వామ్మో చలి...!
ABN , Publish Date - Dec 12 , 2024 | 11:06 PM
జిల్లాలో రెండు రోజులుగా చలి విజృంభిస్తోంది. మూడు రోజుల నుంచి క్రమేపీ ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో మరింతగా చలి పెరుగుతుండటంతో ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటేనే ప్రజలు జంకుతు న్నారు. ముఖ్యంగా రాత్రుళ్లు ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి.
మంచిర్యాల, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రెండు రోజులుగా చలి విజృంభిస్తోంది. మూడు రోజుల నుంచి క్రమేపీ ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో మరింతగా చలి పెరుగుతుండటంతో ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటేనే ప్రజలు జంకుతు న్నారు. ముఖ్యంగా రాత్రుళ్లు ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతల్లో మార్పులు జరగడంతో వాతావరణం చల్లబడుతోంది. ఉదయం 9 గంటల వరకు కూడా చలి ప్రభావం ఉండటంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. సాయంత్రం 6 గంటల నుంచే చలి ప్రభావం కనిపిస్తోంది. శీతల గాలుల కారణంగా పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తర ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా చలి ప్రభావం అధికంగా ఉంటోంది.
ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు....
చలి తీవ్రత పెరగడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు, గ్రామ పంచా యతీ కార్యదర్శులు, ఉదయం షిఫ్ట్ వెళ్లే సింగరేణి కార్మికులు అవస్థలు పడుతున్నారు. పాఠశాలలకు వెళ్లే చిన్నారులపైనా చలి ప్రభావం అధికంగా ఉంటోంది. చలి కారణంగా సింగరేణిలో గైర్హాజరు శాతం క్రమంగా పెరుగుతోంది. పాలు, కూరగాయల వ్యాపారులు తెల్లవారుజామున ఐదు గంటలకే బయటకు వెళ్లాల్సి రావడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఉదయం 10 గంటల వరకు కూడా రోడ్లపైకి జనాలు వచ్చేందుకు సాహసించడం లేదు.
పొగమంచుతో ఇబ్బందులు....
చలికి తోడు పొగమంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లన్నీ మంచుతో కప్పబడి ఉండటంతో ఉదయం ఎనిమిది గంటలకు కూడా లైట్ల వెలుతురులో వాహనాలను నడపాల్సి వస్తోంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతుండటంతో ఆయా ఏరియాల్లో చలి తీవ్రత అధికంగా ఉంటోంది. ఉదయం ఎనిమిది గంటలు దాటితే తప్ప సూర్యుడు అగుపించడం లేదు.
జిల్లాలో 10.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు...
జిల్లాలో గురువారం 10.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జన్నారం మండలం తపాల్‌పూర్‌లో అత్యల్పంగా 10.8 డిగ్రీల ఉషోగ్రతలు నమోదుకాగా, జన్నారం మండల కేంద్రంలో 11.5, దండేపల్లి మండలం వెల్గనూర్‌లో 11.7, హాజీపూర్ మండలం ర్యాలీగడ్‌పూర్‌లో 11.8, హాజీపూర్, పాత మంచిర్యాల, కాసిపేట మండలం కొండాపూర్‌లో 12.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.