Bandi Sanjay: కాంగ్రెస్‌కు దమ్ముంటే.. ఫిరాయించిన ఎమ్మెల్యే స్థానాల్లో ఎన్నికలకు వెళ్లాలి
ABN, Publish Date - Jul 07 , 2024 | 04:20 AM
‘మీకు ప్రజాబలం ఉన్నట్లయితే ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్లండి. 26 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని చెప్పడం కాదు.
26 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని
చెప్పడం కాదు.. రాజీనామా చేయించి గెలిపించుకోండి
ఉప ఎన్నికలు జరిగితే అన్ని సీట్లూ బీజేపీకే
బీఆర్‌ఎస్ బాటలోనే కాంగ్రెస్.. ఇదేనా పాంచ్ న్యాయ్?
కేంద్ర మంత్రి పదవితో చేతులు కట్టేసినట్లయింది..
అయినా నా దూకుడు ఆగదు: బండి సంజయ్
వనపర్తి బీజేపీ నాయకుడు శ్రీధర్‌రెడ్డి హత్యపై ఐజీకి ఫోన్
హైదరాబాద్, జూలై 6(ఆంధ్రజ్యోతి): ‘మీకు ప్రజాబలం ఉన్నట్లయితే ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్లండి. 26 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని చెప్పడం కాదు. ధైర్యముంటే, వారందరితో రాజీనామా చేయించి గెలిపించుకోండి’ అని కాంగ్రెస్‌కు బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సవాల్ చేశారు. కేకేతో రాజీనామా సరే.. బీఆర్‌ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఎందుకు చేయించలేదు? అని నిలదీశారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలోని పాంచ్ న్యాయ్ ప్రకారం ఒక పార్టీ గుర్తుపై గెలిచిన నాయకుడు ఫిరాయింపునకు పాల్పడితే అనర్హత వేటు వేయాలని ఉందని.. మరి రాష్ట్రంలో చేస్తున్నది ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఒకవేళ ఉప ఎన్నికలు నిర్వహిస్తే అన్ని సీట్లను బీజేపీనే గెలుచుకుంటుందని.. తమ సీట్లు 34కు పెరిగి ప్రధాన ప్రతిపక్షం అవుతామని సంజయ్ పేర్కొన్నారు.
ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా చేరాలనుకుంటే రాజీనామా చేసి రావాలనేది బీజేపీ విధానమని, మునుగోడు, హుజూరాబాద్‌లో ఇలానే చేశామని వివరించారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంజయ్ మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. బీఆర్‌ఎస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందని ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేను చేర్చుకుంటోందని ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాలకు.. ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థుల ద్వారా అభివృద్ధి పనులు మంజూరు చేయిస్తున్నారని, ఇది ఎంతవరకు సమర్థనీయం? అని ప్రశ్నించారు. కేంద్రం కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలకే నిధులిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలని కాంగ్రెస్ నాయకులకు సంజయ్ సూచించారు. బీఆర్‌ఎ్‌సలాగే వ్యవహరిస్తే కాంగ్రెస్ వారి ఉద్యోగాలు గల్లంతు కావడం ఖాయమని హెచ్చరించారు.
ఎంఐఎం గోడ మీది పిల్లి..
వచ్చే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ, ఎంఐఎం మధ్యే పోటీ ఉండబోతోందని సంజయ్ అన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్.. ఎంఐఎం ఓట్ల కోసం పాకులాడుతాయని విమర్శించారు. ఎంఐఎం గోడ మీది పిల్లి.. ఏ పార్టీ అధికారంలో ఆ పార్టీ పంచన చేరుతుందని మండిపడ్డారు. జీహెచ్‌ఎంసీ సమావేశంలో ప్రజా సమస్యలపై బీజేపీ కార్పొరేటర్లు ప్రశ్నిస్తే.. మహిళలు అని కూడా చూడకుండా ఎంఐఎం కార్పొరేటర్లు దాడి చేయడం సిగ్గుచేటని విమర్శించారు. బీజేపీ కార్యకర్తలు తలచుకుంటే వారు మిగతా ప్రాంతాలకు వెళ్లగలరా? అని ప్రశ్నించారు. కుటుంబం వ్యాపారాలు కాపాడుకోవడానికి, ఆస్తులు సంపాదించుకోవడానికి సీఎం రేవంత్‌రెడ్డి వద్దకు వెళ్తున్నారు తప్ప, ప్రజా సమస్యలపై కార్పొరేటర్లను ఎప్పుడైనా తీసుకువెళ్లారా?అని ఒవైసీని నిలదీశారు.
ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న కాంగ్రెస్, ఏడు నెలల్లో ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వలేదని ఆరోపించారు. మిగతా 5 నెలల్లో ఇవ్వడం సాధ్యమా? అని సంజయ్ ప్రశ్నించారు. విభజనచట్టంలోని అంశాలపై తెలుగు రాష్ట్రాల సీఎంలు సమావేశం కావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కానీ.. గతంలో మాదిరిగా చేపల పులుసు, రొయ్యల వేపుడు పేరుతో తెలంగాణకు అన్యాయం జరిగే నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. కొంతమంది గోతికాడ నక్కలా సీఎంల భేటీని అడ్డం పెట్టుకుని సెంటిమెంట్ రెచ్చగొట్టి లబ్ధిపొందాలని చూస్తున్నారని, ఆ అవకాశం ఇవ్వొద్దని కోరారు. కేంద్రమంత్రి పదవితో చేతులు కట్టేసినట్లు అయిందని.. అయినా తన దూకుడు తగ్గదని సంజయ్ సరదాగా వ్యాఖ్యానించారు.
50రోజులైనా నిందితుల్ని అరెస్ట్‌చేయలేదేం?
వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపూర్ గ్రామ బీజేపీ సీనియర్ నేత శ్రీధర్ రెడ్డి హత్య జరిగి 50 రోజులు కావొస్తున్నా నిందితులను అరెస్ట్ చేయకపోవడం పట్ల బండి సంజయ్ అసహనం వ్యక్తం చేశారు. తక్షణం నిందితులను పట్టుకోవడంతో పాటు తగిన చర్యలు తీసుకోవాలని ఐజీ సుధీర్‌ను ఆదేశించారు. శ్రీధర్‌రెడ్డి తండ్రి బొడ్డు శేఖర్‌రెడ్డి కుటుంబ సభ్యులు సహా పలువురు బీజేపీ నాయకులు శనివారం రాష్ట్ర కార్యాలయంలో సంజయ్‌ని కలిసి వినతిపత్రం అందజేశారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా, అసలైన నిందితులను వదిలేసి తమ సన్నిహితులను పిలిచి హింసిస్తూ కేసును పక్కదారి పట్టిస్తున్నారని శేఖర్‌రెడ్డి వాపోయారు. వెంటనే స్పందించిన సంజయ్ ఐజీకి ఫోన్ చేశారు. నిందితులను అరెస్ట్ చేయకపోవడానికి కారణాలను తెలుసుకున్నారు.
Updated Date - Jul 07 , 2024 | 04:21 AM