికీ ఏ ఒత్తిడీ ఉండదు. ఉదాహరణకు, ప్రభుత్వ కార్యదర్శులతో చంద్రబాబు ఇటీవలే ఒక సమీక్ష నిర్వహించారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన ఈ సమీక్ష రాత్రి వరకు సాగింది. దాదాపు పన్నెండు గంటల పాటు సాగిన ఈ సమీక్షలో సాధించింది ఏమిటో తెలియదు. 2019కి ముందు కూడా ఇలాంటి సమీక్షలు జరిగినప్పుడు పలువురు అధికారులు రక్తంలో చక్కెర శాతం తగ్గి ఇబ్బంది పడటం చూశాం. ఇటువంటి సమీక్షలకు సీనియర్‌ అధికారులు కోటూ బూటూ వేసుకొని వస్తుంటారు. ప్రొటోకాల్‌ ప్రకారం అలా చేయాలేమో తెలియదు. నిజానికి టై కట్టుకొని, కోటు వేసుకొని గంటలకొద్దీ సమీక్షల్లో పాల్గొనడాన్ని మించిన శిక్ష ఉండదు. అధికారులు సమీక్షలో పాల్గొంటే ఉద్యోగులు కార్యాలయాలను వదిలి వెళ్లలేరు కదా? ప్రభుత్వాలు సరైన ప్రాధాన్యాలను నిర్దేశించుకొని సత్వర నిర్ణయాలు తీసుకుంటే ఉద్యోగులపై ఒత్తిడి ఉండదు. అటు ప్రజలు కూడా సంతోషంగా ఉంటారు. పలు దేశాలలో ఉద్యోగులు పని వేళల తర్వాత ఫోన్లో కూడా అందుబాటులో ఉండరు. ఇందుకు ఆయా ప్రభుత్వాలు అనుమతిస్తాయి. జగన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాయంత్రం 5 గంటల తర్వాత ప్రభుత్వ కార్యాలయాల్లో లైట్లు కూడా వెలిగేవి కావు. ఉద్యోగులు ఇళ్లకు వెళ్లిపోయి కుటుంబ సభ్యులతో గడిపేవారు. అయినా ప్రభుత్వ అధికారులు జగన్‌రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడానికి కారణాలు వేరే ఉన్నాయి. ఉద్యోగులకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను సకాలంలో చెల్లించకపోవడం వంటి కారణాల వల్ల వారిలో వ్యతిరేకత ఏర్పడింది. ఉద్యోగుల కోసం హ్యాపీ సండే ప్రోగ్రాంను రూపొందిస్తామని చంద్రబాబు ప్రకటించగానే సామాన్యుడి పేరిట ఒక ప్రభుత్వ ఉద్యోగి సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టు ఆలోచింపజేసేలా ఉంది. ‘‘సెలవు దినాల్లో డ్యూటీ చేయనవసరం లేదని మీరు అంటున్నారు. కలెక్టర్లు, ఆపై స్థాయి అధికారులు ఆదివారాల్లో కూడా పనిచేయకపోతే మెమోలు ఇస్తామంటున్నారు. ఎప్పుడో సంగతి ఎందుకు? పంచాయతీరాజ్‌ శాఖ యాప్‌ అప్‌డేట్‌ చేయకపోతే మామూలుగా ఉండదని ఈ మధ్య పంచాయతీరాజ్‌ ఉద్యోగులకు మెసేజ్‌ పెట్టారు. అయ్యా చంద్రబాబు నాయుడుగారూ! ప్రజల్లో సంతృప్తి స్థాయి, అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఐవీఆర్‌ సిస్టమ్‌లో కాల్‌ చేసి ఎలా తెలుసుకుంటున్నారో... అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కాల్‌ చేసి వాళ్ల సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకొనే ప్రయత్నం చేయండి సార్‌. విద్యా శాఖలో ఒకే యాప్‌ తీసుకొస్తామని మంత్రి లోకేశ్‌గారు చెప్పాక ఉపాధ్యాయులందరూ సంతోషంగా ఉన్నారు. అలాగే పంచాయతీరాజ్‌లో కూడా చేయండి. వర్క్‌ ఫ్రం హోంలాగా వర్క్‌ ఫ్రం యాప్‌గా కాకుండా, పనిచేయకుండానే చేసినట్టు నమోదు చేసే 90కి పైగా యాప్‌లను వీలైనంత వరకు కుదించి... పవర్‌ పాయింట్లు, ఎక్సెల్‌ షీట్లపై పనిచేయించుకోవడం కాకుండా క్షేత్ర స్థాయిలో నిజంగా పని జరిగేలా చూడాలని విన్నపం’’.. ఇదీ ఆ ఉద్యోగి పోస్టు సారాంశం. వాస్తవ పరిస్థితికి ఈ పోస్టు అద్దం పడుతోంది కదా! పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ అనే పీపీటీ వల్ల ఆత్మవంచనే మిగులుతుంది. ముఖ్యమంత్రిని సంతృప్తిపరచడానికే ఈ పీపీటీలను అధికారులు రూపొందిస్తారు. చంద్రబాబుకు టెక్నాలజీ అంటే మక్కువ కనుక ఆ దిశగానే పీపీటీలను రూపొందిస్తారు. పన్నెండు గంటల పాటు సాగిన సమీక్షా సమావేశం వల్ల సత్ఫలితాలు వచ్చాయని ఇటు ప్రజలు కానీ, అటు అధికారులు, ఉద్యోగులు చెప్పే పరిస్థితి ఉందా?


