భారతీయ విద్యార్థులకు కెనడా షాక్
ABN , Publish Date - Nov 10 , 2024 | 02:55 AM
కెనడాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకొనే భారతీయ విద్యార్థులకు ట్రూడో ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది.
ఫాస్ట్ ట్రాక్ స్టూడెంట్ వీసా ప్రక్రియ రద్దు
అట్టవా, నవంబరు 9: కెనడాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకొనే భారతీయ విద్యార్థులకు ట్రూడో ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. వేలాది మంది అంతర్జాతీయ విద్యార్థులు త్వరగా వీసాలు పొందడానికి సహాయపడే ఫాస్ట్ ట్రాక్ స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్(ఎ్‌సడీఎస్) ప్రోగ్రామ్‌ను ఈ నెల 8నుంచి నిలిపివేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని ప్రకటించింది. ఎస్‌డీఎ్‌సతో పాటు నైజీరియా నుంచి స్టడీ పర్మిట్ దరఖాస్తులను స్వీకరించే నైజీరియా స్టూడెంట్ ఎక్స్‌ప్రె్‌స(ఎన్‌ఎ్‌సఈ)ని కూడా రద్దు చేస్తున్నట్లు ఇమిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్ కెనడా (ఐఆర్‌సీసీ) ప్రకటించింది. భారత్ సహా 14 దేశాలకు చెందిన విద్యార్థులకు వీసా దరఖాస్తులను వేగవంతం చేసే ఉద్దేశంతో 2018లో ఎస్‌డీఎ్‌సను ప్రారంభించారు. 2022లో మన దేశానికి చెందిన 80శాతం మంది ఈ విధానంలోనే వీసా పొందారు.
2023 జనవరి నుంచి మార్చి వరకూ వీసా కోసం దరఖాస్తు చేసిన ప్రతి ఐదుగురు భారతీయ విద్యార్థుల్లో నలుగురు ఎస్‌డీఎస్ ద్వారా చేసుకున్నారు. వీరిలో 76 శాతం మందికి వీసాలు మంజూరయ్యాయి. ఇదే సమయంలో రెగ్యులర్ విధానంలో వెళ్లిన వారిలో 8శాతం మందికి మాత్రమే వీసా లభించింది. కాగా కెనడాలో పెద్దసంఖ్యలో ఖలిస్థానీ మద్దతుదారులు ఉన్నారని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ఎట్టకేలకు అంగీకరించారు. అయితే వారు మొత్తంగా సిక్కు సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు కాదని చెప్పుకొచ్చారు. అదేవిధంగా భారత ప్రధాని మోదీ ప్రభుత్వానికి మద్దతుదారులు కూడా తమ దేశంలో ఉన్నారని, హిందూ కెనడియన్లు అందరికీ వారు ప్రాతినిధ్యం వహించరని అభిప్రాయం వ్యక్తం చేశారు. అట్టవా పార్లమెంట్ హిల్‌లో ఇటీవల నిర్వహించిన దీపావళి వేడుకల్లో పాల్గొన్న ట్రూడో ఈ వ్యాఖ్యలు చేశారు.