Share News

KTR: కవితక్క త్వరలో వస్తది... జగిత్యాలలో తిరుగుతది: కేటీఆర్‌

ABN , Publish Date - Jul 02 , 2024 | 04:44 AM

ఫిరాయింపులకు పాల్పడ్డ ప్రజా ప్రతినిధులను డిస్‌క్వాలిఫై చేయాలని రాహుల్‌ గాంధీ, పార్టీలు మారే ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలని ఇదే సీఎం రేవంత్‌ రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు అన్నారని కానీ, ఇప్పుడు తమ ఎమ్మెల్యేలను కాంగ్రె్‌సలోకి ఎలా చేర్చుకుంటున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు.

KTR: కవితక్క త్వరలో వస్తది... జగిత్యాలలో తిరుగుతది: కేటీఆర్‌

  • ఫిరాయింపులను ప్రోత్సహించలే

  • మేం టీడీపీ, బీఎస్పీ శాసనసభా పక్షాలను విలీనం చేసుకున్నాం: కేటీఆర్‌

జగిత్యాల, హైదరాబాద్‌, జూలై 1 (ఆంధ్రజ్యోతి): ఫిరాయింపులకు పాల్పడ్డ ప్రజా ప్రతినిధులను డిస్‌క్వాలిఫై చేయాలని రాహుల్‌ గాంధీ, పార్టీలు మారే ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలని ఇదే సీఎం రేవంత్‌ రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు అన్నారని కానీ, ఇప్పుడు తమ ఎమ్మెల్యేలను కాంగ్రె్‌సలోకి ఎలా చేర్చుకుంటున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. ఇప్పటివరకు ఆరుగురు ఎమ్మెల్యేలను చేర్చుకున్న కాంగ్రెస్‌ పార్టీని, రేవంత్‌ను కూడా రాళ్లతో కొట్టాలా? లేదా? అనేది ప్రజలు నిర్ణయించుకోవాలని సూచించారు. పార్టీ ఫిరాయింపులను ధైర్యంగా ప్రశ్నించడంతో పాటు ఢిల్లీకి తన వాణిని వినిపించింది ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఒక్కరే అని తెలిపారు. జగిత్యాలలో సోమవారం జరిగిన జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో కేటీఆర్‌ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు.


దేశంలో ఆయారాం, గయారాం సంస్కృతికి బీజం వేసింది కాంగ్రెస్‌, ఇందిరా గాంధీయేనని విమర్శించారు. ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ ఇటీవల బీఆర్‌ఎ్‌సను వీడి కాంగ్రె్‌సలో చేరడంపై ఆయన మాట్లాడుతూ.. సంజయ్‌ బీఆర్‌ఎ్‌సకు గడ్డిపోచతో సమానమన్నారు. గతంలో 2014లో సంపూర్ణమైన మెజార్టీతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు రూ.50 లక్షలతో అడ్డంగా దొరికిపోయి, జైలుకు వెళ్లిన దొంగ రేవంత్‌ రెడ్డి అని విమర్శించారు. గతంలో తమ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించలేదని, టీడీఎల్పీ, బీఎస్పీఎల్పీలు విలీనం అయ్యాయని, ఒక్కొక్కరిని పార్టీలోకి తీసుకోలేదని చెప్పారు.


‘‘పెద్దలు ఎప్పుడూ ఒకటి చెబుతుంటారు... రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలే ఉంటాయని. మీ జగిత్యాల ఎమ్మెల్యే ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన చావనీ... మనం దైర్యంగా నిలబడుదాం.... స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు అండగా మేమంతా ఉంటాం... కవితక్క కూడా వస్తది... తప్పకుండా తిరుగది... మీకందరికీ అండగా ఉంటది... ఎట్లనయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేను గెలిపించామో... అంతకంటే డబుల్‌ కష్టం చేద్దాం’ అంటూ జైలులో ఉన్న కవిత త్వరలోనే వస్తదన్న సంకేతాన్ని ఇచ్చే విధంగా కేటీఆర్‌ మాట్లాడారు. నిన్నటి వరకు మేడిగడ్డ మేడిపండులాంటిది.. మరమ్మతులు చేసినా పనికిరాదు.. రూ.లక్ష కోట్లు బూడిదలో పోసిన పన్నీరని విమర్శించి, ఇప్పుడు మరమ్మతులు పూర్తి చేశామని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారని, దీనిప్రకారం.. ఇంతకాలం కాంగ్రెస్‌ చేసింది.. విష ప్రచారమేనని తేలిపోయిందని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. .


నిరసన తెలిపే హక్కులేదా?: కేటీఆర్‌

ప్రజాపాలనలో నిరసన తెలిపే హక్కు కూడా లేదా? డిమాండ్ల పరిష్కారానికి ఆందోళన చేస్తున్న నిరుద్యోగులపై లాఠీచార్జి చేసిన పోలీసుల తీరు బాగోలేదని కేటీఆర్‌ పేర్కొన్నారు. నిరుద్యోగుల పక్షాన దీక్ష చేస్తున్న మోతీలాల్‌ పరామర్శించేందుకు వెళ్లిన బీఆర్‌ఎస్‌ నేతలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, గెల్లుశ్రీనివాస్‌ యాదవ్‌, రాకేశ్‌ రెడ్డి సహా పలువురిని అరెస్టు చేయడం తగదని అన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని నేడొక ప్రకటనలో కేటీఆర్‌ హెచ్చరించారు.


ఫాక్స్‌కాన్‌ తెచ్చింది కేటీఆర్‌ : బీఆర్‌ఎస్‌

రాష్ట్రానికి ఫాక్స్‌కాన్‌ సంస్థను తెచ్చింది మాజీ మంత్రి కేటీఆర్‌ అయితే., దాన్ని మరచిపోయే.. సీఎం రేవంత్‌రెడ్డి వల్లే ఆ సంస్థ వచ్చిందని.. రాష్ట్రంలో ఏం జరిగినా.. అన్నీ ఆయనే చేశారంటూ కాంగ్రెస్‌ గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని బీఆర్‌ఎస్‌ నేత మన్నె క్రిశాంక్‌ పేర్కొన్నారు. ఎంపీగా ఉన్న సమయంలో కంటోన్మెంట్‌ బోర్డు సమావేశానికి హాజరుకాని రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు తన వల్లే జీహెచ్‌ఎంసీలో విలీనమైందని చెప్పుకోవడం విచిత్రంగా ఉందన్నారు.

Updated Date - Jul 02 , 2024 | 04:44 AM