Viral Video: ట్రాఫిక్ ఎఫెక్ట్.. లోకల్ రైలులో ప్రయాణించిన ప్రముఖ పారిశ్రామికవేత్త
ABN , Publish Date - Jan 01 , 2024 | 08:48 PM
Viral Video: ప్రముఖ పారిశ్రామికవేత్త, రియల్ ఎస్టేట్ దిగ్గజం, బిలియనీర్ హీరానందానీ కూడా ఇప్పుడు లోకల్ రైలులో ప్రయాణించడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇతర ప్రయాణికులతో కలిసి ప్లాట్ ఫాంపై వేచి ఉన్న హీరానందానీ లోకల్ రైలులోని ఏసీ బోగీలో ఎక్కి థానే జిల్లా ఉల్లాస్ నగర్ రైల్వేస్టేషన్ వరకు ప్రయాణించారు.

దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో ట్రాఫిక్ కష్టాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ నేపథ్యంలో ముంబైలో ప్రతిరోజూ లోకల్ రైళ్లలో లక్షలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ప్రముఖ పారిశ్రామికవేత్త, రియల్ ఎస్టేట్ దిగ్గజం, బిలియనీర్ హీరానందానీ కూడా ఇప్పుడు లోకల్ రైలులో ప్రయాణించడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇతర ప్రయాణికులతో కలిసి ప్లాట్ ఫాంపై వేచి ఉన్న హీరానందానీ లోకల్ రైలులోని ఏసీ బోగీలో ఎక్కి థానే జిల్లా ఉల్లాస్ నగర్ రైల్వేస్టేషన్ వరకు ప్రయాణించారు. ఉల్లాస్ నగర్‌లోని సీహెచ్‌ఎం కళాశాలలో జరిగే కార్యక్రమానికి హాజరయ్యేందుకు రోడ్డు మార్గంలో వెళ్తే ట్రాఫిక్ కారణంగా సమయం వృథా అవుతుందని తాను భావించినట్లు హీరానందానీ అన్నారు. తాను ప్రయాణ సమయాన్ని ఆదా చేయడంతో పాటు ట్రాఫిక్ అవరోధాలను అధిగమించడానికి లోకల్ రైలులో ప్రయాణించానని హీరానందానీ పేర్కొన్నారు. ఈ రైలు ప్రయాణంలో ఆయనతో పాటు కొందరు సభ్యులు వెంట ఉన్నారు.
కాగా హీరానందానీ షేర్ చేసిన వీడియోకు సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందన వస్తోంది. ఇప్పటి వరకు ఆయన వీడియోను 22 మిలియన్ల మందికి పైగా నెటిజన్లు వీక్షించారు. ముంబైలో ప్రజా రవాణాకు మూలస్తంభంగా ఉన్న లోకల్ రైలులో ప్రయాణించినందుకు హీరానందానీని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. దేశానికి ఆయన లాంటి వారు చాలామంది కావాలని నెటిజన్‌లు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు ‘సార్ మీరు తప్పు కోచ్‌లో ప్రవేశించారు. ఈ కోచ్‌లు వికలాంగులు, కేన్సర్ రోగులకు కేటాయించింది’ అని ఓ నెటిజన్ పేర్కొన్నాడు.