Share News

Modi 3.0 Cabinet: కేబినెట్ కూర్పుపై ఉత్కంఠ.. ట్విస్ట్ ఇచ్చిన బీజేపీ!

ABN , Publish Date - Jun 09 , 2024 | 01:47 PM

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ముచ్చటగా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఆదివారం సాయంత్రం ప్రధానమంత్రిగా..

Modi 3.0 Cabinet: కేబినెట్ కూర్పుపై ఉత్కంఠ.. ట్విస్ట్ ఇచ్చిన బీజేపీ!
BJP To Keep Top Ministries In Modi 3.0 Cabinet

బీజేపీ (BJP) నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ముచ్చటగా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఆదివారం సాయంత్రం ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రమాణస్వీకారం కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే.. మోదీ 3.0లోని మంత్రివర్గం కూర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎన్డీయే కూటమిలోని పక్షాలకు మోదీ కేబినెట్‌లో ఎన్ని బెర్తులు లభిస్తాయనేది చర్చనీయాంశంగా మారింది.


కేటాయింపులు ఇలా..!

ఇప్పటికే ఈ విషయంపై లెక్కలు తేలిపోయాయని, బీజేపీ వద్దే కీలక శాఖలు ఉన్నాయని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. హోం, ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాలు, రోడ్లు, రైల్వే, విద్య, సాంస్కృతిక, సంక్షేమం వంటి ప్రధాన శాఖలను బీజేపీ తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మిత్రపక్షాలకు మాత్రం ఐదు నుంచి ఎనిమిది శాఖలను కేటాయిస్తారట. ఈ కేబినెట్ కూర్పుపై బీజేపీ సీనియర్ నేతలు అమిత్‌షా, రాజ్‌నాథ్‌ సింగ్, జేపీ నడ్డా తమ కూటమిలోని భాగస్వాములతో చర్చించారని.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బిహార్ సీఎం నీతీశ్‌కుమార్, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండేలతో మంతనాలు జరిపారని తెలిసింది.


ఎవరికెన్ని..?

బీజేపీ నుంచి అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌లకు కేబినెట్ బెర్తులు దాదాపు ఖాయమయ్యాయి. టీడీపీకి డిప్యూటీ స్పీకర్‌తో పాటు పౌర విమానయాన, ఉక్కు శాఖ కేటాయించే అవకాశం ఉంది. టీడీపీ యంగ్ ఎంపీలు కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌లకు దాదాపు కన్ఫమ్ అయ్యింది. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు పీఎంవో నుంచి ఫోన్ కాల్ రావడంతో ప్రధాని నివాసానికి వెళ్లారు. ఇక జేడీయూకి గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌‌కే ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

వాస్తవానికి.. హోంశాఖ కావాల్సిందేనని జేడీయూ మొదట్లో డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే.. బీజేపీ పెద్దలు దీనిపై చర్చించి, జేడీయూని ఒప్పించి, ఆ శాఖని తన వద్దే ఉంచుకున్నట్టు సమాచారం అందుతోంది. ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశాక.. ఈ కేబినెట్ కూర్పుపై పూర్తి క్లారిటీ రానుంది. మొత్తానికి చూస్తే.. మొదట్నుంచి ఎన్ని రకాలుగా వార్తలొచ్చినా ఆఖరి నిమిషంలో మాత్రం బీజేపీ ఊహించని ట్విస్టే ఇచ్చిందని రాజకీయ వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు.

Read Latest National News and Telugu News

Updated Date - Jun 09 , 2024 | 01:52 PM