Share News

CBI : గొళ్లెం లేని తలుపు.. అయినా దారుణం!

ABN , Publish Date - Aug 24 , 2024 | 03:08 AM

ఆర్జీ కర్‌ ఆస్పత్రిలో మహిళా జూనియర్‌ డాక్టర్‌పై జరిగిన హత్యాచారం కేసుకు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్పత్రి చెస్ట్‌ విభాగం సెమినార్‌హాల్‌లో దారుణం చోటు చేసుకున్న సంగతి ఇప్పటికే వెల్లడి కాగా..

CBI : గొళ్లెం లేని తలుపు.. అయినా దారుణం!

  • కోల్‌కతా హత్యాచారం కేసులో కొత్త వివరాలు

  • ఘటన జరిగిన సెమినార్‌ హాల్‌ తలుపు బోల్టు గతంలోనే విరిగిపోయినట్లు గుర్తింపు

  • దారుణం జరుగుతుంటే ఎవరైనా కాపలా ఉన్నారేమోనని అనుమానాలు

కోల్‌కతా, ఆగస్టు 23: ఆర్జీ కర్‌ ఆస్పత్రిలో మహిళా జూనియర్‌ డాక్టర్‌పై జరిగిన హత్యాచారం కేసుకు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్పత్రి చెస్ట్‌ విభాగం సెమినార్‌హాల్‌లో దారుణం చోటు చేసుకున్న సంగతి ఇప్పటికే వెల్లడి కాగా, ఈ హాల్‌ తలుపునకు ఉన్న గొళ్లెం (టవర్‌ బోల్ట్‌) విరిగిపోయి ఉందని తాజాగా వెల్లడైంది.

దర్యాప్తు చేస్తోన్న సీబీఐ దీనిపై ప్రధానంగా దృష్టి సారించింది. సెమినార్‌ హాల్‌ తలుపునకు ఉన్న టవర్‌ బోల్ట్‌ కొంతకాలం కిందటే విరిగిపోయిందని, దీనివల్ల ఆ తలుపు కూడా సరిగా మూసుకోదన్న సంగతి అక్కడ పని చేసే వైద్యులకు, సిబ్బందికి అందరికీ తెలిసిన విషయమేనని ఒక సీబీఐ అధికారి వెల్లడించారు.

అటువంటప్పుడు సెమినార్‌హాల్‌లో మహిళా వైద్యురాలిపై అంత దారుణం ఎలా జరిగింది? అది జరుగుతున్నప్పుడు తలుపు బయట ఎవరైనా కాపలాగా నిల్చున్నారా? డాక్టర్‌ ఆక్రందనలు ఎవరికీ వినిపించలేదా? వంటి అంశాలను పరిశీలిస్తున్నామని ఆ అధికారి తెలిపారు.

సెమినార్‌ హాల్‌లోకి బాధితురాలు ఆగస్టు 9వ తేదీ వేకువజామున 2-3 గంటల మధ్య వెళ్లి నిద్రకు ఉపక్రమించారని, ఆమె నిద్రలో ఉండటాన్ని తాను చూశానని అదే సమయంలో విధుల్లో ఉన్న ఒక డ్యూటీ డాక్టర్‌ తమకు చెప్పారని పేర్కొన్నారు. పీజీ డాక్టర్‌పై హత్యాచారానికి పాల్పడినట్లుగా భావిస్తున్న ప్రధాన నిందితుడు సంజయ్‌ రాయ్‌..

సెమినార్‌హాల్‌లోకి ఉదయం నాలుగు తర్వాత ప్రవేశించినట్లు తెలుస్తోంది. మరోవైపు, ఈ కేసుపై ప్రత్యేకంగా ఏర్పాటైన విచారణ కోర్టు సంజయ్‌రాయ్‌ని శుక్రవారం 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీకి పంపించింది. అతడిపై పాలీగ్రాఫ్‌ (లై డిటెక్టర్‌) టెస్ట్‌ జరపటానికి కూడా అనుమతించింది. సంజయ్‌రాయ్‌ మీద ఇప్పటికే డీఎన్‌ఏ, సైకోఎనాలిసిస్‌ టెస్టులు జరిపారు. ఆ నివేదికలు రావాల్సి ఉంది.


ఖాళీ అవుతున్న హాస్టళ్లు

పీజీ వైద్య విద్యార్థిని మీద జరిగిన దారుణ హత్యాచారం నేపథ్యంలో ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజీ, హాస్పిటల్‌ క్యాంపస్‌ హాస్టళ్ల నుంచి మహిళా డాక్టర్లు పెద్ద సంఖ్యలో వెళ్లిపోతున్నారు. నర్సింగ్‌ హాస్టల్‌ మినహా ఇతర మహిళా హాస్టళ్లు అన్నీ దాదాపుగా ఖాళీ అయిపోయాయి.

ఘటనకు ముందు హాస్టళ్లలో 160 మంది మహిళా జూనియర్‌ డాక్టర్లు ఉండేవారని, ప్రస్తుతం 17 మంది మాత్రమే ఉన్నారని ఒక జూనియర్‌ డాక్టర్‌ తెలిపారు. హత్యాచార ఘటనతోపాటు, ఆగస్టు 14వ తేదీ రాత్రి ఆస్పత్రిపై దుండగులు దాడి చేసి పెద్ద ఎత్తున విధ్వంసానికి పాల్పడిన నేపథ్యంలో.. తమ భద్రత పట్ల ఆందోళనతో పలువురు క్యాంప స్‌ను వీడి వెళ్తున్నారు.

Updated Date - Aug 24 , 2024 | 03:08 AM