CM Revanth Reddy: నాలుగు గ్యారెంటీలు..
ABN, Publish Date - Aug 08 , 2024 | 03:08 AM
రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయం.. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఘనవిజయం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కీలకమైన నాలుగు ప్రాజెక్టులకు ప్రపంచబ్యాంకు సహకారం లభించింది.
తెలంగాణకు ప్రపంచ బ్యాంకు హామీలు
హైదరాబాద్ 4.0, మూసీ సుందరీకరణ, స్కిల్ యూనివర్సిటీ, ప్రజారోగ్య రంగాల్లో సహకారం
వరల్డ్ బ్యాంకు అధ్యక్షుడితో సీఎం చర్చలు సఫలం.. నిపుణులతో ఉన్నతస్థాయి కమిటీకి నిర్ణయం
ఆర్థిక సహకారానికి ప్రపంచబ్యాంకు సిద్ధం.. వివింట్ కంపెనీ రూ. 400 కోట్ల పెట్టుబడులు
వెయ్యి మందికి ఉద్యోగాలు.. ఆవిష్కరణల అభివృద్ధికి ముందుకొచ్చిన కార్నింగ్ కంపెనీ
హైదరాబాద్, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయం.. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఘనవిజయం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కీలకమైన నాలుగు ప్రాజెక్టులకు ప్రపంచబ్యాంకు సహకారం లభించింది. తెలంగాణలోని నాలుగు కోట్ల మంది ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు సహకారం అందిస్తామని ప్రపంచబ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా హామీ ఇచ్చారు. బుధవారం అమెరికా రాజధాని వాషింగ్టన్‌లోని ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో అధ్యక్షుడు అజయ్ బాంగాతో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం సమావేశమైంది.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నాలుగు ప్రాజెక్టుల గురించి ప్రపంచబ్యాంకు అఽధ్యక్షుడికి సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. ఇందులో కాలుష్యరహిత విధానాలకు ఉద్దేశించిన నెట్ జీరో విధానాలు, మూసీనది సుందరీకరణ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ప్రజారోగ్యానికి సంబంధించి చేపట్టబోయేకార్యక్రమాలు ఉన్నాయి. మూసీ పునరుజ్జీవం, సుందరీకరణ ప్రాజెక్టుతో జల కాలుష్యం తగ్గుతుందని, స్థానికులకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు పెరుగుతాయని సీఎం తెలిపారు. దేశంలోని ప్రధాన నగరాలు ఎదుర్కొంటున్న కాలుష్య సమస్యలకు తమ ప్రభుత్వం కాలుష్యరహిత విధానాలు అమలు చేస్తోందన్నారు.
ఇందులో భాగంగా కాలుష్య కారకమవుతుందని భావించే హైదరాబాద్ ఫార్మాసిటీని రద్దుచేసి కాలుష్యరహిత ప్రాజెక్టుగా అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ 4.0లో భాగంగా కొత్త నగర నిర్మాణం గురించి సీఎం ప్రస్తావించారు. ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా సాధించిన తెలంగాణలో నిరుద్యోగం పెరిగిందని, ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాల భర్తీతోపాటు ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు సాధించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించామని తెలిపారు. పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలు అందించి ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ వర్సిటీ లక్ష్యమన్నారు. ప్రజారోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న కార్యక్రమాలనూ సీఎం వివరించారు. ఈ నాలుగు ప్రాజెక్టుల గురించి ఆసక్తిగా విన్న ప్రపంచబ్యాంకు అధ్యక్షుడు.. తెలంగాణ ప్రభుత్వానికి భాగస్వామ్యం అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టులకు ఆర్థిక సహకారం అందించేందుకూ సానుకూలంగా స్పందించారు. ప్రాజెక్టుల అమలుకు త్వరలో సంబంధిత వర్గాల నిపుణులతో ఓ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు.
జీనోమ్ వ్యాలీలో రూ.400 కోట్ల పెట్టుబడులు..
ప్రముఖ ఫార్మా కంపెనీ వివింట్ హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక ఇంజెక్టబుల్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. రూ.400 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఈ కంపెనీ ముందుకొచ్చింది. దీంతో దాదాపు వెయ్యి మందికి ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొంది. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి బృందం బుధవారం వివింట్ కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. అనంతరం పెట్టుబడులకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. కంపెనీ నిర్ణయంపై సీఎం రేవంత్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. లైఫ్ సైన్సెస్ రంగంలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, అవసరమైన రాయితీలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని చెప్పారు. అంకాలజీ, క్రిటికల్ కేర్ విభాగాల్లో అత్యంత నాణ్యమైన ఇంజెక్టబుల్స్, ఔషధాలను ఈ కంపెనీ ఉత్పత్తి చేస్తుంది.
మరోవైపు ప్రపంచంలో పేరొందిన కార్నింగ్ ఇన్ కార్పొరేటెడ్ కంపెనీ కూడా తెలంగాణలో కొత్త ఆవిష్కరణల అభివృద్ధికి ముందుకొచ్చింది. నైపుణ్యాలతోపాటు పరిశ్రమల్లో సాంకేతిక ఆవిష్కరణలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని బృందం బుధవారం ఎమర్జింగ్ ఇన్నోవేషన్ గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రోనాడ్ వెర్క్లీరన్ ఆధ్వర్యంలోని కార్నింగ్ ప్రతినిధుల బృందంతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో అవగాహన ఒప్పంద పత్రాలపై అధికారికంగా సంతకాలు చేశారు.
2025 నుంచి కార్నింగ్ వాణిజ్య ఉత్పత్తి..
కార్నింగ్ కంపెనీతో కుదిరిన ఒప్పందం ప్రకారం.. అడ్వాన్స్ మాన్యుఫ్యాక్చరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో కార్నింగ్ కంపెనీ తెలంగాణ ప్రభుత్వానికి సహకారం అందిస్తుంది. ఫార్మాస్యూటికల్, కెమికల్ రంగాల్లో అత్యాధునిక పరిశోధన, అభివృద్ధి కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దడంలో భాగస్వామ్యం పంచుకుంటుంది. 2025 నుంచి తమ వాణిజ్య ఉత్పత్తి ప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది. అలాగే తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్ యూనివర్సిటీ సహకారంతో డాక్టర్ రెడ్డీస్ లిమిటెడ్, లారస్ ఫార్మా లిమిటెడ్ నిర్వహిస్తున్న ఫ్లో కెమిస్ర్టీ టెక్నాలజీ (ఎఫ్‌సీటీ) హబ్‌లోనూ కార్నింగ్ కంపెనీ భాగస్వామ్యం పంచుకుంటుంది.
ఈ అత్యాధునిక గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం ఫార్మా రంగం అభివృద్ధికి దోహదపడుతుంది. ఈ గ్లాస్ ట్యూబ్‌లను ఔషధాల ప్యాకేజింగ్ పరిశ్రమలో ఉపయోగిస్తారు. వీటి తయారీకి వినూత్నమైన వెలాసిటీ గ్లాస్-కోటింగ్ టెక్నాలజీని కార్నింగ్ కంపెనీ వినియోగిస్తోంది. ఈ కొత్త సదుపాయంతో తెలంగాణలో ఇప్పటికే వేగంగా విస్తరిస్తున్న ఫార్మాస్యూటికల్ రంగంలో ఉత్పాదకత సామర్థ్యం మరింత మెరుగుపడుతుందని ప్రభుత్వం తెలిపింది.
Updated Date - Aug 08 , 2024 | 03:08 AM