Manmohan Singh: అశ్రునివాళుల మధ్య.. స్మృతి పథంలోకి
ABN , Publish Date - Dec 28 , 2024 | 04:10 AM
దివాలా అంచున ఉన్న దేశానికి కొత్త దిశ చూపి దశ మార్చిన ఆర్థిక మాంత్రికుడు, నిష్కళంక పాలకుడు.. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ విశ్వవ్యాప్త అశ్రునివాళుల మధ్య శనివారం శాశ్వత స్మృతిపథానికి చేరుకోనున్నారు.

మన్మోహన్ సింగ్‌కు రాష్ట్రపతి ముర్ము,
ప్రధాని మోదీ తదితరుల నివాళి
ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో నేడు
ఉదయం 11:45కు అంత్యక్రియలు
స్మృతి స్థలంలో స్మారక నిర్మాణం
దేశం గొప్ప రాజనీతిజ్ఞుణ్ని కోల్పోయింది
విచారం వ్యక్తం చేసిన కేంద్ర క్యాబినెట్
భారత రాజకీయ, ఆర్థిక రంగాల్లో
మహోన్నత వ్యక్తి.. సీడబ్ల్యూసీ నివాళి
నేడు ‘కేంద్ర’ సంస్థలకు ఓపూట సెలవు
న్యూఢిల్లీ, డిసెంబరు 27: దివాలా అంచున ఉన్న దేశానికి కొత్త దిశ చూపి దశ మార్చిన ఆర్థిక మాంత్రికుడు, నిష్కళంక పాలకుడు.. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ విశ్వవ్యాప్త అశ్రునివాళుల మధ్య శనివారం శాశ్వత స్మృతిపథానికి చేరుకోనున్నారు. ఆయన అంత్యక్రియలను శనివారం ఉదయం 11:45 గంటలకు ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో నిర్వహించనున్నట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరపడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేయాల్సిందిగా రక్షణ శాఖను కోరినట్లు వెల్లడించింది. మరోవైపు.. మన్మోహన్ మృతి పట్ల కేంద్ర మంత్రివర్గం శుక్రవారం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ అయిన క్యాబినెట్.. మన్మోహన్ మృతికి సంతాపసూచకంగా తొలుత రెండు నిమిషాలపాటు మౌనం పాటించింది. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడుతూ సంతాప తీర్మానం చేసింది. ‘‘దేశ ప్రజల జీవితాలపై మన్మోహన్ సింగ్ చెరగని ముద్ర వేశారు. ఆయన మృతితో దేశం ప్రముఖ రాజనీతిజ్ఞుడిని, ప్రఖ్యాత ఆర్థికవేత్తను, మహోన్నత నాయకుడిని కోల్పోయింది’’ అని ఆ తీర్మానంలో పేర్కొంది. ఢిల్లీలోని సమాధి కాంప్లెక్స్‌లో ఉన్న స్మృతి స్థలంలో ఆయన స్మారకాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
మన్మోహన్ మృతికి సంతాప సూచకంగా ఏడురోజులపాటు జాతీయ సంతాపదినాలుగా కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు జనవరి 1 వరకూ దేశవ్యాప్తంగా జాతీయ జెండాను అవనతం చేస్తారు. అలాగే, ఇతర దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలన్నింటిపైనా జాతీయ జెండాను అవనతం చేస్తారు. ఆయన అంత్యక్రియల సం దర్భంగా.. శనివారం కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వరంగ సం స్థల కార్యాలయాలకు ఒంటిపూట సెలవు ప్రకటిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. ఢిల్లీలోని మన్మోహన్ సింగ్ నివాసం లో ఆయన భౌతిక కాయాన్ని శుక్రవారం పలువురు ప్రముఖులు, పెద్ద సంఖ్యలో ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు సందర్శించి కడసారి నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్, ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ వాధ్రా తదితరులు ఆయన నివాసానికి వెళ్లి శ్రద్ధాంజలి ఘటించారు. మన్మోహన్ కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆర్థికమే కాదు.. హరిత లక్ష్యాలు కూడా!
మన్మోహన్‌లో మరో కోణం
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంటే కేవలం ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన లక్ష్యాలనే ఎక్కువ మంది ప్రస్తావిస్తారు. కానీ, ఆయనలో హరిత లక్ష్యాలు కూడా ఉన్నాయి. 2004-14 మధ్య పదేళ్లపాటు ప్రధాని పీఠం అలంకరించిన మన్మోహన్‌సింగ్ దేశంలో హరిత సంపద విరాజిల్లేలా అనేక నిర్ణయాలు తీసుకున్నారు. వాతావరణ మార్పులపై జాతీయ ప్రణాళిక(ఎన్‌ఏపీసీసీ), అటవీ హక్కుల చట్టం, జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ) వంటివి తీసుకువచ్చారు. తద్వారా పర్యావరణ పరిరక్షణ, అటవీ సంరక్షణకు పెద్దపీట వేశారు. అటవీ సంపదపై ఆదివాసీలకే హక్కులకు కల్పించడం ద్వారా వన సంరక్షణకు ప్రాధాన్యమిచ్చారు. అదేవిధంగా 25 లక్షల మందికి హక్కులు కల్పించారు.
జిన్నాను తాకిన మన్మోహన్ బంతి!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ క్రీడా ప్రియుడు కూడా. అవిభాజ్య భారత్‌లోని పంజాబ్ రాష్ట్రంలో జన్మించిన మన్మోహన్‌సింగ్ తన 13 ఏళ్ల ప్రాయంలో లాహోర్‌లోని జూనియర్ కాలేజీ మైదానంలో తన మిత్రులతో కలిసి హాకీ ఆడుతున్నారు. ఈ మైదానానికి సమీపంలో ఉన్న ఓ ఇంటి ముందు ఓ పెద్దాయన నిలబడి వీరి ఆటను ఆసక్తిగా వీక్షించారు. ఇంతలో మాస్టర్ మన్మోహన్ సింగ్ కొట్టిన బంతి గోల్ పోస్టులోకి వెళ్లకుండా పొరపాటు ఇంటి ముందు నిలబడి వీరి ఆటను వీక్షిస్తున్న పెద్దాయన తలను తాకింది. అయితే.. బంతి తగిలిన పెద్దాయన నవ్వి ఊరుకున్నారు. ఆయన ఎవరో కాదు.. పాకిస్థాన్ విభజన కోసం పట్టుబట్టిన మహమ్మద్ అలీ జిన్నా. ఈ సరదా సంఘటనను మన్మోహనే స్వయంగా చెప్పుకొచ్చారు.
- (సెంట్రల్ డెస్క్)