Share News

Electoins: రెండు రోజులే గడువు.. లేదంటే మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన

ABN , Publish Date - Nov 24 , 2024 | 04:32 PM

మహారాష్ట్ర శాసనసభ పదవీకాలం నవంబర్ 26తో ముగుస్తుంది. శాసనసభ పదవీ కాలం ముగిసేలోపు కొత్త ప్రభుత్వం కొలువుదీరాల్సి ఉంటుంది. అంటే నవంబర్ 26లోపు మహాయుతి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఏర్పాటులో ఏదైనా ఆలస్యం జరిగి నవంబర్ 26లోపు సీఎం ప్రమాణ స్వీకారం జరగకపోతే..

Electoins: రెండు రోజులే గడువు.. లేదంటే మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన
Maharashtra

మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మహాయుతి కూటమి అధికారానికి అవసరమైన మెజార్టీ సాధించింది. సీఎం కుర్చీ ఎవరనేదానిపై కూటమి పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అంటూ మరో వార్త హల్‌చల్ చేస్తోంది. స్పష్టమైన మెజార్టీ మహాయుతి కూటమికి వచ్చిన తర్వాత కూడా రాష్ట్రపతి పాలన విధించడం ఏమిటనే చర్చ జరుగుతోంది. వాస్తవానికి మహారాష్ట్ర శాసనసభ పదవీకాలం నవంబర్ 26తో ముగుస్తుంది. శాసనసభ పదవీ కాలం ముగిసేలోపు కొత్త ప్రభుత్వం కొలువుదీరాల్సి ఉంటుంది. అంటే నవంబర్ 26లోపు మహాయుతి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఏర్పాటులో ఏదైనా ఆలస్యం జరిగి నవంబర్ 26లోపు సీఎం ప్రమాణ స్వీకారం జరగకపోతే అక్కడ రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంటుంది. కొత్త ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడితే అప్పటివరకు ప్రెసిడెంట్ రూల్ కొనసాగుతుంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మాత్రం మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు అవకాశాలు లేవనే చెప్పుకోవాలి.


నవంబర్ 25 లేదా 26వ తేదీన మహాయుతి కూటమి నుంచి ఒకరు సీఎంగా ప్రమాణం చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మరోసారి సీఎంగా ప్రమాణం చేసే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ అధిష్టానం షిండే సీఎం అభ్యర్థిత్వానికి ఓకే చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం ఎవరనేదానిపై బీజేపీ, షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ మధ్య చర్చలు జరుగుతున్నాయి. గతంలో వలె ఒక సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంలు సోమ, మంగళవారాల్లో ప్రమాణం చేయనున్నారు. అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ఉండేందుకు అంగీకరించినప్పటికీ కీలక శాఖలు తనకు ఇవ్వాలని అడిగినట్లు తెలుస్తోంది. సీఎం పదవి శివసేనకు ఇస్తే హోంశాఖను బీజేపీ తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోసారి ఆర్థిక శాఖ మంత్రిగా పవార్‌ ఉండే అవకాశాలు లేకపోలేదు. హోంశాఖను అజిత్ పవార్ అడుగుతున్నప్పటికీ బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాల్సి ఉంది.


సీఎం ఎవరు..

మహారాష్ట్ర సీఎం ఎవరనే ఉత్కంఠ ఇంకా వీడలేదు. ఓవైపు ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రి పదవిని కోరుకుంటుండగా.. అజిత్ పవార్ సైతం ఆసక్తి చూపిస్తున్నారు. బీజేపీ శ్రేణులు మాత్రం ఫడ్నవీస్‌ను సీఎం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఫడ్నవీస్‌ సీఎం అంటూ పోస్టర్లు వెలిశాయి. బీజేపీ అధిష్టానం మాత్రం ఎవరిని సీఎం చేయాలనే అంశం ఆచితూచి వ్యవహారిస్తోంది. ఈరోజు సాయంత్రానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనేదానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Nov 24 , 2024 | 05:11 PM