Share News

Congress: రేపు టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్‌భవన్‌

ABN , Publish Date - Dec 17 , 2024 | 03:18 AM

గౌతమ్‌ అదానీ ఆర్థికంగా అవకతవకలకు పాల్పడి దేశ ప్రతిష్టను దెబ్బతీయడం, మణిపూర్‌లో అల్లర్లు జరిగినా ప్రధాని మోదీ ఇప్పటి దాకా ఆ రాష్ట్రాన్ని సందర్శించక పోవడాన్ని నిరసిస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో బుధవారం చలో రాజ్‌భవన్‌ కార్యక్రమం జరగనుంది.

Congress: రేపు టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్‌భవన్‌

  • పాల్గొననున్న సీఎం రేవంత్‌, టీపీసీసీ చీఫ్‌, మంత్రులు .. జీహెచ్‌ఎంసీలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తేవాలి

  • హైదరాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ నేతల సమావేశంలో మహేశ్‌ కుమార్‌గౌడ్‌

  • క్షేత్రస్థాయిలో పని చేసిన నాయకులకు గుర్తింపు: మంత్రి పొన్నం

హైదరాబాద్‌, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): గౌతమ్‌ అదానీ ఆర్థికంగా అవకతవకలకు పాల్పడి దేశ ప్రతిష్టను దెబ్బతీయడం, మణిపూర్‌లో అల్లర్లు జరిగినా ప్రధాని మోదీ ఇప్పటి దాకా ఆ రాష్ట్రాన్ని సందర్శించక పోవడాన్ని నిరసిస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో బుధవారం చలో రాజ్‌భవన్‌ కార్యక్రమం జరగనుంది. ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌గౌడ్‌ ఆధ్వర్యంలో జరిగే ఈ చలో రాజ్‌భవన్‌ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు పాల్గొననున్నారు. కాగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని హైదరాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ నేతలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌గౌడ్‌ పిలుపునిచ్చారు. ఆ ఎన్నికల్లో మెజారిటీ డివిజన్లు గెలవడమే లక్ష్యంగా పెట్టుకోవాలని కార్యకర్తలకు సూచించారు. గాంధీభవన్‌లో జరిగిన హైదరాబాద్‌ జిల్లా పార్టీ సమీక్ష సమావేశంలో మహేశ్‌ మాట్లాడారు గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కులం, మతం పేరుతో ఉద్రేకాలు రెచ్చగొట్టి ఇతర పార్టీలు సీట్లు గెలుచుకున్నాయని ఆరోపించారు. అనంతరం ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడారు.


వచ్చే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బలమైన నాయకులకే టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పని చేసిన నాయకులకే గుర్తింపు ఉంటుందని, ఆయా డివిజన్‌లలో ప్రజలతో మమేకమైన నేతలకే టిక్కెట్లు లభిస్తాయని స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలు కలిసికట్లుగా పని చేస్తేనే గ్రేటర్‌లో పార్టీ బలోపేతమవుతుందన్నారు. కాగా బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రలో కులగణన ఎప్పుడు చేస్తారంటూ ప్రధాని మోదీని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి. హనుమంతరావు ప్రశ్నించారు. వీర సావర్కర్‌ బాటలో మోదీ నడుస్తున్నారని, అయితే వీర సావర్కర్‌ దేశానికి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. అంతకుముందు.. బంగ్లాదేశ్‌ లిబరేషన్‌ డే.. విజయ్‌ దివస్‌ సందర్భంగా గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మరోవైపు.. మహేశ్‌ కుమార్‌గౌడ్‌ డమ్మీ కాదు.. డైనమిక్‌ అని, పనిమంతుడు కాబట్టే ఆయన పీసీసీకి అధ్యక్షుడయ్యారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్‌కౌశిక్‌ యాదవ్‌ అన్నారు. కేటీఆర్‌ లాగా తండ్రి పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి రాలేదన్నారు.

Updated Date - Dec 17 , 2024 | 03:18 AM