ఎక్కడుంది సంతోషం?

ముఖ్యమంత్రి చంద్రబాబుకు వేరే వ్యాపకం ఏమీ ఉండదు. ఆయనకు వేరే ధ్యాస కూడా ఉండదు. ఇంటి వ్యవహారాలను, వ్యాపారాలను ఆయన కుటుంబ సభ్యులు చూసుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులందరికీ ఈ వెసులుబాటు ఉండదు. కుటుంబ బాధ్యతలు వారికి ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులకు చట్ట ప్రకారం చెల్లించాల్సినవి సకాలంలో చెల్లిస్తూ, వారిపై అదనపు పని భారం వేయకపోతే వారు సంతోషంగానే ఉంటారు. అందుకోసం ప్రత్యేక కార్యక్రమ అవసరం ఉండదు. ఇక ప్రజల విషయానికి వస్తే, వాళ్లు సంతోషంగా ఉండాలంటే ప్రభుత్వం నుంచి వేధింపులు ఉండకుండా ఉంటే చాలు. ఒకప్పుడు మన దేశంలో లైసెన్స్‌రాజ్‌ ఉండేది. పరిపాలనా సంస్కరణల వల్ల అది క్రమంగా పోయింది కానీ... ఇప్పటికీ ప్రభుత్వాల వద్ద ఉండే విచక్షణాధికారాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నిబంధనలకు అనుగుణంగా చట్టబద్ధంగా ఉండే వ్యవహారాల్లో కూడా ప్రజలకు ఉపశమనం లభించనప్పుడు అది గుడ్‌ గవర్నెన్స్‌ ఎలా అవుతుంది? రెవెన్యూ శాఖలో ఈ సమస్య అధికంగా ఉంది. వారసత్వంగా లభించే భూములను మ్యుటేషన్‌ చేయించుకోవాలన్నా లంచాలు ఇవ్వాల్సిన దుస్థితి ఎందుకుంది? ఇటు ఉద్యోగులు, అటు ప్రజలు హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలో గుర్తించి ఆ దిశగా చర్యలు తీసుకుంటే ఎవరికీ ఏ ఒత్తిడీ ఉండదు. అలా జరిగినప్పుడు ప్రజల నాడి తెలుసుకోవడానికి ప్రశాంత్‌ కిశోర్‌ వంటి వారి అవసరం ఉండదు. మంత్రి లోకేశ్‌ ఇటీవల ఢిల్లీ వెళ్లి మరీ ప్రశాంత్‌ కిశోర్‌ను కలిశారు. ఒకటి రెండు రోజులు ఢిల్లీలో గడిపారు. ఆ సమయమేదో పార్టీ కార్యకర్తలకు కేటాయించి ఉంటే అద్భుతమైన, నిఖార్సయిన ఫీడ్‌ బ్యాక్‌ లభించి ఉండేది కదా! చంద్రబాబు అండ్‌ కో ఇప్పటికైనా ఆత్మ విమర్శ చేసుకొని నేల విడిచి సాము చేసే విధానానికి స్వస్తి చెప్పడం మంచిది. నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు ఇవేమీ తెలియవా?


