Kishan Reddy: తెలంగాణకు కరెంటు వద్దా?
ABN, Publish Date - Jul 29 , 2024 | 03:58 AM
రామగుండం మెగా పవర్ ప్లాంట్ల పీపీఏపై ఎన్టీపీసీ ఎన్నిసార్లు లేఖలు రాసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తుపై రాష్ట్రానికే తొలి హక్కు ఉంటుందని, అయితే, రాష్ట్ర ప్రభుత్వ అలసత్వంతో ఈ కరెంటు ఇతర రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి తలెత్తవచ్చని హెచ్చరించారు.
ఎన్టీపీసీ నాలుగు సార్లు లేఖలు
రాసినా ఎందుకు స్పందించరు?
మీ అలసత్వంతో 2,400 మెగావాట్ల
విద్యుత్ ఇతర రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి
సర్కారుపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శ
రామగుండం ఎన్టీపీసీ-2 ప్రాజెక్టు
పీపీఏకు ముందుకు రావటం లేదని వెల్లడి
కేంద్రం సహకరిస్తున్నా పట్టించుకోవటం లేదని ఆరోపణ
న్యూఢిల్లీ, జూలై 28 (ఆంధ్రజ్యోతి): రామగుండం మెగా పవర్ ప్లాంట్ల పీపీఏపై ఎన్టీపీసీ ఎన్నిసార్లు లేఖలు రాసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తుపై రాష్ట్రానికే తొలి హక్కు ఉంటుందని, అయితే, రాష్ట్ర ప్రభుత్వ అలసత్వంతో ఈ కరెంటు ఇతర రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి తలెత్తవచ్చని హెచ్చరించారు. తెలంగాణకు విద్యుత్ అవసరం లేదా? అని ప్రశ్నించారు. ఈ మేరకు కిషన్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్లను ఏర్పాటుచేసి 4 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి చేపట్టే ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపిన విషయాన్ని కేంద్రమంత్రి గుర్తు చేశారు.
మొదటి విడతగా 800 మెగావాట్ల సామర్థ్యం గల 2 పవర్ ప్లాంట్లను ఎన్టీపీసీ ఆధ్వర్యంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు వివరించారు. రూ.10,598.98 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ రెండు పవర్ ప్రాజెక్టుల్లో, మొదటి 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను గతేడాది అక్టోబరు 3న, రెండో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను ఈ ఏడాది మార్చి 4న ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారని పేర్కొన్నారు. ఈ 1600 మెగావాట్ల ప్రాజెక్ట్‌లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌లో 85 శాతం తెలంగాణ అవసరాలకే వినియోగిస్తున్నారని తెలిపారు. మిగిలిన 2400 మెగావాట్ల ప్రాజెక్టును సైతం త్వరగా పూర్తి చేయాలని కేంద్ర భావిస్తోందని, దీనికోసం ఎన్టీపీసీతో తెలంగాణ ట్రాన్స్‌కో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుందన్నారు.
ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్టీపీసీ గతేడాది అక్టోబరు 5న, ఈ ఏడాది జనవరి 9, జనవరి 29, ఏప్రిల్ 29 తేదీల్లో నాలుగు లేఖలు రాసినట్టు వివరించారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదన్నారు. దీంతో రామగుండం ఎస్టీపీసీ-2 ప్రాజెక్టు నుంచి విద్యుత్ కొనుగోలు చేసే ఆసక్తి తెలంగాణ ప్రభుత్వానికి లేదని తాము భావించాల్సి వస్తుందని, అటువంటి సందర్భంలో, ఆ ప్రాజెక్టు నుంచి ఉత్పత్తి అయ్యే కరెంటును దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలకు విక్రయించేందుకు అనుమతి ఉంటుందని కూడా ఎన్టీపీసీ తన లేఖల్లో స్పష్టం చేసిందని కిషన్‌రెడ్డి వెల్లడించారు.
తెలంగాణలో 2030 నాటికి విద్యుత్ డిమాండ్ రెట్టింపు కాబోతున్నదని, రాష్ట్ర ప్రభుత్వం దీనిని దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. తెలంగాణలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌పై తొలి హక్కు తెలంగాణ ప్రజలదేనన్నారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా కరెంటు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. దీంట్లో భాగంగానే తెలంగాణలో కూడా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని భావిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదన్నారు.
Updated Date - Jul 29 , 2024 | 03:58 AM