Share News

Narsapur: రైస్‌ మిల్లర్‌ భూమి వేలం..

ABN , Publish Date - Sep 26 , 2024 | 02:46 AM

కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌) బకాయిల అంశంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. మొండి బకాయిల వసూళ్లకు రైస్‌ మిల్లర్లపై రెవెన్యూ రికవరీ(ఆర్‌ఆర్‌) చట్టాన్ని ఉపయోగిస్తోంది.

Narsapur: రైస్‌ మిల్లర్‌ భూమి వేలం..

  • 1.31 ఎకరాలకు రూ.2.12 కోట్లు.. నర్సాపూర్‌లో ఘటన

  • సీఎంఆర్‌ బకాయిల నేపథ్యంలో రెవెన్యూ రికవరీ చట్టం అమలు

  • మొత్తం బకాయిలు రూ.47 కోట్లు.. గతంలోనే భవనం, స్థలం వేలం

  • ఖమ్మం, మహబూబాబాద్‌ మిల్లుల్లో విజిలెన్స్‌ అధికారుల సోదాలు

నర్సాపూర్‌, కొణిజర్ల, మహబూబాబాద్‌, సెప్టెంబరు 25: కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌) బకాయిల అంశంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. మొండి బకాయిల వసూళ్లకు రైస్‌ మిల్లర్లపై రెవెన్యూ రికవరీ(ఆర్‌ఆర్‌) చట్టాన్ని ఉపయోగిస్తోంది. సదరు మిల్లర్‌ ఆస్తులను జప్తు చేసి వేలం పాటలో విక్రయిస్తోంది. ఇందులో భాగంగా మెదక్‌ జిల్లా నర్సాపూర్‌కు చెందిన శ్రీధర్‌ గుప్తా అనే రైస్‌మిల్లర్‌కు చెందిన 1.31 ఎకరాల భూములకు బుధవారం వేలం పాట నిర్వహించింది. వేర్వేరు వ్యక్తులు రూ.2.12 కోట్లకు ఈ భూమిని వేలంలో సొంతం చేసుకున్నారు. శ్రీధర్‌ గుప్తా రూ.47 కోట్ల విలువైన సీఎంఆర్‌ ధాన్యం బకాయి ఉన్నారు. ఇందుకు సంబంధించి శ్రీధర్‌ గుప్తాకు చెందిన ఆస్తులను అధికారులు ఫిబ్రవరిలోనే జప్తు చేశారు. అదే నెల 27న వేలం నిర్వహించారు. నర్సాపూర్‌లో సదరు వ్యాపారికి చెందిన భవనాన్ని రూ.2.2 కోట్లకు, స్థలాన్ని రూ.40 లక్షలకు పలువురు వేలంలో విక్రయించారు. అదే వ్యాపారికి మాడాపూర్‌, లింగాపూర్‌ పరిధిలో ఉన్న ఎకరా 31 గుంటల భూమికి బుధవారం వేలం జరిగింది. కాగా, ఆస్తుల వేలం ద్వారా వచ్చిన సొమ్మును సదరు రైస్‌మిల్లర్‌ చెల్లించాల్సిన బకాయిలో జమ చేస్తామని అధికారులు తెలిపారు.


  • లాలాపురం, మానుకోటలోని మిల్లుల్లో దాడులు

సీఎంఆర్‌ బకాయిల అంశంలో సివిల్‌ సప్లయ్స్‌, టాస్క్‌ఫోర్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల్లోని రైస్‌ మిల్లుల్లో అధికారులు బుధవారం దాడులు చేశారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం లాలాపురం సమీపంలోని ఎస్‌ఏఆర్‌ రైస్‌ ప్రొడక్ట్స్‌ మిల్లులో రెండ్రోజులు పాటు చేపట్టిన తనిఖీల్లో సీఎంఆర్‌లో 25వేల టన్నుల ధాన్యం వ్యత్యాసం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించి మిల్లు యజమానిపై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. 2022-23 రబీ సీజన్‌, 2023-24 ఖరీఫ్‌ సీజన్లకు గాను ఎస్‌ఏఆర్‌ మిల్లుకు 3,50,622.65 క్వింటాళ్ల ధాన్యాన్ని అప్పగించగా 99,122.68 క్వింటాళ్లను మాత్రమే మర ఆడించారని, మిగిలిన 2,51,499.97 క్వింటాళ్లు తేడా ఉందని అధికారులు పేర్కొన్నారు.


