Share News

బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసే పోటీ

ABN , Publish Date - Mar 06 , 2024 | 04:43 AM

‘‘పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసే పోటీ చేయబోతున్నాయి. అందుకే బీజేపీ పోటీ చేసే స్థానాల్లో బీఆర్‌ఎస్‌ తమ అభ్యర్థులను ప్రకటించడం లేదు. బీజేపీకి వదిలేసిన సీట్లు

బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసే పోటీ

అందుకే, బీజేపీ పోటీ చేసే స్థానాల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించలేదు

5 నెలల్లో దింపేస్తామని అంటున్నారంటే మోదీతో కేసీఆర్‌ కలిసినట్లేగా!?

కాళేశ్వరం రిపోర్టూ ఎన్నికల తర్వాతేనట.. కేసీఆర్‌ కుటుంబంపై చర్యలు తప్పవ్‌

రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు గెలుస్తాం.. మా అన్నదమ్ములెవరూ పోటీ చేయరు

అన్నారంలో నీళ్లు నింపిన తర్వాత ఊళ్లు కొట్టుకుపోతే బాధ్యత ఎవరిది!?

ఎమ్మెస్సీలో పొలిటికల్‌ సైన్స్‌ చదివింది కేసీఆర్‌ ఒక్కరే.. ఆయన నోరు తెరిస్తే అబద్దాలే

పన్నులు వేయకుండానే ఆదాయం పెంచాం.. ట్యాక్స్‌ పేయర్లకు రైతు భరోసా లేదు

మీడియాతో చిట్‌చాట్‌లో రేవంత్‌.. ముఖ్యమంత్రిని కలిసిన చేవెళ్ల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే

హైదరాబాద్‌, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): ‘‘పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసే పోటీ చేయబోతున్నాయి. అందుకే బీజేపీ పోటీ చేసే స్థానాల్లో బీఆర్‌ఎస్‌ తమ అభ్యర్థులను ప్రకటించడం లేదు. బీజేపీకి వదిలేసిన సీట్లు మినహా మిగతా స్థానాల్లో ప్రకటించింది’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. ఇద్దరూ కలిసి పోటీ చేసే యోచన లేకపోతే.. అందరికంటే ముందుగా చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా రంజిత్‌ రెడ్డి పేరును చెప్పిన కేసీఆర్‌ ఇప్పటి వరకు ఆయన్ను ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. అసలు మెదక్‌ అభ్యర్థి ఎవరన్న దానిని ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. సచివాలయంలోని సమావేశ మందిరంలో మంగళవారం ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ‘‘మా ప్రభుత్వాన్ని 5 నెలల్లో దింపుతామని మాట్లాడుతున్నారంటే మోదీతో కలవాల్సిందే కదా! అంటే, మోదీతో కేసీఆర్‌ కలిసినట్టేగా!?’’ అని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం రిపోర్టును నాలుగు నెలల్లో ఇస్తామని కమిటీ చెబుతోందని, అంటే, పార్లమెంటు ఎన్నికల్లో ఇద్దరూ కలిసి పోటీ చేసిన తర్వాత వచ్చే ఫలితాలను బట్టి రిపోర్టు వస్తుందని స్పష్టమవుతోందని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కుమ్మక్కయ్యాయన్న మోదీ వ్యాఖ్యలపైనా సీఎం రేవంత్‌ స్పందించారు. కాళేశ్వరం విషయంలో ఇప్పటికే అధికారులను సస్పెండ్‌ చేశామని, సిటింగ్‌ జడ్జితో విచారణ చేయాలని కోరితే.. కోర్టు రిటైర్డ్‌ జడ్జిని ఇస్తామని చెప్పిందని తెలిపారు. బాధ్యులపై క్రమంగా చర్యలుంటాయని, ఒకేసారి నిర్ణయం తీసుకోవడానికి తాను కేసీఆర్‌లా 80 వేల పుస్తకాలు చదవలేదని, మోదీలా విశ్వ గురువుని కాదని ఎద్దేవా చేశారు. రాష్ట్రాభివృద్ధి, పలు ప్రాజెక్టుల అంశాలకు సంబంధించి ప్రధాన మంత్రికి కేసీఆర్‌లా చెవిలో చెప్పలేదని, బహిరంగంగానే చెప్పానని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని అనాథల నుంచి ప్రజా ప్రతినిధుల వరకూ ఎవరైనా కలవవచ్చని సీఎం రేవంత్‌ స్పష్టం చేశారు. సీఎంను ఎమ్మెల్యేలు కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఒక సీఎంను ప్రజా ప్రతినిధులు స్వేచ్ఛగా కలిసే పరిస్థితి పదేళ్లలో లేకుండాపోయిందని తప్పుబట్టారు. కేసీఆర్‌ తన విద్యార్హతల విషయంలోనూ పార్లమెంటుకు తప్పుడు పత్రాలను సమర్పించారని తెలిపారు. బీకాంలో ఫిజిక్స్‌ చదివిన జలీల్‌ఖాన్‌ గురించే అందరికీ తెలుసని, కానీ, ఎమ్మెస్సీలో పొలిటికల్‌ సైన్స్‌ చదివిన వ్యక్తిని తాను ఎక్కడా, ఎప్పుడూ చూడలేదంటూ కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ నోరు తెరిస్తే అబద్ధాలే చెబుతాడని విమర్శించారు. తన ఇల్లే తనకు క్యాంప్‌ ఆఫీస్‌ అని చెప్పారు. 7, 8 తేదీల్లో కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని, అభ్యర్థులను కేంద్ర పార్టీ నిర్ణయిస్తుందని వెల్లడించారు. తమ అన్నదమ్ముల్లో ఎవరూ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, తాను కూడా ప్రోత్సహించడం లేదని స్పష్టం చేశారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ మంగళవారం కేసీఆర్‌ను కలవడంపై స్పందించిన సీఎం.. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే కొన్ని మబ్బులు తొలగిపోతున్నాయని అన్నారు.