రేవంత్‌ పాలన... మంచీ చెడులు!

ఇప్పుడు తెలంగాణలో నెలకొన్న పరిస్థితుల విషయానికి వద్దాం! ‘‘కాంగ్రెస్‌ పాలనను ఏడాదిగా గమనిస్తున్నాను. నేను కొడితే మామూలుగా ఉండదు. గట్టిగా కొడతాను’’ అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవలే రేవంత్‌రెడ్డి సర్కార్‌ను హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి కూడా ఇందుకు తగు విధంగానే స్పందించారు. ‘నువ్వు గట్టిగా కొట్టేది ఏమిటి? ఫుల్లా – హాఫా?’ అని వేరే అర్థంలో సెటైర్‌ వేశారు. ఈ సెటైర్లు వినడానికి బాగుంటాయి కానీ ప్రజలను మాత్రం సంతృప్తిపరచవు. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి 15 మాసాలు అవుతోంది. కేసీఆర్‌ అన్నారని కాదుగానీ ప్రజల్లో ప్రభుత్వం పట్ల అసంతృప్తి మెల్లగా వ్యాపిస్తోంది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ముద్ర పాలనపై ఇంకా పడలేదు. కేసీఆర్‌ పాలనలో ఏం జరిగింది? అని చెప్పడానికి కొన్ని మంచి పనులు ఉన్నాయి. అలాగే కొన్ని చెడ్డ పనులు కూడా ఉన్నాయి. కానీ, కాంగ్రెస్‌ 15 నెలల పాలనలో ఏం జరిగిందో చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు. రాజకీయ చతురత, ఛలోక్తులు ప్రజల కడుపు నింపవు. సమగ్ర కసరత్తు చేయకుండా కొన్ని కార్యక్రమాలను హడావిడిగా అమలు చేయడం వల్ల కాంగ్రెస్‌ ప్రభుత్వానికి నష్టం జరుగుతోంది. రైతు రుణ మాఫీ ఈ కోవలోకే వస్తుంది. దాదాపు రూ.25వేల కోట్ల మేర రుణ మాఫీ చేసినా ఆశించిన రాజకీయ ప్రయోజనం నెరవేరలేదు. ఎన్నికలకు ముందు కేసీఆర్‌ ప్రభుత్వం లక్ష రూపాయల వరకు రుణ మాఫీ చేసింది. ఈ ప్రయోజనం పొందిన రైతులను మినహాయించి మిగతా వారికి రుణ మాఫీ చేసి ఉంటే ప్రభుత్వానికి పదివేల కోట్లకు పైగా ఆదా అయ్యేది. ఈ డబ్బుతో రైతు బంధు అమలు చేసి ఉండవచ్చు. ఇలాంటి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోకపోవడం వల్ల రైతు రుణ మాఫీ చేసి కూడా విమర్శలు ఎదుర్కొంటున్నారు. రైతులు కూడా సంతృప్తిగా లేరు. రేషన్‌ కార్డుల పంపిణీ వ్యవహారంలో, ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు స్వీకరణలో కూడా సరైన కసరత్తు జరగలేదు. గతంలో దారిద్య్ర రేఖకు ఎగువన, దిగువన ఉన్నవారికి విడివిడిగా రేషన్‌ కార్డులు ఇచ్చేవారు. ఇప్పుడు అందరికీ తెల్ల రేషన్‌ కార్డులు ఇస్తామన్న అభిప్రాయం కలిగించారు.