ఆ ధాన్యాన్ని బయటకు తరలించడంతో మిల్లర్‌పై కేసు నమోదు చేశామని తెలిపారు. అయితే, అధికారులు తేల్చిన వ్యత్యాసాన్ని ప్రభుత్వానికి చెల్లిస్తామని మిల్లు యజమాని చెప్పారు. మరోపక్క, మహబూబాబాద్‌ శివారులోని సాయి శ్రీనివాస్‌, శ్రీనివాస ఇండస్ట్రీస్‌ రైస్‌మిల్లులపై అధికారులు బుధవారం దాడులు జరిపారు. ఈ రైస్‌ మిల్లులకు 88,096 క్వింటాళ్ల ధాన్యాన్ని ఇవ్వగా 59వేల క్వింటాళ్ల బియ్యం ఇవ్వాల్సి ఉండగా 3,770 క్వింటాళ్లు మాత్రమే ఇచ్చారని అధికారులు తెలిపారు. దీంతో కొద్ది రోజుల క్రితం ధాన్యం టెండర్లు పిలవగా ఈ మిల్లుల్లో ఉన్న రూ.2.52 కోట్ల విలువైన ధాన్యాన్ని ఓ కాంట్రాక్టర్‌ వేలంలో దక్కించుకున్నారని చెప్పారు. కానీ, రెండు మిల్లులతో పాటు కాంట్రాక్టర్‌కు చెందిన గోదాముల్లో ఉండాల్సిన 82వేల ధాన్యం బస్తాలుకు గాను 54 వేల బస్తాలే ఉన్నట్టు తనిఖీల్లో గుర్తించామని వివరించారు. తక్కువగా ఉన్న ధాన్యం బస్తాలకు కాంట్రాక్టర్‌దే బాధ్యతని పేర్కొన్నారు.


బిడ్డర్లకు మరో 3 నెలల గడువు!

  • ఇంకా రైస్‌ మిల్లుల్లోనే 25 లక్షల టన్నుల ‘టెండర్‌’ ధాన్యం..

హైదరాబాద్‌, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): వేలంలో బిడ్డర్లు దక్కించుకున్న 35 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యానికి సంబంధించిన సొమ్ము రికవరీ నత్త నడకన సాగుతోంది. ఇప్పటికే 9 నెలల గడువు ఇచ్చినా కాంట్రాక్టు ఏజెన్సీలు ధాన్యం లిఫ్టింగ్‌ పూర్తి చేసి పౌరసరఫరాల సంస్థకు డబ్బులు చెల్లించకపోవటంతో.. తాజాగా మరో 3 నెలల గడువు ఇచ్చారు. ఇలా గడువు పొడిగించడం ఇది మూడోసారి. టెండర్ల అగ్రిమెంట్‌ పూర్తిచేసినప్పటి నుంచి ఇప్పటివరకు కేవలం 10 లక్షల మెట్రిక్‌ టన్నులే తీసుకెళ్లారు. ఇంకా 25 లక్షల టన్నుల ధాన్యం రైస్‌మిల్లులోనే మూలుగుతోంది. దీంతో చాలా సమస్యలు తలెత్తుతున్నాయి.


ఇప్పటికే రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ రూ.50 వేల కోట్ల పైచిలుకు అప్పుల్లో ఉంది. 2022-23 యాసంగి సీజన్‌కు సంబంధించిన ధాన్యం విక్రయిస్తే.. రూ.7 వేల కోట్ల తక్షణ ఆదాయం వస్తుందనే ఆలోచనతో ప్రభుత్వం టెండర్లు పిలిచింది. కానీ ఇప్పటివరకు రూ.2 వేల కోట్లు మాత్రమే రికవరీ అయ్యాయి. ఇంకా రూ.5 వేల కోట్లు రావాల్సి ఉంది. కాగా, టెండరు ధాన్యం తీసుకెళ్లేందుకు బిడ్డర్లకు ఇప్పటివరకు ఇచ్చిన గడువు చాలా ఎక్కువని, మరోసారి గడువు పొడిగించవద్దంటూ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌కు బీజేపీ శాసనసభాపక్ష ఉపనేత, ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ ఇటీవలే లేఖ రాశారు. టెండర్ల పద్ధతిలో జరిగిన లోపభూయిష్ట విధానాల ద్వారా ఇప్పటికే కార్పొరేషన్‌కు రూ.850 కోట్ల నష్టం వాటిల్లిందని లేఖలో పేర్కొన్నారు.

Updated Date - Sep 26 , 2024 | 02:46 AM