త్వరలో చట్టపరంగా చర్యలు తప్పవు

ఇప్పటికే రాష్ట్ర ప్రజలు వారికి రాజకీయంగా శిక్ష వేసి ఇంట్లో కూర్చోబెట్టారని, త్వరలో చట్టపరంగా కూడా చర్యలు ఉంటాయని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఎల్‌ఆర్‌ఎ్‌సపై అన్ని నియోజక వర్గాల్లో నిరసనలకు పిలుపునిచ్చిన కేటీఆర్‌ సిరిసిల్ల జంక్షన్లోని అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద దీక్ష చేయాలని, అలా చేస్తే తిన్నదన్నా అరుగుతుందని ఎద్దేవా చేశారు. ఇంత కాలం గాదె కింద పందికొక్కుల్లా తిన్నారని విమర్శించారు. వీలైతే కేటీఆర్‌ మంచినీళ్లు కూడా తాగకుండా దీక్ష చేస్తే ఆయనిచ్చిన నిరసన పిలుపునకు చిత్తశుద్ధి ఉన్నట్టన్నారు. ‘‘అసెంబ్లీలో ప్రతిపక్ష నేతే లేరు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆ సీట్లో పద్మారావు కూర్చున్నారు. అసెంబ్లీకి రాకుండానే మాకు పాలనపై పట్టు రాలేదని మాట్లాడితే ఎలా!? అని రేవంత్‌ ప్రశ్నించారు.

ఊర్లు కొట్టుకుపోతే బాధ్యత ఎవరిది!?

