ప్రలోభాలపైనే బీజేపీ, కాంగ్రెస్ ఆశలు : హరీశ్
ABN , Publish Date - May 12 , 2024 | 05:43 AM
ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడంపైనే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆశలు పెట్టుకున్నాయని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. డబ్బు, మద్యం పంపిణీ చేసి ఈ
సిద్దిపేట/గజ్వేల్, మే 11 (ఆంధ్రజ్యోతి): ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడంపైనే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆశలు పెట్టుకున్నాయని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. డబ్బు, మద్యం పంపిణీ చేసి ఈ ఎన్నికల్లో గెలిచేలా ఆ పార్టీలు అడ్డదారులు తొక్కుతున్నాయన్నారు. అందుకే సీ-విజిల్ యాప్ ద్వారా బీఆర్‌ఎస్ కార్యకర్తలు, ప్రజలు పోలీసులకు, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. శనివారం ఆయన సిద్దిపేటలో విలేకరుల సమావేశంలో, గజ్వేల్ పట్టణంలో నిర్వహించిన రోడ్‌షోలో మాట్లాడారు. సిద్దిపేటలో జరిగిన బీజేపీ అగ్రనేత అమిత్‌షా సభకు జనం రాకపోవడంతో కేవలం 7 నిమిషాల్లోనే తిరిగి వెళ్లిపోయారన్నారు. తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ సరూర్‌నగర్‌లో 3 పార్లమెంటు నియోజకవర్గాల సభ నిర్వహిస్తే 3 వేల మంది కూడా రాలేదని, ఆయన కూడా 10 నిమిషాల్లోనే తిరిగి వెళ్లారన్నారు. కేంద్రంలో పదేళ్ల బీజేపీ పాలన, రాష్ట్రంలో ఐదునెలల కాంగ్రెస్ పాలన వైఫల్యాలను చూసి ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని చెప్పారు. కేసీఆర్ చేపట్టిన సభలు, రోడ్‌షోలు నాటి ఉద్యమ సందర్భాలను గుర్తుచేశాయని, ప్రతీచోటా ఇసుకేస్తే రాలనంతగా ప్రజలు వచ్చారని తెలిపారు. ముఖ్యంగా తమ పదేళ్ల పాలనా కాలంలో పుట్లకొద్ది వడ్లు పండించిన రైతులు నేడు పుట్టెడు కష్టాల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాదిగ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదని, మైనార్టీలకు వారి క్యాబినెట్‌లో మంత్రిగా స్థానం కల్పించలేదని విమర్శించారు.