ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

KCR: మీ కమిషనే చట్ట విరుద్ధం..

ABN, Publish Date - Jun 16 , 2024 | 04:21 AM

‘‘గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నివేదిక ఇవ్వాలన్న అభిప్రాయంతోనే మీరు మాట్లాడుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికే తప్పు జరిగిపోయినట్లు.. ఇక ఆ తప్పు వల్ల జరిగిన ఆర్థిక నష్టాన్ని లెక్కించడం మాత్రమే మిగిలి ఉందన్నట్లు మీ మాటలు స్పష్టం చేస్తున్నాయి.

  • మీకు విచారణార్హత లేదు

  • నిష్పాక్షికత కనిపించట్లేదు.. బాధ్యతల నుంచి తప్పుకోండి

  • విచారణ పూర్తి కాకుండానే తీర్పు ఇచ్చినట్లు మీ మాటలున్నాయి

  • రాజకీయ కక్షతో మమ్మల్ని అప్రతిష్ఠ పాల్జేయడానికే కమిషన్‌ ఏర్పాటు

  • జస్టిస్‌ నర్సింహా రెడ్డికి మాజీ సీఎం కేసీఆర్‌ 12 పేజీల ఘాటు లేఖ

  • మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని వ్యాఖ్య

    న్యాయ ప్రాధికార సంస్థలైన ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ (ఈఆర్సీ)లు వెలువరించిన తీర్పులపై విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమని హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన మీరు ప్రభుత్వానికి సూచించకుండా బాధ్యతలు స్వీకరించడం విచారకరం.

    చట్టవిరుద్ధంగా విచారణ ప్రారంభించారు. అనేక విషయాలను సమగ్రంగా పరిశీలించకుండా, పరిశీలన చేయకుండా పత్రికా విలేకరుల సమావేశంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. విచారణ పూర్తి కాకముందే తీర్పు ఇచ్చినట్లు మీ మాటలున్నాయి. మీ విచారణలో నిష్పాక్షికత కనిపించడం లేదు. మీకు అసలు విచారణార్హత లేదు. విచారణ నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

హైదరాబాద్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): ‘‘గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నివేదిక ఇవ్వాలన్న అభిప్రాయంతోనే మీరు మాట్లాడుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికే తప్పు జరిగిపోయినట్లు.. ఇక ఆ తప్పు వల్ల జరిగిన ఆర్థిక నష్టాన్ని లెక్కించడం మాత్రమే మిగిలి ఉందన్నట్లు మీ మాటలు స్పష్టం చేస్తున్నాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసి పదవీ విరమణ చేసినప్పటికీ మీ తీరు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉంది’’ అంటూ విద్యుత్తు ఒప్పందాలపై విచారణ చేస్తున్న కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఎల్‌. నర్సింహారెడ్డి తీరును మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర స్థాయిలో తప్పుబట్టారు. మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని స్పష్టమవుతోందని దుయ్యబట్టారు. అసలు మీ కమిషన్‌ ఏర్పాటే చట్ట విరుద్ధమని, మీరు విచారణ చేయడం కూడా చట్ట విరుద్ధమేనని, అందుకే విచారణ కమిషన్‌ బాధ్యత నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలని వ్యాఖ్యానించారు. ఛత్తీ్‌సగఢ్‌తో విద్యుత్తు ఒప్పందం, పోటీ బిడ్డింగ్‌ లేకుండా యాదాద్రి ప్లాంట్‌ నిర్మాణం, కాలం చెల్లిన టెక్నాలజీతో భద్రాద్రి పవర్‌ ప్లాంట్‌ నిర్మించారంటూ రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం జస్టిస్‌ ఎల్‌. నర్సింహారెడ్డి కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. విచారణలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్‌కు కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. ‘ఆయా అంశాల్లో మీ పాత్ర ఏమిటో లిఖితపూర్వకంగా వివరాలు అందించాలి. రికార్డులన్నీ పరిశీలిస్తుంటే ఆ నిర్ణయాలన్నీ మీరే తీసుకున్నట్లు కనిపిస్తోంది’ అని ఆ నోటీసుల్లో కమిషన్‌ పేర్కొంది కూడా. ఆ సందర్భంగా జస్టిస్‌ నర్సింహా రెడ్డి విలేకరుల సమావేశంలోనూ మాట్లాడారు.


ఈ నేపథ్యంలోనే, కమిషన్‌ ఇచ్చిన గడువు రోజైన శనివారం జస్టిస్‌ నర్సింహా రెడ్డికి కేసీఆర్‌ 12 పేజీల లేఖ రాశారు. ఆయన తీరుపై తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. తన నిర్ణయాలను సమర్థించుకుంటూనే కనీస అవగాహన లేకుండా మాట్లాడారంటూ జస్టిస్‌ నర్సింహా రెడ్డిపై ఎదురు దాడి చేశారు. రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేశారని ఆక్షేపించారు. ‘‘ఇరుపక్షాల మధ్య ఒక వివాదం తలెత్తినప్పుడు, మధ్యవర్తిగా నిలిచి, అసలు నిజాన్ని నిగ్గు తేల్చాల్సిన బాధ్యత మీది. అన్ని విషయాలను అన్ని కోణాల్లో సమగ్రంగా పరిశీలించి, పూర్తి నిర్ధారణకు వచ్చిన తర్వాత డాక్యుమెంటరీ ఎవిడెన్స్‌ (పత్రాలతో కూడిన సాక్ష్యాలతో)తో బాధ్యులకు మాత్రమే నివేదిక ఇవ్వాల్సిన గురుతరమైన బాధ్యత మీది. కానీ, మీ వ్యవహారశైలి అట్లా లేదని చెప్పడానికి చింతిస్తున్నా’’ అంటూ విరుచుకుపడ్డారు. ఆ లేఖలోని వివరాలు..