కాళేశ్వరం, మేడిగడ్డపై కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌ ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని, కుంగింది రెండు పిల్లర్లేనని అంటున్నారని, కానీ ప్రాజెక్టు మొత్తంలో మేడిగడ్డే ముఖ్యమైనదని రేవంత్‌ స్పష్టంచేశారు. అన్నారం బ్యారేజీకి నీళ్లను ఎత్తిపోయాలని హరీశ్‌ అంటున్నారని, అక్కడ కూడా లీకేజీ అవుతుంటే నీటిని నింపడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. వాళ్ల దొంగతనం కప్పిపుచ్చుకునేందుకే ఎత్తిపోయమంటున్నారని తప్పుబట్టారు. ‘‘ఇప్పుడు అన్నారంలో నీళ్లు నింపమంటున్నారు. తర్వాత ఊర్లకు ఊర్లు కొట్టుకుపోతే ఎవరిని అడగాలి. రిపేర్లను తమకు ఇస్తే చేసి చూపిస్తామని అంటున్నారు. వాళ్లు నిర్మిస్తేనే కదా ఇలా కుంగిపోయింది. ఈ విషయంపై నేషనల్‌ డ్యామ్‌ సేప్టీ కమిటీ ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసే వరకూ దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేం. పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాతే చర్యలు తీసుకుంటాం. ఎవరిపైనా కక్షపూరితంగా వ్యవహరించబోం. బహిరంగంగా కాల్చి చంపిన కసబ్‌ను కూడా విచారించారు. కాళేశ్వరంపైనా కేసీఆర్‌కు అవకాశం ఇవ్వాలి. ఆ తర్వాత విచారించాలి. అలా చేయకపోతే సమాజం మమ్మల్ని ప్రశ్నిస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. లోపం నిర్మాణంలో ఉందా, నిర్వహణలోనా అన్న విషయాన్ని ఇంజనీరింగ్‌ నిపుణులే తేల్చాలన్నారు. చాలా మంది అధికారులు అవినీతిలో భాగస్వాములని, వారిపైనా చర్యలు ఉంటాయని చెప్పారు. సాగర్‌, శ్రీశైలం నిర్మించి ఏళ్లు గడుస్తున్నా ఎలాంటి ఇబ్బంది రాలేదన్న విషయాన్ని గుర్తు చేస్తూ.. ‘రాష్ట్రంలోనూ కాళేశ్వరం కట్టారు, కూలింది’ అన్నట్లుగా పరిస్థితి తయారైందన్నారు. తుమ్మిడిహెట్టితో కాళేశ్వరానికి ఎలాంటి సంబధం లేదని, దాని ద్వారా ఆదిలాబాద్‌ జిల్లాలో దాదాపు 1.60 లక్షల ఎకరాలకు నీరు అందించవచ్చని స్పష్టం చేశారు. మహారాష్ట్రలోనూ బీజేపీ ప్రభుత్వమే ఉందని, అందుకే ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాలని మోదీని కోరానని తెలిపారు. కేంద్రం, మహారాష్ట్ర అంగీకరిస్తే గంటలో పనులు మొదలుపెడతామన్నారు.

పెద్దన్న అంటే తప్పేముంది!?

ప్రధానిని పెద్దన్న అంటే తప్పేముందని, దేశానికి ఆయనే పెద్ద కదా అని సీఎం రేవంత్‌ వ్యాఖ్యానించారు. దేశ ప్రధాని అధికారిక కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్రానికి వచ్చినప్పుడు రాష్ట్రాభివృద్ధి గురించి అడగకుండా చేతులు ఊపుకుంటూ వెళ్లి.. ‘మీ ప్రేమలో మునిగి.. అమరులమవుతామ’ని చెబుతామా అని కేసీఆర్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేస్తామని ప్రధాని మోదీ వ్యాఖ్యానించడంపై మాట్లాడుతూ.. ‘అవినీతి ఉంటే పట్టుకోవాల్సిందే.. అది మంచిదేగా’ అని వ్యాఖ్యానించారు. బీజేపీపై రేవంత్‌ ఎలాంటి విమర్శలు చేయడం లేదనే ప్రచారం జరుగుతోందని విలేకరులు ప్రశ్నించగా.. రాష్ట్రంలో లేని బీజేపీని ఏం తిట్టాలంటూ సీఎం ఎద్దేవా చేశారు. రాష్ట్ర బీజేపీ నాయకులు మోదీకి సగం సగం వివరాలే చెప్పి ఉంటారని, అందుకే కాళేశ్వరంపై అలా మాట్లాడి ఉంటారని అభిప్రాయపడ్డారు.

ట్యాక్స్‌ పేయర్స్‌కు రైతు భరోసా ఉండదు

రైతు భరోసా విషయంలోనూ చాలా స్పష్టమైన యోచనతో ఉన్నామని, ట్యాక్స్‌ పేయర్స్‌, సంపన్నులకు అందించేది లేదని సీఎం రేవంత్‌ రెడ్డి తేల్చి చెప్పారు. ఫామ్‌ హౌస్‌లకు ఇచ్చేది లేదని, గజ్వేల్‌, జన్వాడలో ఫామ్‌ హౌస్‌లో ఉంటున్న వారికి కూడా ఇవ్వబోమని కేసీఆర్‌, కేటీఆర్‌ను ఉద్దేశించి అన్నారు. వాస్తవంగా సాగు చేసే రైతులు, కూలీలకు మాత్రమే పెట్టుబడి సాయం అందుతుందన్నారు.

