Share News

చౌక ధరల దుకాణాలకు చేరని బియ్యం

ABN , Publish Date - Dec 08 , 2024 | 11:09 PM

రేషన్‌ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్న ఉచిత బియ్యం ఇంతవరకు లబ్ధిదారులకు అందలేదు. ప్రతీ నెల 1 నుంచి 15వ తేదీ లోపు ఆహార భద్రత కార్డులున్న లబ్ధిదారులకు రేషన్‌ బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. ఇందుకు జిల్లాలోని ఎంఎల్‌ఎస్‌ (మండల లెవల్‌ స్టాకిస్ట్‌) పాయింట్ల నుంచి ప్రతీ నెల 25వ తేదీలోపు బియ్యం రేషన్‌ షాపులకు చేరాల్సి ఉంటుంది.

చౌక ధరల దుకాణాలకు చేరని బియ్యం

మంచిర్యాల, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): రేషన్‌ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్న ఉచిత బియ్యం ఇంతవరకు లబ్ధిదారులకు అందలేదు. ప్రతీ నెల 1 నుంచి 15వ తేదీ లోపు ఆహార భద్రత కార్డులున్న లబ్ధిదారులకు రేషన్‌ బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. ఇందుకు జిల్లాలోని ఎంఎల్‌ఎస్‌ (మండల లెవల్‌ స్టాకిస్ట్‌) పాయింట్ల నుంచి ప్రతీ నెల 25వ తేదీలోపు బియ్యం రేషన్‌ షాపులకు చేరాల్సి ఉంటుంది. ఎంఎల్‌ ఎస్‌ పాయింట్లలో స్టాక్‌ లేని కారణంగా డిసెంబరు కోటా విడుదల కాలేదు. దీంతో ప్రత్యామ్నాయంగా సివిల్‌ సప్లయిస్‌ అధికారులు పొరుగు జిల్లాల నుంచి తెప్పించే ప్రయత్నం చేస్తున్నా స్టాక్‌ పూర్తిస్థాయిలో రావడం లేదు. దీంతో ఎంఎల్‌ఎస్‌ పాయింట్లు ఖాళీగా దర్శనమిస్తుండగా, రేషన్‌ షాపుల చుట్టూ లబ్ధిదారులు ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

అరకొరగా పంపిణీ...

స్టేజ్‌-1 కాంట్రాక్టర్‌ నుంచే స్టాక్‌ విడుదల కాకపోవ డంతో ఇతర జిల్లాల నుంచి తెప్పించిన బియ్యాన్ని షాపుల వారీగా అరకొరగా పంపిణీ చేస్తున్నారు. దీంతో బియ్యం కొందరికే అందుతున్నాయి. మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, కోటపల్లి, లక్షెట్టిపేటలో ఎంఎల్‌ఎస్‌ పాయింట్లు ఉన్నాయి. వాటి పరిధిలో మొత్తం 423 చౌకధరల దుకాణాలు ఉన్నాయి. జిల్లాలో 2 లక్షల పై చిలుకు రేషన్‌ కార్డుల ద్వారా బియ్యం పంపిణీ జరగాల్సి ఉంది. ప్రతీనెల లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు దాదాపు 8వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం అవసరం ఉంటుంది. డిసెంబరు కోటాకు సంబంధించి తొమ్మిది రోజులు గడిచిపోగా కేవలం 50 శాతం మాత్రమే స్టాక్‌ వచ్చినట్లు తెలుస్తోంది. రెండు మూడు ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల పరిధిలో అసలు సరుకే సరఫరా కాలేదని సమాచారం. లబ్ధిదారులకు సమాధానం చెప్పలేక డీలర్లు అవస్థలు పడుతున్నారు.

మిల్లుల నుంచే సరఫరా లేదా...?

రైస్‌మిల్లుల నుంచే బియ్యం సరఫరా లేని కారణంగా పేదలకు అందడం లేదని తెలుస్తోంది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని సివిల్‌ సప్లయి అధికారులు సీఎంఆర్‌ (కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) కోసం మిల్లులకు తరలిస్తారు. మిల్లింగ్‌ తరువాత బియ్యం నేరుగా స్టేజ్‌-1 కాంట్రాక్టర్‌కు అందుతుంది. అక్కడి నుంచి ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు చేరిన తరు వాత స్టేజ్‌-2 కాంట్రాక్టర్‌ ద్వారా చౌకధరల దుకాణాలకు చేరుతుంది. అయితే సీఎంఆర్‌ కోసం తీసుకున్న ధాన్యాన్ని సకాలంలో బియ్యంగా మార్చకపోవడంతో పాటు బయట మార్కెట్లో అమ్ముకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో మిల్లుల్లో ధాన్యం నిల్వలు లేక స్టేజ్‌-1 కాంట్రాక్టర్‌కు బియ్యం సరఫరా నిలిచిపోయినట్లు ప్రచా రం జరుగుతోంది. ఈ కారణంగా జిల్లాలో బియ్యం స్టాక్‌లేక ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. స్టాక్‌ విషయమై మంచిర్యాల ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌చార్జిని సంప్రదించగా డిసెంబరు కోటా కేవలం 50 శాతం మాత్రమే విడుదలైందని తెలిపారు. స్టాక్‌ రాకపోవడంతో మంచిర్యాల, మందమర్రి మండలాలకు బియ్యం సరఫరా చేయలేదని చెప్పారు.

పోర్టబుల్‌ రైస్‌తోనూ ఇబ్బందులు...

చౌకధరల దుకాణాలకు ఓ వైపు సక్రమంగా రేషన్‌ బియ్యం సరఫరా కాకపోగా, పోర్టబుల్‌ రైస్‌తో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పోర్టబుల్‌ సిస్టంతో ఒక రేషన్‌ షాపునకు చెందిన లబ్ధిదారు అందుబాటులో మరో షాపులో బియ్యం తీసుకునే వెసలుబాటు ఉంది. జిల్లాలోని అన్ని రేషన్‌ షాపుల్లో పోర్టబుల్‌ విధానం ద్వారా ప్రతీ నెల కనీసం 50 క్వింటాళ్ల వరకు డీలర్లు బియ్యం ఇస్తున్నారు. డిసెంబరులోనూ పాత స్టాక్‌ నుంచి వివిధ షాపుల్లో పోర్టబుల్‌ సిస్టంలో బయటి వారికి బియ్యం పంపిణీ జరిగింది. బియ్యం పంపిణీ జరుగకపోవడంతో ఆయా షాపుల పరిధిలోని అసలు లబ్ధిదారులకు ఇవ్వడానికి స్టాక్‌ లేకుండా పోయింది. ఇదిలా ఉండగా, పోర్టబుల్‌ రైస్‌ పంపిణీ చేసిన డీలర్లు 7 రోజుల్లోగా సరుకు సరిపడా రిక్వెస్ట్‌ పెట్టాలి. అప్పుడే పోర్టబుల్‌ కింద పోసిన బియ్యానికి సరిపడా స్టాకును పంపుతారు. డీలర్‌ రిక్వెస్ట్‌ పెట్టినప్పటికీ కోటా విడుదల కాకపోతే అసలు లబ్ధిదారులకు మొండి చేయి చూపాల్సి ఉంటుంది. పోర్టబుల్‌ సిస్టం కారణంగా లబ్ధిదారుల నుంచి డీలర్లు చీవాట్లు పడక తప్పడం లేదు.

Updated Date - Dec 08 , 2024 | 11:09 PM