ఉభయ రాష్ట్రాల మధ్య ఒప్పందాలను రాష్ట్ర ఈఆర్సీలు పరిశీలించకూడదని, ఆ అధికారం కేంద్ర ఈఆర్సీకి మాత్రమే ఉందని విలేకరుల సమావేశంలో మీరు వ్యాఖ్యానించారు. తద్వారా ఏదో తప్పు జరిగిందనే భావన కలిగేలా మాట్లాడారు. కానీ, ఎలక్ట్రిసిటీ చట్టం 2003లోని సెక్షన్‌ 64(5) ప్రకారం ఈ అధికారం ఎస్‌ఈఆర్సీలకే ఉందని స్పష్టమవుతోంది. దానిని అనుసరించే ఉభయ రాష్ట్రాల ఈఆర్సీలూ వ్యవహరించి తమ తీర్పులను వెలువరించాయి. న్యాయ ప్రాధికార సంస్థలైన ఉభయ రాష్ట్రాల ఈఆర్సీలు అన్ని రకాల పరిశీలనలు జరిపి ఇచ్చిన ఆమోదాలపై తిరిగి విచారణ జరపాలన్న ఆలోచనే దురదృష్టకరం. న్యాయ నిపుణులైన మీరు చట్టాల్లో పొందుపరిచిన అంశాలను పరిగణనలోకి తీసుకోకుండానే న్యాయ ప్రాధికార సంస్థలపై వ్యాఖ్యలు చేయడం విచారకరం. దీనినిబట్టి మీరు విచారణార్హతను కోల్పోయినట్లు స్పష్టమవుతోంది. కనక మీరు ఆ బాధ్యతల నుంచి విరమించుకోండి.


అసాధారణ పరిస్థితుల్లో కొన్ని అసాధారణ నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కరెంటు విషయంలో ఆనాడు తెలంగాణ అలాంటి అసాధారణ సంక్షోభంలోనే ఉంది. తెలంగాణ బిడ్డ అయిన మీరు అప్పట్లో రాష్ట్ర ప్రజలు పడుతున్న అవస్థలను పరిగణనలోకి తీసుకుని అప్పటి ప్రభుత్వం చేపట్టిన చర్యలను అభినందించాల్సింది పోయి.. విమర్శలు చేయడం దురదృష్టకరం.


తెలంగాణలో 2014 నాటికే కొత్త విద్యుత్తు కేంద్రాల నిర్మాణం ప్రారంభించాం. అప్పటికి సబ్‌ క్రిటికల్‌ టెక్నాలజీపై ఎలాంటి నిషేధం కానీ నియంత్రణ కానీ లేదు. సబ్‌ క్రిటికల్‌ థర్మల్‌ ప్లాంట్లు నిర్మించుకోవచ్చని 2017 వరకూ అమల్లో ఉండే 12వ పంచవర్ష ప్రణాళికలోనూ స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని చట్టబద్ధ సంస్థల నుంచి అనుమతులు, ఆమోదాలు తీసుకునే దానిని నిర్మించాం. కానీ, విలేకరుల సమావేశంలో మీరు భద్రాద్రి సబ్‌ క్రిటికల్‌ ప్లాంటుపై విపరీత వ్యాఖ్యలు చేశారు. వాస్తవాలను విస్మరించి తెలంగాణ ప్రభుత్వం చేయరాని తప్పు చేసినట్లు మాట్లాడారు. దురుద్దేశాలు ఆపాదించారు. కనీస పరిజ్ఞానం ఉన్న ఎవరూ కూడా మీ వ్యాఖ్యలను అంగీకరించరు.