దీంతో దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్నవారు కూడా తెల్ల రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇందిరమ్మ ఇళ్లు ఎన్ని నిర్మించాలనే విషయంలో కూడా శాస్ర్తీయత పాటించడం లేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకోసం నిజమైన అర్హులు ఆరుగురు మాత్రమే ఉండగా 60కి పైగా దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రమంతటా దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలంటే రాష్ట్ర బడ్జెట్‌ కూడా సరిపోదు. అలాగని కొందరికి మాత్రమే ఇళ్లు కేటాయిస్తే మిగిలిన వారిలో అసంతృప్తి నెలకొంటుంది. అన్ని పథకాలనూ ఒకేసారి ప్రారంభించాలనుకుంటే ఫలితాలు ఇలాగే ఉంటాయి.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నలుగురైదుగురు మంత్రులతోనే సంప్రదింపులు చేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. మంత్రులతో ఎప్పుడైనా మాట్లాడవచ్చు! శాసనసభ్యులు, కింది స్థాయి పార్టీ నాయకుల అభిప్రాయాలు తీసుకుంటే ప్రభుత్వానికి ఉపయోగపడతాయి. మొత్తం మీద రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆశించిన మేర పనిచేయడం లేదన్న అభిప్రాయం వ్యాపిస్తోంది. ఈ వ్యతిరేక భావనను మొగ్గలోనే తొలగించని పక్షంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం మరింత అప్రతిష్ఠపాలవుతుంది. అవినీతి విషయంలో కూడా ప్రభుత్వంపై విమర్శలు మొదలయ్యాయి. కొంత మంది మంత్రులు అపరిమిత అధికారాలను అనుభవిస్తుండగా, ప్రభుత్వంలో తమకు ప్రాధాన్యం లేకుండా పోతోందని శాసనసభ్యులు వాపోతున్నారు. ఎమ్మెల్యేలలో నెలకొన్న ఈ భావన అసంతృప్తికి దారి తీయకముందే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మేల్కొనడం మంచిది. మొత్తంగా చూస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇంకా బాలారిష్టాలను అధిగమించలేదన్న భావన విస్తృతంగా ఉంది. ఈ కారణంగా ఎన్నికల ఫలితాల తర్వాత డీలా పడిపోయిన భారత రాష్ట్ర సమితిలో భవిష్యత్తుపై ఆశలు చిగురిస్తున్నాయి. మరోవైపు బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే ప్రమాదం పొంచి ఉండటం కూడా రేవంత్‌ సర్కార్‌కు సవాలు కానుంది. సుప్రీంకోర్టు తీసుకోబోయే నిర్ణయం వల్ల ఉప ఎన్నికలు వస్తే ఫలితం ఎలా ఉంటుందోనన్న బెంగ పార్టీ మారిన ఎమ్మెల్యేలలో ఉంది. ఈ కారణంగా వారిలో కొందరు ఘర్‌ వాపసీ ఆలోచన చేస్తున్నారు.


అలా జరిగితే రేవంత్‌ సర్కార్‌కు నైతికంగా దెబ్బే అవుతుంది. కేసీఆర్‌ చెప్పుకొంటున్నట్టుగా ప్రజలు ఆయన పాలనకోసం పలవరించడం లేదుగానీ, కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మాత్రం పెదవి విరుస్తున్నారు. పార్టీ ఫండ్‌ కోసం తెలంగాణపై ఆధారపడుతున్న కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రభుత్వ పనితీరు మెరుగుకు మార్గదర్శనం చేయలేని పరిస్థితిలో ఉంది. కర్ణాటక కాంగ్రెస్‌ నాయకులు చేతులెత్తేయడంతో ప్రతి అవసరానికీ కాంగ్రెస్‌ అధిష్ఠానం తెలంగాణపై ఆధారపడుతోంది. ఈ కారణంగా ప్రభుత్వంలో అవినీతి పెరగడానికి ఆస్కారం ఏర్పడుతోంది. గుడ్డికంటే మెల్ల నయం అన్నట్టుగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీని మార్చడం ద్వారా కాంగ్రెస్‌ అధిష్ఠానం మంచిపని చేసింది. దీపాదాస్‌ ఇక్కడే మకాం వేసి మంత్రులకు ఫోన్లు చేసి ‘నా వాటా ఏదీ?’ అని వేధిస్తున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. వీటన్నింటి నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి నాయకులకు భవిష్యత్తుపై ఆశలు చిగురిస్తున్నాయి.


