Arvind Kejriwal: ఢిల్లీ ప్రజలు పాకిస్థానీయుల్లా కనిపిస్తున్నారా?...అమిత్‌షాను నిలదీసిన కేజ్రీవాల్
ABN , Publish Date - May 21 , 2024 | 04:44 PM
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా , ఢిల్లీ ముఖ్యమంత్రి ఆరవింద్ కేజ్రీవాల్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నరేంద్ర మోదీ వారసుడిగా అమిత్‌షా ఎన్నికైన కారణంగానే ఆయన 'దురహంకారం' ప్రదర్శిస్తున్నారని తాజాగా కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీ ప్రజలను పాకిస్థానీయులతో అమిత్‌షా పోలుస్తున్నారని అన్నారు.
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah), ఢిల్లీ ముఖ్యమంత్రి ఆరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నరేంద్ర మోదీ వారసుడిగా అమిత్‌షా ఎన్నికైన కారణంగానే ఆయన 'దురహంకారం' ప్రదర్శిస్తున్నారని తాజాగా కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీ ప్రజలను పాకిస్థానీయులతో అమిత్‌షా పోలుస్తున్నారని అన్నారు.
కేజ్రీవాల్, రాహుల్ వంటి నేతలు ఇండియా కంటే పాకిస్థాన్‌నే ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారంటూ దక్షిణ ఢిల్లీలో అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను కేజ్రీవాల్ మంగళవారంనాడు తిప్పికొట్టారు. అమిత్‌షా సోమవారంనాడు ఢిల్లీకి వచ్చారని, ఆయన ర్యాలీకి 500 మంది కంటే తక్కువ మంది హాజరయ్యారని అన్నారు. అమిత్‌షా తన ప్రసంగంలో దేశ ప్రజలపై నోరుపారేసుకున్నారని, ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతిచ్చేవారు పాకిస్థానీయులంటూ మాట్లాడారని చెప్పారు. ''ఆయనను నేను ఒక్కటే అడగదలచుకున్నాను. ఢిల్లీ ప్రజలు 62 సీట్లు మనకు (ఆప్) ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 56 శాతం ఓటింగ్ షేర్ ఇచ్చారు. వాళ్లంతా పాకిస్థానీయులా?'' అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. పంజాబ్ ప్రజలు 117 సీట్లలో 92 సీట్లు ఆప్‌కి ఇచ్చారనీ, వారు పాకిస్థానీయులా అని నిలదీశారు. గుజరాత్, గోవా, ఉత్తరప్రదేశ్, అసోం, మధ్యప్రదేశ్ సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రజలు ఆప్‌ను ఆదరించారనీ, వారు కూడా పాకస్థానీయులేనా అని అమిత్‌షాను కేజ్రీవాల్ ప్రశ్నించారు.
Prashant Kishor: బీజేపీకి ఎన్ని లోక్‌సభ సీట్లు వస్తాయంటే... పీకే జోస్యం
'ఇండియా' కూటమిదే అధికారం
అమిత్‌షాను తన వారసుడిగా మోదీ ఎన్నుకున్నారని కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. ''ఇదేదో గర్వకారణంగా మీరు (అమిత్‌షా) భావిస్తున్నారు. ప్రజలను తప్పుపడుతూ వారిని బెదరిస్తున్నారు. మీరింకా ప్రధాని కాలేదు. కానీ అహంకారంతో మాట్లాడటం మొదలుపెట్టారు. కానీ, మీరు ప్రధానమంత్రి కాబోవడం లేదని నేను చెప్పదలచుకున్నాను. ఎందుకంటే జూన్ 4వ తేదీన కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం లేదు'' అని కేజ్రీవాల్ అన్నారు. సోమవారంనాడు పూర్తయిన 5వ విడత పోలింగ్ తర్వాత కేంద్రంలో 'ఇండియా' కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సర్వేలన్నీ చెబుతున్నాయని అన్నారు. బీజేపీకి ఓటమి తప్పదని, ఇండియా కూటమికి 300కు పైగా సీట్లు వస్తాయంటూ సర్వేలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు.
Read Latest National News and Telugu News