Hyderabad: ప్రభుత్వ ఒత్తిడి వల్లే!
ABN , Publish Date - Jun 13 , 2024 | 03:17 AM
కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణాన్ని నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేయాలని గత ప్రభుత్వం తమపై ఒత్తిడి చేసిందని నిర్మాణ సంస్థలు తెలిపాయి. ఆ ఒత్తిడితో నిర్మించడం వల్లే ప్రతికూల ఫలితాలు వచ్చాయని పేర్కొన్నాయి.
నిర్దిష్ట వ్యవధిలోగా బ్యారేజీల నిర్మాణం..
పూర్తి చేయాలని సర్కారు ఒత్తిడి చేసింది
ప్రభుత్వం చెప్పినట్లే బ్యారేజీలు కట్టాం
అందుకే ప్రతికూల ఫలితాలు వచ్చాయి
కాళేశ్వరంపై జస్టిస్ ఫీూష్ కమిషన్‌కు..
నివేదించిన బ్యారేజీల నిర్మాణ సంస్థలు
హైదరాబాద్, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణాన్ని నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేయాలని గత ప్రభుత్వం తమపై ఒత్తిడి చేసిందని నిర్మాణ సంస్థలు తెలిపాయి. ఆ ఒత్తిడితో నిర్మించడం వల్లే ప్రతికూల ఫలితాలు వచ్చాయని పేర్కొన్నాయి. జస్టిస్ పినాకిచంద్ర ఘోష్ కమిషన్ బుధవారం బ్యారేజీల నిర్మాణ సంస్థలను విచారించగా.. ఈ మేరకు తమ వివరణ ఇచ్చాయి. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల నిర్మాణ బాధ్యతలు చేపట్టిన సంస్థలన్నీ ఒకే అభిప్రాయాన్ని కమిషన్ ముందు వ్యక్తం చేశాయి. పనులు శరవేంగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఒత్తిడి పెంచిందని చెప్పాయి. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా, ప్రభుత్వం అందించిన డిజైన్ల ప్రకారమే గడువులోగా పనులు పూర్తిచేసి బ్యారేజీలను అప్పగించామని తెలిపాయి. దీంతో వాస్తవాలు, కమిషన్‌కు నివేదించిన అంశాలన్నింటినీ అఫిడవిట్ల రూపంలో ఈ నెల 25లోగా అందించాలని ఆయా సంస్థలను జస్టిస్ ఘోష్ ఆదేశించారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ సంస్థ అయిన ఎల్‌అండ్‌టీ తరఫున ఆ సంస్థ వైస్ చైర్మన్లు ఎంవీ రామకృష్ణరాజు, సురేశ్‌కుమార్ విచారణకు హాజరయ్యారు. అన్నారం బ్యారేజీ నిర్మాణ సంస్థ అఫ్కాన్స్-విజేత జాయింట్ వెంచర్ తరఫున హైడ్రో ప్రాజెక్టుల విభాగాధిపతి కె.మల్లికార్జునరావు, జీఎం శేఖర్‌దాస్, సుందిళ్ల బ్యారేజీ నిర్మాణ సంస్థ నవయుగ నుంచి డైరెక్టర్ ఏడూరి రమేశ్, ప్రాజెక్టు మేనేజర్ కె.ఈశ్వర్‌రావు పాల్గొని కమిషన్‌కు తమ వాదనలు వినిపించారు.
లెక్క ప్రకారమే డి జైన్లు రూపొందించారా.?
బ్యారేజీల నిర్మాణంలో కీలకమైన డిజైన్లకు ఆమోదం తెలిపిన నీటిపారుదల శాఖలోని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్(సీడీవో)లో పనిచేసిన/చేస్తున్న చీఫ్ ఇంజనీర్లు టి.శ్రీనివాస్, వి.మోహన్‌కుమార్‌తో సహా మొత్తం 13 మంది ఇంజనీర్లను కూడా జస్టిస్ పీసీ ఘోష్ బుధవారం విచారించారు. ఏయే అంశాలను ప్రామాణికం చేసుకొని డి జైన్లు రూపొందించారు? వాటిని రూపొందించింది మీరేనా? ఇతరులు ఇచ్చిన డిజైన్లకు మీరు ఆమోదం తెలిపారా? ఆమోదించే క్రమంలో ఏమైనా ఒత్తిడి ఉందా? నిర్మాణం జరిగే క్రమంలో డిజైన్లలో మధ్యలో మార్పులేమైనా చోటుచేసుకున్నాయా? షీట్ ఫైల్స్‌కు బదులుగా సీకెంట్ ఫైల్స్ వాడటం వల్లే బ్యారేజీలు విఫలమయ్యాయా? వంటి అంశాలపై ఆరా తీశారు. ఇక బ్యారేజీల వద్ద నీటి లభ్యతను తేల్చిన హైడ్రాలజీ విభాగంలోని చీఫ్ ఇంజనీర్‌తో పాటు మరో ఐదుగురు ఇంజనీర్లను కూడా కమిషన్ విచారించింది. అనంతరం కమిషన్ కార్యాలయంలో జస్టిస్ ఘోష్ విలేకరులతో మాట్లాడారు. నిర్మాణ సంస్థలన్నీ నిర్దిష్ట వ్యవధిలోగా పనులు పూర్తిచేయాల్సిందిగా తమకు ఒత్తిళ్లు వచ్చినట్లు చెప్పాయని తెలిపారు. ఇందుకు సంబంధించి ఆ సంస్థలు అఫిడవిట్లు దాఖలు చేశాక.. ఆ ఒత్తిళ్లకు గురిచేసిన వారికి కూడా నోటీసులిచ్చి విచారణకు పిలుస్తామన్నారు.
కొందరు అధికారులు రాష్ట్రంలో లేరు..
బ్యారేజీల నిర్మాణంతో ముడిపడి ఉన్న కొంతమంది అధికారులు రాష్ట్రంలో లేరని జస్టిస్ ఘోష్ తెలిపారు. రాష్ట్రానికి వచ్చాక వారిని కూడా విచారణకు పిలుస్తామని అన్నారు. మరోవైపు విజిలెన్స్ నివేదికలు అందాయని, ఆ నివేదిక ఇచ్చిన అధికారులతో కూడా సమావేశమవుతానని చెప్పారు. ఇక కమిషన్‌కు సహకరించేందుకు ఏర్పాటైన నిపుణుల కమిటీ సభ్యులతో జస్టిస్ ఘోష్ గురువారం సమావేశం కానున్నారు. నిపుణుల కమిటీలో ఎన్‌ఐటీ వరంగల్ రిటైర్డ్ ప్రొఫెసర్ సీబీ కామేశ్వర్‌రావు, రిటైర్డ్ సీఈ కె.సత్యనారాయణ, ఎన్‌ఐటీ వరంగల్ ప్రొఫెసర్ ఎన్.రమణమూర్తి తదితరులున్నారు. వీరు ఇప్పటికే కమిషన్ ఆదేశాలతో బ్యారేజీలను కూడా పరిశీలించి, తగిన నివేదికను కమిషన్‌కు అందించారు.