Amit Shah: సనాతన ధర్మాన్ని అవమానిస్తారా.. డీఎంకే నేతలపై అమిత్‌షా ఆగ్రహం
ABN , Publish Date - Apr 14 , 2024 | 12:19 PM
డీఎంకే నేతలు సనాతన ధర్మాన్ని అవమానించి, హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా(Union Home Minister Amit Shah) ఆగ్రహం వ్యక్తం చేశారు.
- కన్నియాకుమారిలో అట్టహాసంగా రోడ్ షో
చెన్నై: డీఎంకే నేతలు సనాతన ధర్మాన్ని అవమానించి, హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా(Union Home Minister Amit Shah) ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నియాకుమారి, తక్కలైలో బీజేపీ అభ్యర్థి పొన్ రాధాకృష్ణన్‌కు మద్దతుగా శనివారం ఉదయం అమిత్‌షా రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా అమిత్‌షా మాట్లాడుతూ... తనకు కన్నియాకుమారి జిల్లాతో ఎనలేని ఆత్మీయానుబంధం ఉందన్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో పొన్ రాధాకృష్ణన్‌ను, ఉపఎన్నిక జరగనున్న విలవంగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో నందినిని గెలిపించాలని పిలుపునిచ్చారు. వారిని గెలిపిస్తే మళ్లీ విజయోత్సవ సభలో కూడా తాను పాల్గొంటానన్నారు. దేశవ్యాప్తంగా అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎన్‌డీఏ కూటమి గెలుపు కోసం పార్టీ నాయకులు, మిత్రపక్షాల నేతలు సైనికుల్లా రేయింబవళ్లు పని చేస్తున్నారని తెలిపారు. తమిళ భాష, సంస్కృతి, తమిళనాడుకు ఘనత చేకూర్చేలా ప్రధాని నరేంద్రమోదీ విదేశాల సభల్లోనూ ప్రస్తావిస్తుండడంతో పాటు సెంగోల్‌ను పార్లమెంటులో ప్రతిష్ఠించారని గుర్తు చేశారు. తాను తమిళ భాషను అమితంగా ప్రేమిస్తానని, అయితే మాట్లాడలేకపోవడం బాధగా ఉందన్నారు. అయితే మరో మూడునాలుగు నెలల్లో తమిళం నేర్చుకుని, ఇక్కడే ప్రజల మధ్య తమిళంలో మాట్లాడతానన్నారు. అన్నాడీఎంకే, డీఎంకేలు అధికారంలో ఉన్నప్పుడు విపరీతంగా దోచుకున్నాయని, ఈ దోపిడీని నిలదీసిన కారణంగానే ఆ రెండు పార్టీలు బీజేపీపై విమర్శలు కురిపిస్తున్నాయన్నారు. డీఎంకే నేతలు సనాతన ధర్మాన్ని, అయోధ్య రామమందిరం గురించి కించపరిచేలా మాట్లాడుతున్నారని, అందుకే ప్రజలు డీఎంకేకు గుణపాఠం చెబుతారని తాను విశ్వసిస్తున్నట్లు తెలిపారు.
డీఎంకే నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతూ కోట్లాదిమంది హిందువుల మనసులను బాధపెడుతున్నారని, అయినా తాము అందరినీ సమానంగా చూస్తున్నామన్నారు. మోదీ మూడోసారి ప్రధానిగా వస్తే దేశంలో మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. అదే విధంగా పొన్ రాధాకృష్ణన్‌ను గెలిపిస్తే, ఆయనకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని హామీనిచ్చారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ తాను పర్యటించిన ప్రాంతాల్లో బీజేపీ 400 చోట్ల గెలుస్తుందని స్వయంగా ప్రజలే చెబుతున్నారన్నారు. ఈ సందర్భంగా ‘తామర గుర్తుపైనే బటన్ నొక్కుతారా?’ అంటూ తమిళంలో రాసుకొచ్చి అడగ్గా, అందుకు అక్కడున్న ప్రజల నుంచి ‘అవును’ అనే సమాధానం వచ్చింది. తక్కలై పాత బస్టాండు నుంచి ప్రారంభమైన అమిత్‌షా రోడ్ షో, మేట్టుక్కడై వరకు కొనసాగింది. అనంతరం అమిత్‌షా కారులో నాగర్‌కోయిల్ ఆర్ముడు రిజర్వ్ పోలీస్ గ్రౌండ్‌కు చేరుకుని, అక్కడి నుంచి హెలికాప్టర్‌లో కేరళకు పయనమయ్యారు.
ఇదికూడా చదవండి: Hero Vijay: ఈ ఎన్నికల్లో ఇళయ దళపతి వర్గం ఎటువైపో?