Share News

Congress Guarantees: ఆరింటిలో.. కొన్నింటికి గ్యారెంటీ లేదు!

ABN , Publish Date - Jul 26 , 2024 | 05:17 AM

ఎన్నికల్లో మ్యానిఫెస్టోలో కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో కొన్ని పథకాలకు తాజా బడ్జెట్‌లో నిధులను కేటాయించలేదు. దాంతో ఈ పథకాలు ఈ ఆర్థిక సంవత్సరంలో అమల్లోకి వస్తాయా? అనే అనుమానం వ్యక్తం అవుతోంది.

Congress Guarantees: ఆరింటిలో.. కొన్నింటికి గ్యారెంటీ లేదు!

  • బడ్జెట్‌లో కేటాయింపులను చూపలేదు

  • బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి రూ.4,084 కోట్లు

  • రైతు భరోసాకు 15 వేల కోట్లు

  • గృహజ్యోతికి రూ.2,418 కోట్లు.. ఇళ్లకు రూ.7,740 కోట్లు

  • పింఛన్లకు రూ.14,861 కోట్లు

హైదరాబాద్‌, జూలై 25 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో మ్యానిఫెస్టోలో కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో కొన్ని పథకాలకు తాజా బడ్జెట్‌లో నిధులను కేటాయించలేదు. దాంతో ఈ పథకాలు ఈ ఆర్థిక సంవత్సరంలో అమల్లోకి వస్తాయా? అనే అనుమానం వ్యక్తం అవుతోంది.


  • కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారెంటీల్లో మొదటిది మహాలక్ష్మి. ఈ స్కీమ్‌లో మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ పథకం ఇంకా అమల్లోకి రాలేదు. ఈ బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు జరపలేదు. మహాలక్ష్మిలో భాగమైన రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ పథకం మాత్రం ప్రారంభమైంది. ఈ పథకానికి రూ.723 కోట్లను కేటాయించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణ పథకానికి రూ.4,084 కోట్ల కేటాయింపులు జరిగాయి.

  • రెండో గ్యారెంటీ అయిన రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తామన్నారు. ఇంకా అమల్లోకి రావాల్సి ఉన్న ఈ పథకానికి రూ.15,075 కోట్లను కేటాయించారు. గతంలో అమలైన రైతుబంధుకు ఇంతే మొత్తంలో కేటాయింపులు ఉండేవి. రైతు భరోసాలోని మరో పథకం ‘వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు’ స్కీమ్‌కు రూ.1,200 కోట్లను కేటాయించారు. ఈ పథకం కూడా ఇంకా ప్రారంభం కావాల్సి ఉండగా.. వరికి బోనస్‌ పథకానికి రూ.1,800 కోట్ల మేర కేటాయింపులు జరిగాయి.

  • మూడో గ్యారెంటీ అయిన గృహజ్యోతి ఇప్పటికే అమల్లోకి వచ్చింది. 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్తును అందించే ఈ పథకానికి రూ.2,418 కోట్లను ప్రకటించారు.

  • నాలుగో గ్యారెంటీ అయిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ఇంకా అమల్లోకి రావాల్సి ఉంది. ఈ పథకానికి రూ.7,740 కోట్లను కేటాయించారు.

  • విద్యార్థులకు రూ.5లక్షల విద్యా భరోసా కార్డులు ఇచ్చే ఐదో గ్యారెంటీ అయిన యువ వికాసాన్ని గురించి బడ్జెట్‌లో ప్రస్తావించలేదు.

  • చేయూత పింఛన్లను రూ.4 వేలకు పెంచుతామని ఆరో గ్యారెంటీ ఇచ్చారు. గత బడ్జెట్‌లో ఆసరా పింఛన్లకు రూ.12 వేల కోట్లను కేటాయించగా.. ఈ సారి రూ.14,861 కోట్లను కేటాయించారు. అయితే.. పింఛన్లను రూ.4 వేలకు పెంచాలంటే.. ఈ కేటాయింపులు సరిపోవని తెలుస్తోంది. మొత్తమ్మీద ఆరు గ్యారెంటీలకు రూ.47,167 కోట్లను కేటాయించారు.

Updated Date - Jul 26 , 2024 | 05:17 AM