Share News

KKR: కంటతడి పెట్టిస్తోంది.. రిటెయిన్ లిస్ట్‌లో పేరు లేకపోవడంపై కోల్‌కతా స్టార్ ప్లేయర్ భావోద్వేగం

ABN , Publish Date - Nov 03 , 2024 | 12:14 PM

2021 నుంచి టీమ్‌తోనే కొనసాగిన తనను రిటెయిన్ చేసుకోకపోవడంపై కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్ భావోద్వేగానికి గురయ్యాడు.

KKR: కంటతడి పెట్టిస్తోంది.. రిటెయిన్ లిస్ట్‌లో పేరు లేకపోవడంపై కోల్‌కతా స్టార్ ప్లేయర్ భావోద్వేగం
Venkatesh Iyer

మెగా వేలానికి ముందు ఐపీఎల్ ఫ్రాంచైజీలన్నీ తమ రిటెయిన్ ఆటగాళ్ల జాబితాను ఇటీవలే ప్రకటించాయి. అయితే అన్ని జట్లతో పోల్చితే డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైంది. ఎందుకంటే ట్రోఫీ సాధించిన పెట్టిన ఆటగాళ్లలో కొందరిని అనివార్యంగా వదులుకోవాల్సి వచ్చింది. రిటెయిన్ చేసుకునే ఆటగాళ్ల సంఖ్యపై పరిమితి ఉండడంతో ముఖ్యమైన ప్లేయర్లను కూడా కోల్‌కతా యాజమాన్యం వదులుకోవాల్సి వచ్చింది. అవకాశం ఉన్న ఆరుగురు ఆటగాళ్లను నిలబెట్టుకోగా.. మిచెల్ స్టార్క్, వెంకటేష్ అయ్యర్ వంటి ముఖ్యమైన ఆటగాళ్లను సైతం వదులుకోవాల్సి వచ్చింది. దీంతో 2021 నుంచి టీమ్‌తోనే కొనసాగిన తనను రిటెయిన్ చేసుకోకపోవడంపై ఆ జట్టు స్టార్ ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్ భావోద్వేగానికి గురయ్యాడు.


రిటెన్షన్‌లో తన పేరు లేకపోవడంతో కన్నీళ్లు వచ్చాయని వెంకటేశ్ అయ్యర్ భావోద్వేగ వ్యాఖ్యలు చేశాడు. ‘‘కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఒక పరిపూర్ణమైన కుటుంబం. నేను చెప్పేది 16 లేదా 20 మంది ఆటగాళ్ల గురించి కాదు. మేనేజ్‌మెంట్, సిబ్బంది, తెరవెనుక ఉన్న కుర్రాళ్లు.. ఇలా అందరూ ఒక కుటుంబం. దీని వెనుక చాలా భావోద్వేగం దాగి ఉంటుంది. రిటెన్షన్ లిస్ట్‌లో నా పేరు లేకపోవడంతో కొంచెం కన్నీళ్లు వచ్చాయి’’ అని వెంకటేష్ అయ్యర్ చెప్పారు. ఈ మేరకు ‘రెవ్‌స్పోర్ట్స్’తో మనసులో ఉన్న మాటలను పంచుకున్నాడు.


‘‘కోల్‌కతా జట్టు నన్ను మొదటిసారి నన్ను వేలంలో దక్కించుకున్నప్పుడు బిడ్డింగ్‌కు సంబంధించి వీడియో ప్రసారం లేదు. కాబట్టి ఈసారి వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నన్ను దక్కించుకుంటుందో లేదో అని చిన్నపిల్లాడిలా ఉత్సాహంగా కూర్చొని చూస్తాను. ఒకవేళ నన్ను దక్కించుకుంటే ఈ ప్రపంచం నాదేనని భావిస్తా’’ అని పేర్కొన్నాడు. కీలకమైన పరుగులు సాధించాడు. ఇక కోల్‌కతా రిటెయిన్ జాబితాపై స్పందిస్తూ చాలా బాగా రిటెయిన్ చేసుకున్నారని మెచ్చుకున్నాడు. దాదాపు బౌలింగ్ విషయంలో 14-16 ఓవర్లు, బ్యాటింగ్‌లో ఐదు స్థానాలను కవర్ చేశారని పేర్కొన్నాడు. తాను రిటెయిన్ లిస్టులో ఉండాలని కోరుకున్నానని, కేకేఆర్ తన ఎదుగుదలకు ఎంతో తోడ్పాటు అందించిందని, తాను కూడా ఆ జట్టు చేయాల్సినవన్నీ చేశానని పేర్కొన్నాడు. కాగా రిటెయిన్‌లో పేరు లేకపోయినప్పటికీ జట్టులోకి తిరిగి వెళ్లే అవకాశాలు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశాడు.


కాగా కోల్‌కతా జట్టు సునీల్ నరైన్, ఆండ్ర్యూ రస్సెల్, రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తి, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణాలను మాత్రమే రిటెయిన్ చేసుకుంది. కాగా గత నాలుగు ఐపీఎల్ సీజన్లలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకి వెంకటేష్ అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. 2021లో జట్టు ఫైనల్‌కు చేరుకోవడం, ఆ తర్వాత 2024లో కప్‌ ముద్దాడడంలో వెంకటేశ్ తనవంతు సహకారం అందించాడు. ఐపీఎల్ 2024 రెండవ అర్ధభాగంలో 4 అర్ధసెంచరీలు బాదాడు. 158.80 స్ట్రైక్ రేట్‌తో మొత్తం370 పరుగులు సాధించాడు.

Updated Date - Nov 03 , 2024 | 12:17 PM