CM Revanth Reddy: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలూ.. ఆత్మప్రబోధానుసారం నడుచుకోండి..
ABN, Publish Date - Jun 06 , 2024 | 03:12 AM
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. బీజేపీతో బేరసారాలు చేసుకుంటున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికైనా అలోచించి.. ఆత్మప్రభోధానుసారం నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. బీఆర్‌ఎస్ నేతలు ఆత్మబలిదానం చేసుకుని.. అవయవదానం చేసి బీజేపీ అభ్యర్థులను గెలిపించారని అన్నారు.
బీజేపీతో కేసీఆర్ బేరసారాలు.. మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఓట్లు బదలాయించారు
అందుకే బీజేపీ గెలిచిన ఏడు స్థానాల్లో
బీఆర్‌ఎస్ అభ్యర్థులకు డిపాజిట్లు దక్కలేదు
కేసీఆర్ ఉన్నంతకాలం కుట్రలు, కుతంత్రాలు
ఎన్నికల ఫలితాలను ఉగాది పచ్చడిలా స్వీకరిస్తా
ఏపీతో సమస్యల్ని పరిష్కరించుకుంటాం
మోదీని ప్రజలు తిరస్కరించారు.. ఆయన మళ్లీ
ప్రధాని పదవి చేపట్టకూడదు: సీఎం రేవంత్
డిసెంబరు 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
సోనియాగాంధీని ఆహ్వానిస్తాం: సీఎం
ఇక ఏటా ఆ రోజున తెలంగాణ తల్లి ఉత్సవం
హైదరాబాద్, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. బీజేపీతో బేరసారాలు చేసుకుంటున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికైనా అలోచించి.. ఆత్మప్రభోధానుసారం నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. బీఆర్‌ఎస్ నేతలు ఆత్మబలిదానం చేసుకుని.. అవయవదానం చేసి బీజేపీ అభ్యర్థులను గెలిపించారని అన్నారు. బీజేపీ గెలిచిన 8 సీట్లకుగాను ఏడు సీట్లలో బీఆర్‌ఎస్ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. బుధవారం సీఎం రేవంత్ తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల బరిలో కేసీఆర్ బలహీన అభ్యర్థులను నిలిపి.. బీఆర్‌ఎస్ శ్రేణులను బీజేపీ కోసం పని చేయిస్తున్నారని తాను ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పుడే చెప్పానని గుర్తు చేశారు. సిద్దిపేట అసెంబ్లీ సెగ్మెంట్‌లో బీఆర్‌ఎ్‌సకు వచ్చిన ఓట్లను చూస్తేనే అది అర్థమవుతుందన్నారు. కేసీఆర్ 2001లో టీడీపీకి రాజీనామా చేసి.. పోటీ చేసిన దగ్గర్నుంచి 2023 అసెంబ్లీ ఎన్నికల వరకూ సిద్దిపేటలో బీఆర్‌ఎ్‌సకు ఏనాడూ 30 వేల కన్నా తక్కువ మెజారిటీ రాలేదని రేవంత్ పేర్కొన్నారు. లక్ష ఓట్ల మెజారిటీ వచ్చిన సందర్భం కూడా ఉందన్నారు. కానీ, తాజా లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ బీఆర్‌ఎస్ అభ్యర్థికి సిద్దిపేట సెగ్మెంట్‌లో కేవలం 2500 ఓట్ల మెజారిటీ మాత్రమే వచ్చిందని తెలిపారు. సిద్దిపేటలో వెంకట్రామిరెడ్డికి 65 వేల ఓట్లు వస్తే.. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు 62,500 ఓట్ల వరకు వచ్చాయని పేర్కొన్నారు.
సిద్దిపేట సెగ్మెంట్ వల్లే ఓడాం..