అదానీకి ఆస్తులు రాసివ్వం

దేశంలోనైనా, రాష్ట్రంలోనైనా కాంగ్రెస్‌ ఆస్తులను సృష్టించిందని, అంతే తప్పితే ఎవరికీ కట్టబెట్టలేదని సీఎం రేవంత్‌ వ్యాఖ్యానించారు. దావో్‌సలో అదానీ కంపెనీలతో ఒప్పందం చేసుకోవడంపై విమర్శలు వచ్చాయని విలేకర్లు ప్రశ్నించగా.. ‘ఔను.. అదానీకి ఎలాంటి ఆస్తులను ఇచ్చేది లేదు. వాళ్లు రాష్ట్రంలో పెట్టుబడులు పెడతారు’’ అని స్పష్టతనిచ్చారు. సోనియా గాంధీ కుటుంబం నుంచి ఎవరో ఒకరు ఇక్కడ పోటీ చేస్తే రాష్ట్రంలో రాజకీయంగా మార్పులుంటాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో గతమనేది లేదని, ఇక నుంచి భవిష్యత్తే ఉంటుందని స్పష్టం చేశారు.

సీఎం రేవంత్‌ని కలిసిన చేవెళ్ల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే

చేవెళ్ల, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కాలె యాదయ్య మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో సీఎంను కలిసి శాలువాతో సత్కరించారు. చేవెళ్ల నియోజకవర్గ అభివృద్ధికి మంజూరైన సీడీపీ నిధులు, ఇతర పనులకు నిధులు మంజూరు చేయాలని సీఎంను కోరినట్టు ఎమ్మెల్యే చెప్పారు. ఈ భేటీలో ఎలాంటి రాజకీయ కోణం లేదని ఈ సందర్భంగా యాదయ్య స్పష్టం చేశారు.

మా 3 నెలల పాలన చూసి ఓటేయమని అడుగుతాం

డిసెంబర్‌ 7 నుంచి పార్లమెంటు ఎన్నికల నాటికి తాము చేసిన పాలనను చూసే ఓట్లు వేయాలని ప్రజలను కోరతామని సీఎం రేవంత్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 14 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎ్‌సకు సీట్లు ఎన్ని వస్తాయని విలేకరులు అడగ్గా.. అది గాల్లో దీపమంటూ సమాధానమిచ్చారు. జీవో నంబర్‌ 3తో ఉద్యోగ నియామకాల్లో మహిళలకు అన్యాయం జరుగుతోందని అంటున్నారని ప్రశ్నించగా.. హారిజాంటల్‌, వర్టికల్‌ విషయంలో హైకోర్టు ఆదేశాల ప్రకారమే ముందుకు వెళ్తున్నామని స్పష్టతనిచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో కంటే ఇసుక విషయంలో రోజుకు రూ.2.50 కోట్ల మేర ఆదాయం పెరిగిందని, జీఎస్టీలోనూ ఫిబ్రవరిలో రూ.300 కోట్ల అదనపు ఆదాయం వచ్చిందని, వచ్చే నెలలో రూ.500 కోట్లు రాబోతోందని చెప్పారు. జీఎస్టీలో పెద్ద ఎత్తున దోపిడీ జరిగిందని, అందరి జాబితా బయటపెడతామని చెప్పారు. అణాపైసా పన్నులు వేయకుండానే తాము అదనపు ఆదాయాన్ని సాధించామని తెలిపారు. నీటిపారుదల శాఖ, గొర్రెల కొనుగోళ్లపై విజిలెన్స్‌ విచారణ జరుగుతోందని, అవినీతిపరులపై చర్యలుంటాయని స్పష్టం చేశారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌లో జరిగిన అవకతవకలపైనా విచారణ చేస్తామని, డీఎస్పీ ప్రణీత్‌రావుపైనా విచారణ జరగుతోందని తెలిపారు. 2008 డీఎస్సీ అభ్యర్థుల అంశంపై పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామన్నారు.

ఎప్పుడైనా సీఎం చాంబర్‌ దాకా వచ్చారా?

సచివాలయంలోని సమావేశ మందిరంలో విలేకరులతో చిట్‌చాట్‌గా మాట్లాడిన రేవంత్‌.. గడిచిన పదేళ్లలో ఎప్పుడైనా సీఎం చాంబర్‌ వరకూ వచ్చారా!? కనీసం కాన్ఫరెన్స్‌ హాల్‌ గేటు వరకైనా వచ్చారా!? అంటూ ఛలోక్తులు విసిరారు.

Updated Date - Mar 06 , 2024 | 04:43 AM