కేసీఆర్‌... అండ్‌ ఫ్యామిలీ...

ఎన్నికల ముందు వరకు కేసీఆర్‌ పోకడలను నిరసించిన ప్రజలు ఇప్పుడు ఆయన పట్ల ఎంతో కొంత సానుభూతి ప్రదర్శిస్తున్నారు. కేసీఆర్‌ పట్ల వ్యతిరేకత క్రమంగా తొలగిపోతోంది. ఈ పరిణామం కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ప్రమాద సంకేతమే. అయితే, ప్రజలు కాంగ్రెస్‌ పాలన పట్ల అంత సంతృప్తిగా లేనప్పటికీ కేసీఆర్‌ కుటుంబ సభ్యుల పట్ల మాత్రం ఇప్పటికీ ఆగ్రహంగానే ఉన్నారు. ముఖ్యంగా కేటీఆర్‌, కవిత విషయంలో ప్రజల్లో అనుకూలత ఏర్పడటం లేదు. అధికారంలో ఉన్నప్పుడు వారు అపరిమిత అధికార దర్పాన్ని ప్రదర్శించడం ఇందుకు కారణం కావొచ్చు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా పరిస్థితులను మదింపు చేసుకొని విరుగుడు చర్యలు చేపట్టని పక్షంలో పరిస్థితి చేయి దాటిపోయినా ఆశ్చర్యపోవాల్సింది ఉండదు. అవతలి వైపు కేసీఆర్‌ నిలబడి ఉన్నంత వరకు ప్రజలకు ప్రత్యామ్నాయం ఉండనే ఉంటుంది. తెలంగాణలో అధికారంలోకి రావాలని భారతీయ జనతా పార్టీ కలలు కంటోంది కానీ కేసీఆర్‌ను రాజకీయంగా దెబ్బతీయనంత వరకు ఆ పార్టీకి చాన్స్‌ రాదు. ప్రస్తుతానికి కేసీఆర్‌ తాను కోల్పోయిన జవసత్వాలను తిరిగి సమకూర్చుకుంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఆయనను బలవంతుడ్ని చేస్తారా? లేక లోపాలను సరిదిద్దుకొని బలహీనుడ్ని చేస్తారా? అన్నది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వేయబోయే అడుగులను బట్టి ఉంటుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు రాకుండా అడ్డుకోవడం రేవంత్‌ సర్కార్‌ ముందున్న తక్షణ కర్తవ్యం. ఏ కారణం వల్లనైనా ఉప ఎన్నికలు జరిగి ఆ స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉండి కూడా గెలవలేని పక్షంలో కేసీఆర్‌ మరింత బలపడతారు. అదే జరిగితే కాంగ్రెస్‌ ప్రభుత్వంపై రాజకీయ పోరును ఉధృతం చేస్తారు. మొత్తంగా పరిస్థితులను బేరీజు వేసుకొని 15 నెలల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించుకుంటే ‘ఆల్‌ ఈజ్‌ నాట్‌ వెల్‌’ అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డి తాను బలపడి పార్టీని బలోపేతం చేయడానికి ఎటువంటి ఎత్తుగడలు వేస్తారో వేచి చూద్దాం!

Updated Date - Feb 16 , 2025 | 06:00 AM