Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ.. బెయిల్‌పై స్టే విధించిన ఢిల్లీ హైకోర్టు
ABN , Publish Date - Jun 21 , 2024 | 11:52 AM
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తనకు బెయిల్ దొరికిందని ఆనందించేలోపే.. సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు గురువారం..
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు (Delhi Liquor Scam) సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తనకు బెయిల్ దొరికిందని ఆనందించేలోపే.. సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు (Arvind Kejriwal) ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు గురువారం రౌస్ అవెన్యూ కోర్టు మంజూరు చేసిన సాధారణ బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) స్టే విధించింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ హైకోర్టులో ఈడీ పిటిషన్ వేయగా.. దాన్ని స్వాగతించిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని కేజ్రీవాల్ పలుమార్లు కోర్టు మెట్లు ఎక్కగా.. ఎట్టకేలకు గురువారం (20/06/24) ట్రయల్ కోర్టు ఆయనకు రూ.1 లక్ష పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. కొన్ని షరతులు కూడా విధించింది. దర్యాప్తును అడ్డుకోవడానికి, సాక్ష్యుల్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నించకూడదని సూచించింది. ఈ కేసులో ఈడీ ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని న్యాయవాది వాదించడంతో.. ఢిల్లీ కోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. రూ.లక్ష వ్యక్తిగత బాండు సమర్పించిన తర్వాత ఆయన్ను విడుదల చేయొచ్చని పేర్కొంది. అయితే.. ఈ తీర్పుని సవాల్ చేస్తూ ఈడీ హైకోర్టుని ఆశ్రయించింది.
ఈడీ పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు.. శుక్రవారం రోజే దీనిపై విచారణ జరుపుతామని తెలిపింది. ఈలోపు ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులను అమలు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో.. కేజ్రీవాల్ జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం లేకుండా పోయింది. కాగా.. ఈ పిటిషన్ దాఖలు చేసిన సమయంలో ఈడీ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. కేజ్రీవాల్ బెయిల్‌ని వ్యతిరేకించేందుకు తమకు సరైన అవకాశం లభించలేదన్నారు. తమ వాదనలు వినిపించే సరిపడా సమయమూ ఇవ్వలేదన్న ఆయన.. ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై స్టే విధించి, తమ పిటిషన్‌పై అత్యవసర చర్యలు చేపట్టాలని కోరారు.
Read Latest National News and Telugu News