Share News

Wayanad landslides: 156కు చేరిన మృతులు.. రాహుల్, ప్రియాంక పర్యటన వాయిదా

ABN , Publish Date - Jul 31 , 2024 | 08:04 AM

కేరళలో ప్రకృతి సృష్టించిన బీభత్సంతో భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. బుధవారం ఉదయానికి మృతుల సంఖ్య 156కి చేరింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఇక గాయపడిన 130 మంది వయనాడ్‌‌లోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Wayanad landslides: 156కు చేరిన మృతులు.. రాహుల్, ప్రియాంక పర్యటన వాయిదా

తిరువనంతపురం, జులై 31: కేరళలో ప్రకృతి సృష్టించిన బీభత్సంతో భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. బుధవారం ఉదయానికి మృతుల సంఖ్య 156కి చేరింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఇక గాయపడిన 130 మంది వయనాడ్‌‌లోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.


కొనసాగుతున్న సహాయక చర్యలు..

అలాగే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ బృందాలు ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ఈ భారీ వర్షాలు, వరదలతో చలియార్ నదికి వరద పోటెత్తింది. ఈ వరదలో ప్రజలు సైతం కొట్టుకు పోయినట్లు సమాచారం. జిల్లాలోని ముండక్కై, చూర్లమాట, అట్టమాలతోపాటు నూల్పూజా ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

తాత్కాలిక వంతెనలు నిర్మించిన ఆర్మీ..

మరోవైపు భారీ వంతెనలు సైతం నీటిలో కొట్టుకు పోయాయి. దీంతో ఆర్మీ సహాయక చర్యల్లో భాగంగా తాత్కాలిక వంతెనలను నిర్మించింది. తద్వారా వేలాది మంది ప్రజలును సురక్షిత ప్రాంతాలకు తరలించింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ముందంటూ గత పక్షం రోజులుగా కేరళ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తునే ఉన్నామని ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

మొత్తం 225 ఆర్మీ సిబ్బంది ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నారని వివరించారు. అందులో వైద్య బృందాలు సైతం ఉన్నాయన్నారు. ఈ సహాయక చర్యల్లో భాగంగా రెండు ఎయిర్ ఫోర్స్ హెలికాఫ్టర్లు, ఎంఐ 17, అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాఫ్టర్‌ను వినియోగిస్తున్నట్లు చెప్పారు.


ప్రధాని మోదీతోపాటు...

కేరళలో ప్రకృతి కారణంగా సంభవించిన భారీ విపత్తుపై ప్రధాని మోదీ ఇప్పటికే స్పందించారు. రాష్ట్రాన్ని అన్ని విధాల ఆదుకుంటామని ఆయన కేరళ సీఎం పినరయి రవికి హామీ ఇచ్చారు. అలాగే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం కేరళకు ఆపన్న హస్తం అందించేందుకు ముందుకు వచ్చాయి. అయితే ఈ విపత్తు నేపథ్యంలో రాష్ట్రంలో రెండు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రభుత్వం ప్రకటించింది. అలాగే వివిధ కార్యక్రమాలను సైతం నిషేధించినట్లు కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది.


ఎడతెరపి లేకుండా వర్షాలు...

రాష్ట్రవ్యాప్తంగా గత నాలుగైదు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇంకోవైపు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో వయనాడ్‌ ప్రాంతానికి.. ముఖ్యంగా చాలియార్‌ నదికి వరద నీరు పోటెత్తింది. దీంతో భారీగా నదిలో నీటి ఉధృతి పెరిగింది. వరద బీభత్సానికి సోమవారం అర్ధరాత్రి భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. అలాగే సోమవారం తెల్లవారుజామున సైతం కొండ చరియలు భారీగా విరిగిపడ్డాయి. దాంతో ముండక్కై గ్రామంలోని 65 కుటుంబాలు శిథిలాల కింద చిక్కుకుపోయాయి. దీంతో వారికి రక్షించేందుకు.. సహయక చర్యలు కొనసాగించేందుకు ప్రభుత్వం యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టింది.


రాహుల్ ప్రియాంక పర్యటన వాయిదా.. ఎందుకంటే..

ఇక వయనాడ్‌‌లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల పర్యటన వాయిదా పడింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల..ఈ పర్యటన వాయిదా పడింది. అయితే సాధ్యమైనంత త్వరలో వయనాడ్‌లో పర్యటిస్తామని రాహుల్ గాంధీ.. తన ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు.

ఇక ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో వయనాడు నుంచి రాహుల్ గాంధీ గెలుపొందారు. ఆయన రాయబరేలి నుంచి కూడా విజయం సాధించారు. దీంతో వయనాడ్ ఎంపీ పదవికి ఆయన రాజీనామా చేశారు. మరికొద్ది రోజుల్లో ఈ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశమున్నట్లు తెలుస్తుంది.

Read More National News and Latest Telugu News

Updated Date - Jul 31 , 2024 | 11:14 AM