Share News

Singareni: 3 బ్లాకులు మాకే ఇవ్వండి..

ABN , Publish Date - Jul 05 , 2024 | 03:00 AM

సింగరేణి పరిధిలోని బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలని, శ్రావణపల్లి బొగ్గు బ్లాకులను వేలం జాబితా నుంచి తొలగించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. సింగరేణిలో తెలంగాణ సర్కార్‌కు 51 శాతం, కేంద్రానికి 49 శాతం వాటాలున్నాయని ఆయన గుర్తు చేశారు.

Singareni: 3 బ్లాకులు మాకే ఇవ్వండి..

  • సింగరేణి గనులను వేలం వేయొద్దు

  • రద్దు చేసిన ఐటీఐఆర్‌ను పునరుద్ధరించాలి

  • ఐఐఎం ఏర్పాటు చేస్తే భూమిని కేటాయిస్తాం

  • కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం హామీలు నిలుపుకోండి

  • రక్షణ భూములు 2450 ఎకరాలు మాకివ్వండి

  • సెమీ కండక్టర్ల మిషన్‌లో రాష్ట్రాన్ని చేర్చండి

  • ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం రేవంత్‌ వినతి

న్యూఢిల్లీ, జులై 4 (ఆంధ్రజ్యోతి): సింగరేణి పరిధిలోని బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలని, శ్రావణపల్లి బొగ్గు బ్లాకులను వేలం జాబితా నుంచి తొలగించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. సింగరేణిలో తెలంగాణ సర్కార్‌కు 51 శాతం, కేంద్రానికి 49 శాతం వాటాలున్నాయని ఆయన గుర్తు చేశారు. గనులు, ఖనిజాభివృద్ది నియంత్రణం చట్టంలోని సెక్షన్‌ 11 ఏ, 17ఏ (2) ప్రకారం వేలం జాబితా నుంచి శ్రావణపల్లి గనిని తొలగించడంతో పాటు గోదావరి లోయ బొగ్గు నిల్వల క్షేత్రం పరిధిలోని కోయగూడెం, సత్తుపల్లి బ్లాక్‌లో ఉన్న మూడు గనులను సింగరేణికే కేటాయించాలని రేవంత్‌ ప్రధానిని కోరారు. గురువారం మధ్యాహ్నం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి ప్రధానిని కలుసుకున్న రేవంత్‌ దాదాపు గంటసేపు చర్చలు జరిపారు. అనంతరం మోదీతో సమావేశం వివరాలను రేవంత్‌ సమక్షంలో భట్టి విలేరులకు వెల్లడించారు.


రాష్ట్రంలో విద్యుదుత్పత్తికి మూడు గనులు కీలకమని మోదీకి చెప్పామన్నారు. ఐటీ రంగంలో నూతన డెవలపర్లను ప్రోత్సహించేందుకు వీలుగా హైదరాబాద్‌లో యూపీఏ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన సమాచార సాంకేతిక పెట్టుబడుల ప్రాంతం(ఐటీఐఆర్‌)ను పునురుద్ధరించాలని కూడా కోరినట్లు వెల్లడించారు. రాష్ట్రానికో ఐఐఎం ఏర్పాటు చేయాలని కేంద్రం విధాన నిర్ణయాన్ని తీసుకున్నా తెలంగాణకు ఐఐఎం మంజూరు కాలేదని గుర్తు చేశామని చెప్పారు. ఇందుకోసం భూమి కేటాయింపునకు సిద్ధంగా ఉన్నామని రేవంత్‌ ప్రధానికి చెప్పారన్నారు. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన అన్ని జిల్లాల్లో జవహర్‌ నవోయద విద్యాలయాలు, కాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని మోదీని కోరామని వెల్లడించారు. హైదరాబాద్‌లో సెమీ కండక్టర్ల ఫ్యాబ్‌ను నెలకొల్పేందుకు పలు కంపెనీలు ఆసక్తి కనపరుస్తున్న నేపథ్యంలో ఇండియా సెమీ కండక్టర్‌ మిషన్‌లో తెలంగాణను చేర్చాలని విజ్ఞప్తి చేశామని చెప్పారు.


తెలంగాణకు ఇళ్లు కేటాయించండి

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన తొలిదశలో తెలంగాణకు తక్కువ ఇళ్లు మంజూరయ్యాయని, ఈ పథకం కింద తెలంగాణకు వెంటనే 25 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని రేవంత్‌ ప్రధానిని కోరారు. వెనుకబడిన ప్రాంతాల నిధి కింద తెలంగాణకు రావల్సిన రూ.1800 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో పెరిగిన ట్రాఫిక్‌ అవసరాల రీత్యా హైదరాబాద్‌-కరీంనగర్‌, హైదరాబాద్‌-నాగపూర్‌ రోడ్లపై ఎలివేటెడ్‌ కారిడార్లు నిర్మించాలని నిర్ణయించామని ప్రధానికి చెప్పారు. ఈ నిర్మాణానికి అడ్డంకులు లేకుండా మార్గమధ్యంలో రక్షణ శాఖ పరిధిలో ఉన్న భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని రేవంత్‌ కోరారు. రహదారుల విస్తరణకు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర రక్షణ శాఖ పరిధిలో ఉన్న 2,450 ఎకరాల భూములను కూడా బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు.


ఆ భూములకు ప్రత్యామ్నాయంగా రావిర్యాల ప్రాంతంలో రీసెర్చి సెంటర్‌ ఇమారత్‌కు లీజుకు ఇచ్చిన 2,462 ఎకరాల భూమిని కేంద్రానికి పూర్తిగా అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో బయ్యారం స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు చట్టబద్ధ హామీ ఇచ్చారని, ఆ హామీ నెరవేర్చాలని రేవంత్‌ మోదీని కోరారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణంలో భాగంగా రహదారులకు సంబంధించి టెండర్ల ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. భూసేకరణ వ్యయంలో 50 శాతం ఖర్చును ఇవ్వడంతో పాటు రహదారి నిర్మాణ పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షి ణ భాగాన్ని(చౌటుప్పల్‌ నుంచి సంగారెడ్డి వరకు) జాతీయ రహదారిగా గుర్తించి భారత మాల పరియోజనలో భాగంగా చేపట్టాలని కోరారు. తెలంగాణలో పెరిగిన రవాణా అవసరాల రీత్యా 13 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - Jul 05 , 2024 | 03:00 AM