Bandi Sanjay : కాంగ్రెస్ న్యాయవాదులకు కంగ్రాట్స్
ABN, Publish Date - Aug 28 , 2024 | 06:01 AM
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల సమష్టి కృషి వల్లే బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ మద్యం కేసులో బెయిల్ వచ్చిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ సమష్టి కృషితోనే కవితకు బెయిల్
కేసీఆర్ రాజకీయ చతురతకు హాట్సాఫ్: బండి సంజయ్
హైదరాబాద్, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల సమష్టి కృషి వల్లే బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ మద్యం కేసులో బెయిల్ వచ్చిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. కవితకు బెయిల్ ఇప్పించడంలో విజయం సాధించినందుకు కంగ్రాట్స్ అంటూ కాంగ్రెస్, ఆ పార్టీ న్యాయవాదులను ఎద్దేవా చేశారు. మీ అవిశ్రాంత కృషి చివరికి ఫలించిందని విమర్శిస్తూ ఎక్స్‌లో మంగళవారం ఆయన ఓ పోస్ట్ పెట్టారు.
బీఆర్‌ఎస్ నేత బెయిల్‌పై బయటకు వచ్చారని, కాంగ్రెస్ నేత రాజ్యసభలోకి వెళుతున్నారని, కేసీఆర్ అద్భుతమైన రాజకీయ చతురతకు హాట్సాఫ్ అని పేర్కొన్నారు. బెయిల్ కోసం వాదించిన వ్యక్తికి బీఆర్‌ఎస్ పార్టీ మద్దతివ్వగా, కాంగ్రెస్ పార్టీ ఆ వ్యక్తిని రాజ్యసభకు నామినేట్ చేసిందని అన్నారు. ఈ క్విడ్ ప్రొ కో వ్యవహారంలో భాగస్వాములు అభినందనలు తెలిపారు. విలీనం మాటా, ముచ్చట పూర్తయ్యాయని, ఇక అప్పగింతలే మిగిలాయని ఎద్దేవా చేశారు.
కాగా, బండి సంజయ్ చేసిన ఈ పోస్ట్‌ను బీఆర్‌ఎస్ నేత కేటీఆర్, మాజీ ఎంపీ బొయినపల్లి వినోద్‌కుమార్ తీవ్రంగా తప్పుబట్టారు. అయితే, బీజేపీ నేతలు వారికి కౌంటరిచ్చారు. మాజీ మంత్రి కేటీఆర్ చదువుకున్న మూర్ఖుడంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజయ్ చేసిన పోస్ట్‌లో తప్పేముంది, కవితకు బెయిల్ ఇవ్వాలని వాదించిన వ్యక్తికి కాంగ్రెస్ రాజ్యసభ టిక్కెట్ ఇవ్వడం నిజం కాదా ? అని ప్రశ్నించారు. అలాగే, కేటీఆర్ చదువుకున్న అజ్ఞాని అని, వినోద్ కుమార్ స్వయం ప్రకటిత మేధావి అని బీజేపీ నేత, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ దుయ్యబట్టారు.
Updated Date - Aug 28 , 2024 | 06:01 AM