AP Pension: ఏపీలో ఒకరోజు ముందుగానే పెన్షన్.. లబ్ధిదారుల్లో ఆనందం
ABN , Publish Date - Dec 01 , 2024 | 04:04 PM
ఏపీ వ్యాప్తంగా ఒకరోజు ముందుగా పెన్షన్ల పంపిణీ జరిగింది. రేపు ఆదివారం కావడంతో ఒకోరోజు ముందే అంటే ఈరోజు (శనివారం) ఉదయం నుంచే అన్ని ప్రాంతాల్లో లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం నేమకల్లులో స్వయంగా లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ డబ్బులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పంపిణీ చేశారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు లబ్ధిదారుల్లో ఆత్మస్థైర్యం నింపిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు పయ్యావుల కేశవ్, సవిత, రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, కందికుంట వెంకట ప్రసాద్, పల్లె సింధూర రెడ్డి, అమిలినేని సురేంద్రబాబు, బండారు శ్రావణి, గుమ్మనూరు జయరాం, ఎమ్మెస్ రాజు పాల్గొన్నారు.
నేమకల్లు ఆంజనేయ స్వామి దేవాలయంలో సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం ‘ప్రజావేదిక - పేదల సేవలో’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు.
జోరు వానలోనూ పెన్షన్లను లబ్ధిదారులకు అందజేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. డిసెంబర్1వ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్లను పంపిణీ చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.
అనుకున్న విధంగానే పెన్షన్ల పంపిణీ జరుగుతోందని చెప్పారు. వృద్ధులు, వితంతువులు, విభిన్న ప్రతిభావంతులు, ఒంటరి మహిళలు, ఆయా వ్యాధులతో బాధపడేవారికి ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ ముందస్తు ఏర్పాట్లు చేశామని సీఎం చంద్రబాబు వివరించారు.
లబ్ధిదారులు పింఛన్ సొమ్మును సద్వినియోగం చేసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో బటన్ నొక్కుతున్నాననంటూ ఏపీని జగన్ అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో రాష్ట్రాభివృద్ధిని గాడిలో పెట్టేందుకు నిర్విరామంగా పనిచేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.
ప్రజా ప్రయోజనాలు, రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం నినాదాలతో ముందుకు సాగుతున్నామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రాధాన్యతాక్రమంలో సమస్యలను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు.
జగన్ హయాంలో పెన్షన్లు పెంచుతామని పెంచలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాలను వెంటనే అమలు చేస్తున్నామని ఉద్ఘాటించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏప్రిల్, మే, జూన్ నెలల పింఛన్లు కూడా కలిపి జూలై మొదటి తేదీనే అందజేశామని తెలిపారు.
ఎన్ని ఇబ్బందులు, కష్టాలు ఎదురైనా క్రమం తప్పకుండా ఫించన్లు అందజేస్తున్నామని తెలిపారు. పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు.
గత ఐదేళ్లలో భూ మాఫియా, గంజాయి మాఫియా పేట్రేగిపోయాయని.. వాటికి అడ్డుకట్టవేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
ఇక నుంచి ఎవరైనా భూ కబ్జాలు, గంజాయి పెంపకం, అమ్మకాలకు పాల్పడితే తాట తీస్తామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.
రాష్ట్రంలో భూ మాఫియా, గంజాయి మాఫియా లేకుండా చేస్తామని... అక్రమార్కుల భరతం పడతానని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.
ఇప్పటికే ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేశామని.. ప్రజల భూములు కాపాడేందుకు యాంటీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు.
Updated Date - Dec 02 , 2024 | 02:15 PM