Share News

కశ్మీరంలో ఎన్నికల సమరం

ABN , Publish Date - Sep 25 , 2024 | 03:19 AM

పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో.. రెండో దశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది!

కశ్మీరంలో ఎన్నికల సమరం

  • భారీ భద్రత నడుమ నేడు రెండో విడత పోలింగ్‌.. 26 నియోజకవర్గాల నుంచి 239 మంది పోటీ

పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో.. రెండో దశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది! ఈ దశలో మొత్తం 26 నియోజకవర్గాల నుంచి 239 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు! 25.78 లక్షల మంది ఓటర్లు బుధవారం వారి భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. ఆరు జిల్లాల్లో విస్తరించిన ఈ నియోజకవర్గాల్లో ఎన్నికల నిమిత్తం భారీ ఎత్తున మోహరించిన భద్రతాసిబ్బంది ఉనికితో.. ఒకరకమైన ఉద్విగ్న వాతావరణం నెలకొని ఉంది! ఆర్టికల్‌ 370 రద్దు, జమ్ముకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో దేశమంతా ఈ ఎన్నికలను ఆసక్తిగా చూస్తోంది. సాధారణంగా ఎన్నికలనగానే.. సంక్షేమ పథకాలు, ఉద్యోగాల కల్పనవంటివి ప్రధాన పార్టీల కీలక హామీలుగా ఉంటాయి! కానీ, కల్లోల కశ్మీరంలో ఎన్నికల హామీలు అందుకు భిన్నం.

కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్‌ 370, 35ఏ పునరుద్ధరణ, రాష్ట్ర హోదా తిరిగి కల్పించేందుకు కృషి వంటివి నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీ వంటి ప్రాంతీయ పార్టీల ప్రధాన హామీలుగా ఉన్నాయి. నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగాల కల్పన, రాజకీయ ఖైదీల విడుదల, ఇండియా-పాకిస్థాన్‌ మధ్య చర్చలకు ప్రోత్సహించడం, జమ్ముకశ్మీర్‌లో భూయాజమాన్య హక్కులను స్థానికులకు పరిమితం చేయడం, పబ్లిక్‌ సేఫ్టీ యాక్ట్‌ రద్దు వంటి హామీలు కూడా ఆయా పార్టీల మ్యానిఫెస్టోల్లో ఉన్నాయి.

కాంగ్రెస్‌ పార్టీ ఆర్టికల్‌ 370 గురించి ఏం మాట్లాడట్లేదుగానీ.. జమ్ముకశ్మీర్‌ రాష్ట్రహోదా పునరుద్ధరణకు కృషి చేస్తామని హామీ ఇస్తోంది. ఇక.. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో ఒమర్‌ అబ్దుల్లాను కంగుతినిపించిన ఇంజనీర్‌ రషీద్‌కు చెందిన అవామీ ఇత్తెహాద్‌ పార్టీ ప్రధాన హామీ.. జైళ్లల్లో ఉన్న కశ్మీరీ రాజకీయ ఖైదీలను విడిపించడమే. వీరందరికీ భిన్నంగా.. నిషేధిత జమాతే ఇస్లామీ బలపరుస్తున్న పదిమంది స్వతంత్ర అభ్యర్థుల ప్రధాన హామీలు మాత్రం వీటికి భిన్నంగా ఉండడం విశేషం. ఆ పది మందీ.. మహిళా సాధికారత, ఉద్యోగాలనే ప్రధాన అంశాలుగా చేసుకుని ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. జమ్ము ప్రాంతంలో బీజేపీకి పట్టున్నా.. ఎక్కువ సీట్లుండే కశ్మీర్‌లో ఆ పరిస్థితి లేదు.


  • పెరిగిన ఓటింగ్‌..

ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో జమ్ముకశ్మీర్‌లోని 5 లోక్‌సభ స్థానాల్లో కలిపి 58.46 శాతం ఓట్లు నమోదైన సంగతి తెలిసిందే. ఇది గడిచిన 35 ఏళ్లలో అక్కడ నమోదైన అత్యధిక పోలింగ్‌! 2019తో పోలిస్తే 2024లో కశ్మీర్‌ లోయలో ఏకంగా 30ు మేర ఓటింగ్‌ పెరిగింది. ప్రస్తుత ఎన్నికల్లో సైతం మొదటి విడత పోలింగ్‌లో 61 శాతం ఓటింగ్‌ నమోదైంది. గతంలో ఉగ్రవాదుల కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు సైతం భయపడే పరిస్థితి ఉండేదని.. సామాన్యప్రజలు బయటకు వచ్చి ఓటేయలేకపోయేవారని.. దీనివల్ల ఎన్నికల్లో పోటీ వాతావరణం కొరవడి ఎన్‌సీ, పీడీపీ వంటి పార్టీలదే పైచేయిగా ఉండేదని రాజకీయ నిపుణులు గుర్తుచేస్తున్నారు.

అయితే, కొన్నాళ్లుగా జమ్ముకశ్మీర్‌లో పరిస్థితి మారిందని.. 2020లో జరిగిన డీడీసీ ఎన్నికల్లో ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఓటేశారని వారు పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్‌లోని ప్రధాన పార్టీలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటవ్వడమే ఇందుకు కారణం. ‘‘నా జీవితంలో మొదటిసారి 2020లో జరిగిన డిస్ట్రిక్ట్‌ డెవల్‌పమెంట్‌ కౌన్సిల్‌ ఎలక్షన్స్‌లో ఓటేశాను. లోయలోని అన్ని పార్టీలూ తొలిసారి బీజేపీకి వ్యతిరేకంగా ఏకమయ్యాయి’’ అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని స్థానికుడు ఒకరు తెలపడం గమనార్హం.

ఆ ఎన్నికల్లో ఆ కూటమికి 110 సీట్లొచ్చాయని.. కానీ, ఇప్పుడవే పార్టీలు విడిపోయి పోటీ చేస్తున్నాయని.. ఈ అనైక్యత అంతిమంగా బీజేపీకే ఉపయోగపడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ మినహా ఎవరు అధికారంలోకి వచ్చినా పాలన సజావుగా సాగదని.. ఇప్పుడు ఢిల్లీలో ఆప్‌ సర్కారును ఇబ్బంది పెట్టినట్టుగానే, జమ్ముకశ్మీర్‌లో కూడా అక్టోబరు 8న ఫలితాల తర్వాత ఏర్పడబోయే ప్రభుత్వాన్ని మోదీ సర్కారు ఇబ్బంది పెడుతుందన్న ఆందోళన చాలా మందిలో ఉంది.


  • సర్వేలు ఏం చెబుతున్నాయ్‌?

జమ్ముకశ్మీర్‌ ఎన్నికలపై లోక్‌పోల్‌, ద సెఫాలజిస్ట్‌ సంస్థలు రెండు ప్రీపోల్‌ సర్వేలు నిర్వహించాయి. వాటిలో లోక్‌పోల్‌ సంస్థ.. ఇండీ కూటమికి (కాంగ్రెస్‌, ఎన్‌సీ తదితరులు) 51-56 సీట్లు వచ్చే అవకాశం ఉందని ప్రకటించింది. ఆ సంస్థ బీజేపీకి వస్తాయని అంచనా వేసిన సీట్లు.. 23 నుంచి 26. అలాగే పీడీపీకి 4-8, ఇతరులకు 3-7 సీట్లు వస్తాయని అంచనా వేసింది.

22,500 మందిని ప్రశ్నించి లోక్‌పోల్‌ సంస్థ ఈ సర్వే వివరాలను వెల్లడించింది. ఇక.. ద సెఫాలజిస్ట్‌ ప్రకారం కూడా ఈ ఎన్నికల్లో ఇండీ కూటమే గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతోంది! నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీకి 38, కాంగ్రె్‌సకు 13, బీజేపీకి 21, పీడీపీకి 8, ఇతరులకు 10 దాకా వస్తాయని ఆ సంస్థ పోల్‌లో వెల్లడైంది. ఏపీ అసెంబ్లీకి 2019, 2024 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ గెలుపు అవకాశాలపై దాదాపు కచ్చితమైన అంచనాలు వెలువరించిన కేకే సర్వే కూడా జమ్ముకశ్మీర్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ తగలొచ్చని తెలిపింది.

- సెంట్రల్‌ డెస్క్‌

Updated Date - Sep 25 , 2024 | 03:19 AM