Ponguleti : చివరి బాధితుడి వరకూ సాయం
ABN , Publish Date - Sep 10 , 2024 | 04:42 AM
వరద బాధితులకు సర్కారు అండగా ఉంటుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
వరద బాధిత కుటుంబాలకు రూ.16,500 చొప్పున పరిహారం
ముంపునకు గురైన ఎకరానికి రూ.10 వేలు
మృతుల కుటుంబాలకు 5లక్షలు, ఇందిరమ్మ ఇల్లు
సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): వరద బాధితులకు సర్కారు అండగా ఉంటుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. చివరి బాధితుడి వరకు సహాయం అందిస్తామని భరోసానిచ్చారు. సోమవారం ఆయన సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శాఖల వారీగా వరద నష్టాన్ని పక్కాగా అంచనా వేయాలని సూచించారు. కేంద్రానికి పంపే నివేదికల్లో ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించి పంపాలని కోరారు. వరద బాధిత ప్రాంతాల్లో దెబ్బతిన్న ప్రతి కుటుంబానికి రూ.16,500 చొప్పున ఆర్థిక సహాయం ప్రభుత్వం అందజేస్తుందన్నారు. ఎలాంటి అక్రమాలకు ఆస్కారం లేకుండా ఆన్‌లైన్ ద్వారా నేరుగా బాధితుల ఖాతాల్లో ఈ నగదు జమ చేస్తామని వెల్లడించారు.
సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఇంటికి రూ.10 వేలు అందజేస్తామని తొలుత ప్రకటించారని, అయితే జరిగిన నష్టాన్ని ఆయన స్వయంగా పరిశీలించాక మానవతా దృక్పథంతో రూ.16,500 ఇవ్వాలని నిర్ణయించారన్నారు. ఈ సహాయాన్ని సోమవారం నుంచే బాధితులకు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాల ప్రకారం లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని, ముంపునకు గురైన ప్రతి ఎకరానికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 358 గ్రామాలు వరద ముంపునకు గురవగా, 2 లక్షల మంది ప్రభావితమైనట్లు చెప్పారు. భారీ వర్షాలు, వరదల వల్ల 33 జిల్లాలను ప్రభావిత జిల్లాలుగా ప్రకటించామని పొంగులేటి తెలిపారు. వర్షాల వల్ల రాష్ట్రంలో 33 మంది మృతి చెందారన్నారు.
ఖమ్మంలో ఆరుగురు, కొత్తగూడెంలో ఐదుగురు, ములుగులో నలుగురు, కామారెడ్డిలో ఇద్దరు, వనపర్తిలో ముగ్గురు మృతి చెందినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ప్రకటించారు. ఇల్లు కూలిపోయిన వారిని గుర్తించి రూ.5 లక్షలతో ఉచితంగా ఇల్లు నిర్మించి ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియను వెంటనే చేపట్టాలన్నారు. దెబ్బతిన్న పంచాయతీరాజ్, రహదారుల భవనాల శాఖ పరిధిలోని రోడ్లను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాలని ఆదేశించారు. ఆసుపత్రులు, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలకు సంబంధించి పాక్షికంగా, పూర్తిగా దెబ్బతిన్న వాటి వివరాలను 24 గంటల్లోపు సచివాలయంలోని ఆయాశాఖల అధిపతులకు పంపాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇళ్లలోకి నీరు చేరి ఆస్తి పత్రాలు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డు, ఇతర ధ్రువ పత్రాలు తడిచిపోయినా, కొట్టుకుపోయిన వారి కోసం స్థానిక పోలీసు స్టేషన్లలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు. అక్కడ దరఖాస్తు చేసుకుంటే పోయిన పత్రాలను ప్రభుత్వం తిరిగి అందించే ఏర్పాటు చేస్తుందని తెలిపారు.
2 ఏజెన్సీల నిర్వాకం వల్లే వరద..
మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న రెండు ఏజెన్సీలు వ్యర్థాలను ప్రభుత్వ భూముల్లో వేయడం వల్లనే సూర్యాపేట, పాలేరుకు భారీ నష్టం జరిగిందని అధికారులు మంత్రి పొంగులేటికి వివరించారు. గుట్టలుగా ఉన్న వ్యర్థాల వల్ల వరద నీరు పారే అవకాశం లేకుండాపోయిందని.. ఈ రెండు ఏజెన్సీలు 18 లక్షల క్యూబిక్ మీటర్ల వ్యర్థాలు నదిలో పోశాయని వెల్లడించారు. దీంతో మంత్రి స్పందిస్తూ.. జరిగిన నష్టాన్ని ఆ రెండు ఏజెన్సీల నుంచి వసూలు చేయాలని గనుల శాఖ అధికారులను ఆదేశించారు. సమీక్షలో సీఎస్ శాంతికుమారి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ , పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.