TS Assembly: తెలంగాణ అసెంబ్లీలో జల జగడం: ప్రాజెక్టులు, కేఆర్ఎంబీపై వాడీవేడీగా చర్చ..!
ABN , Publish Date - Feb 12 , 2024 | 08:43 AM
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. గత ప్రభుత్వ తప్పిదాలను అధికార కాంగ్రెస్ పార్టీ ఎత్తి చూపుతోంది. అందుకు ధీటుగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సమాధానం ఇస్తోంది.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. గత ప్రభుత్వ తప్పిదాలను అధికార కాంగ్రెస్ పార్టీ (Congress) ఎత్తి చూపుతోంది. అందుకు ధీటుగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సమాధానం ఇస్తోంది. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనెజ్ మెంట్ బోర్డుకు (కేఆర్ఎంబీ) అప్పగించడాన్ని బీఆర్ఎస్ పార్టీ తప్పుపడుతుంది. 13వ తేదీ మంగళవారం రోజున ఛలో నల్లగొండకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఆయకట్టు రైతులు, ప్రజలు భారీగా తరలి రావాలని కోరింది. అక్కడ నిర్వహించే సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగిస్తారు. అదే రోజు మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళతారు. ఒకే రోజు అధికార, విపక్షాలు ప్రాజెక్టుల అంశంపై మాటల యుద్దానికి దిగుతున్నాయి.
మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్
అసెంబ్లీలో ప్రాజెక్టులపై సోమవారం (ఈ రోజు) చర్చ జరిగే అవకాశం ఉంది. గత ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల గురించి సభ ముందు ప్రభుత్వం నివేదిక అందజేస్తుందని సమాచారం. ప్రాజెక్టులపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేస్తారని తెలిసింది.. కేఆర్ఎంబీ పరిధిలో ప్రాజెక్టుల అప్పగింతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గెజిట్ ఇచ్చిన సమయంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. అప్పటి ప్రభుత్వం అభ్యంతరం తెలియజేయలేదని స్పష్టం చేసింది. కేఆర్ఎంబీ పరిధిలోకి ప్రాజెక్టులు అప్పగించొద్దనేది తమ ప్రభుత్వ విధానం అని కాంగ్రెస్ ప్రభుత్వం తెగేసి చెప్పింది. ఏపీ సీఎం జగన్‌తో కుమ్మక్కై నీటిని తరలించారని ఆరోపిస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి నష్టం కలిగే ఒప్పందాలపై అప్పటి సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు సంతకాలు చేశారని విరుచుకు పడింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.