Share News

Ghulam Nabi Azad: పోటీ చేయను, ప్రచారానికే పరిమితం: గులాం నబీ ఆజాద్

ABN , Publish Date - Feb 17 , 2024 | 09:09 PM

కాంగ్రెస్ పార్టీని వీడి సొంతంగా డెమొక్రాటిక్ ప్రొగ్రసివ్ ఆజాద్ పార్టీని ఏర్పాటు చేసిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండనున్నట్టు సంకేతాలిచ్చారు. అయితే, పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తానని చెప్పారు.

Ghulam Nabi Azad: పోటీ చేయను, ప్రచారానికే పరిమితం: గులాం నబీ ఆజాద్

జమ్మూ: కాంగ్రెస్ పార్టీని వీడి సొంతంగా డెమొక్రాటిక్ ప్రొగ్రసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ)ని ఏర్పాటు చేసిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ (Gulam Nabi Azad) ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండనున్నట్టు సంకేతాలిచ్చారు. అయితే, పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తానని చెప్పారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపాలైన ఆజాద్ ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ఈ ఏడాది జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల సంవత్సరం కావడంతో డీపీఏపీ నేతలు ఎన్నికలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.


''పార్లమెంటు ఎన్నికలు 100 శాతం అనుకున్న సమయానికే జరుగుతాయి. జమ్మూకశ్మీర్ ఎన్నికలు కూడా త్వరలోనే జరుగుతాయని అంచనా వేస్తున్నాను. అయితే నాకు ఎన్నికల కమిషన్‌తో కానీ, ప్రభుత్వంతో కానీ ఎలాంటి కాంటాక్టులు లేవు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సెప్టెంబర్‌లోగా అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి'' అని నగ్రోటాలో జరిగిన మీడియా సమావేశంలో ఆజాద్ చెప్పారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా అనే ప్రశ్నకు పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తానని తెలిపారు. ఒకవేళ తాను పోటీ చేయాల్సి వస్తే కేవలం ఒకే చోటు నుంచి పోటీ చేస్తానన్నారు. దేశ రాజధానిలో రైతులు చేపట్టిన ఆందోళనపై మాట్లాడుతూ, ఆందోళనలు ఇటు ప్రభుత్వానికి కానీ, అటు రైతులకు కానీ మంచిది కాదన్నారు. రైతు సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని ప్రధానమంత్రిని కోరారు.

Updated Date - Feb 17 , 2024 | 09:09 PM