Share News

Rahul Gandhi: శివుని ఫోటో చూపిస్తూ.. హిందువులపై రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు

ABN , Publish Date - Jul 01 , 2024 | 03:48 PM

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ లోక్‌సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని, బీజేపీని టార్గెట్ చేసుకొని విమర్శనాస్త్రాలు సంధించారు. శివుని ఫోటో చూపిస్తూ.. తమని తాము 24 గంటలపాటు హిందువులమని చెప్పుకునేవారిలో...

Rahul Gandhi: శివుని ఫోటో చూపిస్తూ.. హిందువులపై రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు
Rahul Gandhi

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) లోక్‌సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని, బీజేపీని టార్గెట్ చేసుకొని విమర్శనాస్త్రాలు సంధించారు. శివుని (Lord Shiva) ఫోటో చూపిస్తూ.. తమని తాము 24 గంటలపాటు హిందువులమని చెప్పుకునేవారిలో హింస, ద్వేషం, అసత్యం కురుకుపోయి ఉంటుందని.. బీజేపీని ఉద్దేశిస్తూ విమర్శించారు. హిందూ మతం పేరు చెప్పి బీజేపీ (BJP) అందరినీ భయపెడుతోందని ఆరోపణలు చేశారు. తమని తాము హిందువులని ప్రచారం చేసుకునేవారు విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, అలాంటి వాళ్లు హిందువులే కారని విమర్శించారు. అసలు హింసని ప్రేరేపించే వాళ్లను హిందువులని ఎలా అనగలమని ప్రశ్నించారు.


ప్రధాని మోదీ అభ్యంతరం

ఈ విధంగా రాహుల్ చేసిన వ్యాఖ్యలపై లోక్‌సభలో తీవ్ర దుమారం రేగింది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) లేచి అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ ప్రసంగాన్ని అడ్డుకొని.. ఈ విషయం ఎంతో తీవ్రమైందని, హిందూ సమాజాన్ని హింసాత్మకమని పేర్కొనడం తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు రాహుల్ బదులిస్తూ.. ‘‘నరేంద్ర మోదీ ఒక్కరే మొత్తం హిందూ సమాజం కాదు, అలాగే ఆర్ఎస్ఎస్ ఒక్కటే హిందూ సమాజం కాదు’’ అని చెప్పుకొచ్చారు. తాను కేవలం ప్రధాని మోదీని, బీజేపీని, ఆర్ఎస్ఎస్‌ని ఆ వ్యాఖ్యలు చేశానని.. మొత్తం హిందూ సమాజాన్ని ఉద్దేశించి కాదని స్పష్టం చేశారు.


శివుని ఫోటో నిషేధమా?

అంతకుముందు.. రాహుల్ గాంధీ శివుని విగ్రహం చూపించడంపై కూడా సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. దీనిపై స్పీకర్ ఓం బిర్లా (Speaker Om Birla) అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సభలో ప్లకార్డ్‌లు, ఫొటోలు ప్రదర్శించడం నిషేధం అని తేల్చి చెప్పారు. ఇందుకు రాహుల్ బదులిస్తూ.. ఈ సభలో శివుని బొమ్మని చూపించడం నిషేధమా? అని పదే పదే ప్రశ్నించారు. తన మెడకు పాము చుట్టిముట్టినప్పుడు తాను వాస్తవాన్ని అంగీకరిస్తానని శివుడు చెప్పాడని, ఆయన చేతిలో ఉన్న త్రిశూలం అహింసకు ప్రతీక అని వివరించారు. ఒకవేళ హింసకి ప్రతీక అయితే.. ఆ త్రిశూలం కుడిచేతిలో ఉండేదని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు.


శివుడే ప్రేరణ

తాను శివుని నుంచే ప్రేరణ పొందానని, ప్రతిపక్షంలో ఉన్నందుకు గర్వపడుతున్నానని రాహుల్ పేర్కొన్నారు. రాజ్యాంగానికి రక్షణగా ఉంటామని, అధికారం కంటే నిజం గొప్పదని చెప్పారు. రాజ్యాంగంపై దాడి జరుగుతోందని.. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఈడీ, సీబీఐ తమ ఇండియా కూటమి నేతలను వేధింపులకు గురి చేస్తున్నాయని ఆరోపణలు గుప్పించారు. తన ఎంపీ పదవితో పాటు ఇంటిని సైతం లాక్కున్నారని.. ఈడీ నుంచి 55 గంటల విచారణ ఎదుర్కున్నానని తీవ్రంగా మండిపడ్డారు.

Read Latest National News and Telugu News

Updated Date - Jul 01 , 2024 | 05:03 PM