Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదం.. అందరిచూపు ఆ కంపెనీపైనే
ABN , Publish Date - Sep 20 , 2024 | 06:08 PM
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడి సన్నిధిలో తయారు చేసే లడ్డూలు ఎంత ప్రత్యేకమో మనందరికీ తెలిసిందే. లడ్డూ తయారీకి వాడే భిన్నమైన ప్రక్రియే వాటికి అంత రుచి వచ్చేలా చేస్తాయి.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడి సన్నిధిలో తయారు చేసే లడ్డూలు ఎంత ప్రత్యేకమో మనందరికీ తెలిసిందే. లడ్డూ తయారీకి వాడే భిన్నమైన ప్రక్రియే వాటికి అంత రుచి వచ్చేలా చేస్తాయి. లడ్డూలను తిరుమల ఆలయ వంటగదిలో తయారు చేస్తారు. దీనిని పోటు అంటారు.
లడ్డూ తయారీ కోసం టీటీడీ బోర్డు నెలకు 42 వేల కిలోల నెయ్యి, 22 వేల 500 కిలోల జీడిపప్పు, 15 వేల 000 కిలోల ఎండుద్రాక్ష, 6వేల కిలోల యాలకులు, శనగపిండి, చక్కెర తదితర పదార్థాలను కొనుగోలు చేస్తుంది. టీటీడీకి లడ్డూల అమ్మకం ద్వారానే ఏటా దాదాపు రూ.500 కోట్లకుపైగా ఆదాయం వస్తుందని అంచనా.
అయితే ఈ లడ్డూల చుట్టే ఇప్పుడు వివాదం అల్లుకుంది. వీటి తయారీకి వాడిన నెయ్యిని అపవిత్రం చేశారని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి.
వైసీపీ రాకముందు తిరుమల లడ్డూల తయారీకి కర్ణాటక నుంచి సరఫరా అయ్యే నందినీ నెయ్యిని వాడేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక నందినీ నెయ్యి వాడకాన్ని ఆపేసింది. తిరుపతి లడ్డూలకు వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు గుజరాత్‌కు చెందిన ఓ ల్యాబ్ పరిశోధనల్లో తేలింది.
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యి వివాదంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఏఆర్ డెయిరీ. ఈ కంపెనీ అత్యధికంగా టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తోంది. ఈ కంపెనీ టెండర్లు, రివర్స్ టెండర్లు వేసి .. అతి తక్కువ ధరలకు కాంట్రాక్టులను దక్కించుకుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వైసీపీ అధికారంలోకి వచ్చాక టీటీడీలోనూ రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేశారు. దీంతో ఏళ్ల తరబడి నెయ్యి సరఫరా చేస్తున్న కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌కు చెందిన నందిని బ్రాండ్.. నెయ్యిని తక్కువకు ఇవ్వలేమని చెప్పింది. అలా టెండర్లలో ఒక ధర కోట్ చేస్తే, రివర్స్ టెండర్లలో మరింత తక్కువకు కోట్ చేసి టెండర్లను దక్కించుకున్నట్లు తేలింది.
ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన టెండర్లలో కేజీ నెయ్యి రూ. 610 కిగానూ.. రివర్స్ టెండర్లలో రూ. 424కి మాత్రమే సరఫరా చేస్తామని ఏఆర్ డెయిరీ అంగీకరించింది. అంటే కేజీకి రూ.190కిపైగా తగ్గింపు ఇచ్చి టెండర్లు పొందిందనమాట.
2022లోనూ ఇలాగే చేసింది. టెండర్లలో రూ. 414 కు కోట్ చేసి.. రివర్స్ టెండర్లలో రూ. 337 కు కోట్ చేసి దక్కించుకున్నట్లు రికార్డుల్లో ఉంది. దీంతో ఏఆర్ డెయిరీ చుట్టూ వివాదం అల్లుకుంటోది. నెయ్యిని అపవిత్రం చేయడంలో ఏఆర్ డెయిరీ ప్రమేయం ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Updated Date - Sep 20 , 2024 | 07:35 PM