రెండేళ్లలోనే ప్లాంటును పూర్తి చేసి ఇస్తామని బీహెచ్‌ఈఎల్‌ లిఖితపూర్వక హామీ ఇచ్చింది. అధిక ధరల భారం రాష్ట్రంపై పడకుండా ఉండాలని నామినేషన్‌ పద్ధతిపై బీహెచ్‌ఈఎల్‌కు పనులు అప్పగించాం. భారీ విద్యుత్కేంద్రాల నిర్మాణానికి మన దేశంలో ఉన్నది బీహెచ్‌ఈఎల్‌ ఒక్కటే. నిర్మాణాన్ని ప్రభుత్వ రంగ సంస్థకు అప్పగిస్తే నామినేషన్‌ పద్ధతిలోనూ ఇవ్వవచ్చు. ఇది చట్టబద్ధమే. కేంద్ర, రాష్ట్ర సంస్థలు, ఎన్టీపీసీ, చివరికి ప్రైవేటు కంపెనీలు కూడా నామినేషన్‌ పద్ధతిపైనే పనులు అప్పగించాయి. నవరత్న కంపెనీల్లో ఒకటైన బీహెచ్‌ఈఎల్‌ పనికిమాలిన సంస్థ అన్నట్లు.. ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయడమే తప్పన్నట్లు మీ మాటలున్నాయి. తెలంగాణ నిర్ణయాన్ని ఎలాగైనా తప్పుబట్టాలనే మీ ప్రీ డిటర్మైన్డ్‌ మైండ్‌ సెట్‌ (ముందే ఒక అభిప్రాయానికి వచ్చి మాట్లాడడం)ని ఇది పట్టి చూపిస్తోంది.


కరోనా, ఎన్జీటీ స్టే వంటి ఎన్నో అవరోధాలను ఎదుర్కొని యాదాద్రి ప్లాంట్‌ను దాదాపు పూర్తి చేశాం. అయినా, వాస్తవాలకు విరుద్ధంగా పనులు అస్సలు కాలేదన్నట్లు మీరు వ్యాఖ్యానించడం అసమంజసం. దురుద్దేశం ఆపాదించేలా నిందలు వేశారు. జ్యుడిషియల్‌ కమిషన్‌ నియమ నిబంధనల్లో దీని గురించి అసలు ప్రస్తావనే లేదు. అయినా, దాని గురించి మాట్లాడి మీరు పరిధి దాటి వ్యవహరించారు. గత ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే మీ ధోరణికి ఇది నిదర్శనం.


ఛత్తీ్‌సగఢ్‌తో 2014లో తెలంగాణ విద్యుత్తు కొనుగోలు ఒప్పందం (పీపీఏ) చేసుకుంది. ఆ ఏడాదే యూనిట్‌ రూ.4.94 చొప్పున తమిళనాడు; యూనిట్‌ రూ.4.33 చొప్పున కర్ణాటక పీపీఏ చేసుకున్నాయి. తెలంగాణ మాత్రం యూనిట్‌ రూ.3.90కే కొంది. అయినా, తెలంగాణ ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చిందని మీరు ఎలా వ్యాఖ్యానిస్తారు!?


పీపీఏ కుదుర్చుకునే సమయంలో తాము మార్వా విద్యుత్తు కేంద్రం నుంచి కరెంటు ఇస్తామని ఛత్తీ్‌సగఢ్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది. మార్వా విద్యుత్తు కొనుగోలుకు పీపీఏ చేసుకోవడం జరిగింది. ఎంవోయూలోనే అప్‌కమింగ్‌ మార్వా ప్రాజెక్టు అని స్పష్టంగా ఉంది. అయినా, మార్వా ప్లాంటే ఉనికిలో లేదన్నట్లు మీరు ఎలా మాట్లాడతారు!? పీపీఏలన్నీ ప్లాంట్ల నిర్మాణం ప్రారంభించడానికి ముందే జరుగుతాయన్న వాస్తవాన్ని విస్మరించి మాట్లాడడం అత్యంత దురదృష్టకరం.


రాజకీయ కక్షతో నన్ను, అప్పటి మా ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాల్జేయడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కరెంటు కోసం అంగలార్చిన తెలంగాణలో అన్ని రంగాలకూ 24 గంటల నాణ్యమైన కరెంటును మేం ఇచ్చాం. దీనిని తక్కువ చేసి చూపించడానికి ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నించడమే అత్యంత దురదృష్టకరం అనుకుంటే.. కమిషన్‌ చైర్మన్‌గా ఉన్న మీరు విలేకరుల సమావేశంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం బాధాకరం. విచారణ కమిషన్‌ సంప్రదాయాలకు విరుద్ధంగా, విచారణ పూర్తి కాకముందే విలేకరుల సమావేశం నిర్వహించారు. విచారణ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీరు చేసిన ఏ వ్యాఖ్యను గమనించినా మీరు గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నివేదిక ఇవ్వాలన్న అభిప్రాయంతోనే మాట్లాడుతున్నట్లు స్పష్టమవుతోంది.


తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు విద్యుత్‌ రంగం అత్యంత సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది. అప్పట్లో రాష్ట్ర స్థాపిత విద్యుత్‌ సామర్థ్యం 7778 మెగావాట్లు. ఆ తర్వాత తీసుకున్న నిర్ణయాలతో అది 20 వేల మెగావాట్లకు చేరింది. అన్ని రంగాలకు 24 గంటలపాటు కరెంట్‌ ఇచ్చే ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. 2014లో తెలంగాణ విద్యుత్‌ వినియోగం 1,196 యూనిట్లు కాగా... పదేళ్లలో 2,349 యూనిట్లకు చేరింది. ఈ విజయాలను ఆషామాషీగా సాధించలేదు.

Updated Date - Jun 16 , 2024 | 04:21 AM

Advertising
Advertising