హరీశ్‌రావు నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ అభ్యర్థికి మెజారిటీ తగ్గడం వల్లే మెదక్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ ఓటమిపాలైందని రేవంత్ అన్నారు. సిద్దిపేటలో బీఆర్‌ఎస్.. వారి ఓట్లను బీజేపీ అభ్యర్థికి బదిలీ చేయడం ద్వారా బలహీన వర్గానికి చెందిన కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ పార్టీని నమ్ముకున్న వెంకట్రామిరెడ్డిని కూడా మోసం చేశారని అన్నారు. 2003 అసెంబ్లీ ఎన్నికల్లో 37.5 శాతం ఓట్లు తెచ్చుకున్న బీఆర్‌ఎస్.. ఈ లోక్‌సభ ఎన్నికల్లో 16.5 శాతానికి పడిపోయిందని, దాదాపు 22 శాతం ఓట్లను బీజేపీకి బదిలీ చేసిందని అన్నారు. దీంతో.. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 13 శాతం ఓట్లు సాధించిన బీజేపీకి లోక్‌సభ ఎన్నికల్లో ఎనిమిది సీట్లు వచ్చాయన్నారు. 39 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకున్న బీఆర్‌ఎ్‌సకు.. ఈ ఎన్నికల్లో సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక అసెంబ్లీ సెగ్మెంట్లలో మాత్రమే మెజారిటీ దక్కిందని తెలిపారు. బీఆర్‌ఎస్ పుట్టినప్పటి నుంచి ఆ పార్టీకి పార్లమెంటులో ప్రాతినిధ్యం లేకపోవడం ఇదే మొదటిసారి అని రేవంత్ గుర్తు చేశారు. ఆ పార్టీ నేతలు, ఎమ్మెల్యేల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ బీజేపీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. ‘‘ఫీనిక్స్ పక్షిలా బూడిద నుంచి మళ్లీ పుడతామని కేటీఆర్ అంటున్నారు. కానీ, బూడిద నుంచి మళ్లీ పుట్టేదేమీ లేదు. ఆ బూడిదను తీసుకెళ్లి వాళ్ల నాయన కేసీఆర్‌కు, బావ హరీశ్‌రావు ముఖాలకు పూస్తే కథ సుఖాంతమవుతది’’ అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. ఆరు నెలల కాంగ్రెస్ ప్రభుత్వంపై, పార్టీ నాయకత్వంపై బీఆర్‌ఎస్ వాళ్లు ఎన్నెన్నో ఆరోపణలు చేశారని, చివరికి ప్రజలు ఈ ఎన్నికల్లో వారికి గుండు సున్నా ఇచ్చారని ఎద్దేవా చేశారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టాలనే కుట్రతో వ్యవహరిస్తే ప్రజలు పూర్తిగా తిరస్కరిస్తారనే దానికి ఇది నిదర్శనమన్నారు. ‘‘ప్రధాన ప్రతిపక్షనేత అయి ఉండి.. రాష్ట్ర అవతరణ దినోత్సవంలో పాల్గొకుండా ప్రజాస్వామిక వ్యవస్థను కేసీఆర్ అవమానిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నరు. ఇప్పటికైనా వారి వ్యవహార శైలి మార్చుకోవాలి. ప్రతిపక్షంగా సలహాలు, సూచనలు ఇచ్చి ప్రజా సమస్యల పరిష్కారానికి సహకరించాలి’’ అని రేవంత్ సూచించారు.
కేసీఆర్ రాజకీయ జూదగాడు..
కేసీఆర్ ఒక రాజకీయ జూదగాడు అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. రాజకీయ ముఖచిత్రంపై కేసీఆర్ ఉన్నంతకాలం కుట్రలు, కుతంత్రాలు కొనసాగుతూనే ఉంటాయన్నారు. అయితే మహారాష్ట్రలో ఈ కుట్రలు, కుతంత్రాలతోనే శివసేన, ఎన్సీపీలను చీల్చిన మోదీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాననుకున్నారని, కానీ.. లోక్‌సభ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ప్రజల తిరస్కారానికి గురయ్యారన్నారు. తెలంగాణలోనూ మోదీ ఇదే రకమైన ప్రయోగం చేస్తారా లేదా అన్నది చూడాలన్నారు. ‘‘ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడు కేసీఆర్, ఆయన కుటుంబమని ఆరోపణలు చేసిన బీజేపీ.. వారితో ఎలా జట్టు కడుతుందన్నదీ ఆ పార్టీ నేతలు ప్రజలకు చెప్పాలి. వీటన్నింటినీ విశ్లేషించడానికి సమయం పడుతుంది’’ అని రేవంత్ అన్నారు. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలను ఉగాది పచ్చడిలా స్వీకరిస్తానన్నారు. పార్టీకి సంతోషకరమైన ఫలితాలు వచ్చినట్లుగానే భావిస్తున్నామని చెప్పారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రె్‌సకు 39.5 శాతం ఓట్లు వచ్చాయని, ఇప్పుడు 41 శాతం వచ్చాయని వివరించారు. ఈ ఎన్నికలను తమ వంద రోజుల పాలనకు రెఫరెండంగా భావించి తీర్పు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రజలను కోరానని, దానిని స్వీకరించిన ప్రజలు.. 8 సీట్లు ఇచ్చారని తెలిపారు. తమ పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. సీఎంగా, పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్రంలో ఏ సీటు గెలిచినా, ఏ సీటు ఓడినా బాధ్యత తనదేనన్నారు. ఇప్పటిదాకా రోజుకు 18గంటలు పని చేస్తున్న తాము మరో రెండు గంటలు అదనంగా పని చేసి ప్రజల్ని మెప్పించే ప్రయత్నం చేస్తామన్నారు.
ఏపీతో సమస్యలు పరిష్కరించుకుంటాం..
ఏపీలో ఏ ప్రభుత్వం ఏర్పడినా స్నేహపూర్వక వాతావరణంలో చర్చించి సమస్యలను పరిష్కరించుకుంటామని రేవంత్ అన్నారు. ఉమ్మడి రాజధాని అంశం చట్టపరంగానే పరిష్కారమైపోయిందని, ఇప్పుడు హైదరాబాద్.. తెలంగాణకు మాత్రమే రాజధాని అని పేర్కొన్నారు. ఆస్తులు, నీటి పంపకాలపై తప్పకుండా చర్చించుకుంటామని, ఇందులో తమకు బేషజాలేమీ లేవని స్పష్టంచేశారు. ఇక ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంటులో అప్పటి ప్రధాని చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నామని రాహుల్‌గాంధీ విస్పష్టంగా చెప్పారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అదేమీ ఎన్నికల హామీ కాదని, చట్టబద్ధతతో కూడిన హామీ అని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏపీ ప్రభుత్వం ఆహ్వానిస్తే.. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, ఇది వ్యక్తిగా తాను తీసుకునే నిర్ణయం కాదని అన్నారు.
సీఎంకు టీపీసీసీ అభినందన
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఫలితాలపై టీపీసీసీ కార్యవర్గం హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, హర్కార వేణుగోపాల్, వేం నరేందర్‌రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఈరవత్రి అనిల్ తదితరులు సీఎం రేవంత్‌ను కలిసి అభినందనలు తెలిపారు. రేవంత్ కృషి ఫలితంగానే 8 సీట్లు వచ్చాయంటూ కొనియాడారు. భువనగిరి ఎంపీగా గెలిచిన చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, వరంగల్ ఎంపీగా గెలిచిన కడియం కావ్య...రేవంత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
మోదీని ప్రజలు తిరస్కరించారు
లోక్‌సభ ఎన్నికల్లో మోదీ గ్యారెంటీని ప్రజలు తిరస్కరించారని, ఆయన మళ్లీ ప్రధాని పదవి చేపట్టకూడదని రేవంత్‌రెడ్డి అన్నారు. ‘‘పార్టీ మేనిఫెస్టో, పది మంది నాయకుల ఫొటోలతో 2014 ఎన్నికలకు బీజేపీ వెళ్తే 273 సీట్లు వచ్చాయి. 2019లోనూ ముగ్గురు, నలుగురు నేతల ఫొటోలు, మేనిఫెస్టోతో వెళ్తే 303 సీట్లు వచ్చాయి. కానీ, 2024 ఎన్నికల్లో పార్టీని, ఆ పార్టీలోని ఇతర నాయకత్వాలను పక్కన పెట్టి.. మోదీ గ్యారెంటీ పేరుతో ప్రజల దగ్గరికి వెళ్లారు. దీంతో 303 సీట్ల నుంచి 240 సీట్లకు పడిపోయింది. మోదీ గ్యారెంటీని దేశ ప్రజలు తిరస్కరించారు’’ అని రేవంత్ అన్నారు. రాజకీయాల్లో ఆదర్శంగా ఉండాల్సిన మోదీ.. స్వయంగా తప్పుకొంటే గౌరవం దక్కుతుందని, లేదంటే ప్రజల తీర్పును గౌరవించి.. బీజేపీనే ఆయనతో రాజీనామా చేయించాలని సూచించారు. రాముడి పేరుతో ఓట్లు యాచించడాన్ని ఆ రాముడు కూడా క్షమించలేదని, అందుకే అయోధ్య ఉన్న నియోజకవర్గం ఫైజాబాద్‌లోనూ బీజేపీ ఓడిందని అన్నారు.
Updated Date - Jun 06 , 2024 | 03:12 AM